తెలుగు వణిజులు | Sakshi
Sakshi News home page

తెలుగు వణిజులు

Published Fri, Oct 10 2014 11:59 PM

తెలుగు వణిజులు

గణపతిదేవుని జైత్రయాత్రల వల్ల 12వ శతాబ్దిలో కోస్తాంధ్ర కాకతీయుల ఆధిపత్యంలోకి వచ్చింది. వరంగల్లు ఆంధ్రనగరి అయింది. 5వ శతాబ్దంలో అడుగంటిన విదేశీ వాణిజ్యం 10వ శతాబ్దికి మళ్ళీ పుంజుకుంది. కళింగపట్టణం (ముఖలింగం), భీమునిపట్టణం, కోకండిపర్రు (కాకినాడ), నరసాపురం, హంసలదీవి, మోటుపల్లి, కాల్పట్టణం (ఒంగోలు వద్ద పాదర్తి), కృష్ణపట్నం, గండగోపాలపట్టణం (పులికాట్) మొదలైనవి ప్రముఖ ఓడరేవులుగా ఎదిగాయి.

ఆంధ్రవర్తకులు సంఘాలుగా ఏర్పడి బర్మా, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియా, వియెత్నాం, చైనా దేశాలతో నౌకా వాణిజ్యం సాగించారు. ఎర్రసముద్రం, గల్ఫ్ దేశాల నుండి వచ్చే అరబీ వర్తకులు గుర్రాలు, తగరం, దంతం, ఆయుధాలు ఆంధ్రరేవులకి తెచ్చి ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు, నూలు, పట్టువస్త్రాలు కొనుగోలు చేసేవారు.
 
ఆంధ్రతీరాన్ని పరిపాలించిన రాజులకు రేవు వర్తకం నుంచి కస్టమ్స్, సేల్స్ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం చాలా ముఖ్యమైనది. అడ్డపట్టం, చీరాను, గండం, పవడం, పట్టి అనే పేర్లతో అనేక పన్నులు ఉండేవి. బంగారం విలువ నిర్ణయించేందుకు పొన్ను వెలగాళ్ళనే అధికారులు ఉండేవారు. ప్రతి రేవు వద్దా సుంకాధికారులతో కూడిన అధికార యంత్రాంగం ఉండేది. వర్తకులకు పన్నుల వివరాలు, వర్తకాన్ని ప్రోత్సహించే స్కీముల వివరాలు తెలిపే శాసనాలు రేవు పట్టణాలలో కనిపిస్తాయి. క్రీ.శ. 1150లో కాకతీయ గణపతిదేవుడు, 1280లో రెడ్డిరాజు అనపోతయరెడ్డి మోటుపల్లిలో వేయించిన శాననాలు వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు వర్తకులకు ఇచ్చిన సదుపాయాలు, హామీలు, పన్నులపై మినహాయింపులు తెలుపుతాయి. మోటుపల్లికి వచ్చిన వర్తకులకి ఉచితంగా గృహాలు, గిడ్డంగులకి భూములూ ఇచ్చి ప్రోత్సహించారు.  హరవిలాసం అంకితం తీసుకున్న అవచి తిప్పయశెట్టి గురించి శ్రీనాథుడు చెప్పిన ఈ పద్యం ఆనాటి వైశ్యులు సాగించిన విదేశీ వాణిజ్యానికి అద్దం పడుతుంది.
 తరుణాసీరి తవాయి గోప రమణా స్థానంబులం జందనా
 గరు కర్పూర హిమంబు కుంకుమ రజఃకస్తూరికా ద్రవ్యముల్
 శరధిస్ కల్పలి, జోంగు, వల్లి వలికా సమ్మన్ల, దెప్పించు నే
 ర్పరియై వైశ్యకులోత్తముం డవచి తిప్పండల్పుడే యిమ్మిహన్
 ఇందులో తరుణసీరి బర్మాలోని తెన్నసెరిం, తవాయి థాయ్‌లాండ్, రమణా అంటే బర్మాలో రామన్న దేశం అనే రంగూన్ ప్రాంతం. ఇవేగాక, పంజారం అంటే సుమత్రాదీవిలోని పాన్‌సార్, యాంప అంటే శ్రీలంకలోని జాఫ్నా, బోట అంటే భూటాన్, హరుమూజి అంటే గల్ఫ్‌లోని హోర్ముజ్; ఇలా అనేక విదేశీ రేవుల ప్రస్తావన హరవిలాసంలో కనిపిస్తుంది. కప్పలి, జోంగు మొదలైనవి ఆనాటి ఓడల్లో రకాలు. కప్పలి నేటి తమిళనాడులో కనిపించే కప్పళ్, జోంగ్ ఇంగ్లిష్‌లో జన్క్ అనబడే చైనా నౌక, వల్లీ, వలికా అనేవి వణిజ అనే పదం నుండి వచ్చిన తెలుగు వర్తకుల నావలు. సమ్మన్ అంటే చైనావాళ్ళ చిన్న నౌక సాంపాంగ్.
 
క్రీ.శ. 1194లో రుద్రమదేవి పాలనలో ఉన్న మోటుపల్లిలో దిగిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో, చైనా రేవుల్లో ఇండియా నౌకలే అతి పెద్దవి అన్నాడు. అప్పు ఎగవేస్తే అది వసూలు చేసుకునేందుకు దొరికిన వాడి చుట్టూ గిరిగీసి వీధిలో నిలబెట్టడం అనే ఆచారాన్ని మోటుపల్లిలో చూసినట్లు మార్కోపోలో రాశాడు. ఎంతటి రాజయినా సరే అప్పు తీర్చడమో లేదా ఏదైనా పరిష్కారమో చూపి ఋణదాత ఒప్పుకుంటేనే తప్ప ఆ గీసిన గీత దాటలేడని చెప్పాడు.
 

Advertisement
Advertisement