బదిలీల టెన్షన్ | Sakshi
Sakshi News home page

బదిలీల టెన్షన్

Published Mon, Aug 4 2014 12:53 AM

బదిలీల టెన్షన్

  •   మంత్రివర్గ నిర్ణయంతో నిషేధం ఎత్తివేత
  •   ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు
  •   ఆందోళనలో ఉద్యోగులు
  • విజయవాడ : ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్ మొదలైంది. మూడు రోజుల కిందట జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నెల రోజుల పాటు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదికిక బదిలీలు ఉండవని భావిస్తున్న తరుణంలో పిడుగులాంటి ఈ నిర్ణయంతో అంతా కలవరపడుతున్నారు.

    ఇప్పటికే  విద్యాసంవత్సరం ప్రారంభమై పిల్లల్ని పాఠశాలలు, కళాశాలల్లో చేర్చిన సమయంలో బదిలీలు చేస్తే  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. బదిలీలపై నిషేధం ఎత్తివేసినప్పటికీ  నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. బదిలీలు రిక్వెస్ట్ చేసిన వారికి మాత్రమే చేస్తారా.. లేదా సీనియారిటీ ఆధారంగా అందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సిఉంది.   

    ఒకవేళ సీనియారిటీ ఆధారంగా పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తే  ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.  ఏటా జూన్‌లో ఒకే ప్రాంతంలో ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్నవారిని కౌన్సెలింగ్‌కు పిలిచి బదిలీలు నిర్వహించేవారు. అలా ఒక కార్యాలయం, సంస్థలో పనిచేస్తున్న వారిని 20 శాతానికి మించకుండా బదిలీ చేసేవారు. ప్రస్తుతం సీనియారిటీ ప్రకారం కాకుండా రిక్వెస్ట్, మ్యూచువల్, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్‌పరంగా చేస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
     
    ఆగస్టులో బదిలీలా..
     
    ఈ ఏడాదికి బదిలీలు ఉండవ నే ఉద్దేశంతో ఉద్యోగులు తాము పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరలోని విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్చినట్లు చెబుతున్నారు. వేలాది రూపాయల ఫీజులు కూడా చెల్లించారు. ఇప్పుడు అకస్మికంగా బదిలీలు చేస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జోనల్ కేడర్ ఉద్యోగులు వేరే జిల్లాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అలాంటివారికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
     
    తమవారిని నియమించుకునేందుకేనా..

     
    తమకు అనువైన ఉద్యోగులను నియమించుకునేందుకే ప్రభుత్వం బదిలీలపై నిపేధం ఎత్తివేసినట్లు ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.  పలు కార్యాలయాల్లో కీలక పోస్టుల కోసం ఉద్యోగులు పాలకులు చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. తమవారిని సీటులో కూర్చోపెట్టేందుకు ఎవరిపై బదిలీవేటు వేస్తారోనని ఉద్యోగులు భయపడుతున్నారు. బదిలీల విషయంలో వివిధ సంఘాల నాయకులు నోరు మెదపకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కీలక పోస్టుల గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలతో తమ జేబులు కూడా నింపుకోవచ్చని మరికొందరు ఉత్సాహపడుతున్నారు. దీంతో   బదిలీలు నిలుపుకొనేందుకు కొందరు, కోరుకున్న పోస్టుకోసం మరికొందరు బేరసారాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
     

Advertisement
Advertisement