Sakshi News home page

గుండెపోటు.. పరీక్షలు

Published Thu, Dec 8 2016 12:14 AM

గుండెపోటు.. పరీక్షలు

మనలోని ప్రతి అవయవానికి నిరంతరం రక్తం సరఫరా అయి తీరాలి. గుండెకు కూడా. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అకస్మాత్తుగా మూసుకుపోతే గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోయి రక్తం ద్వారా అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దాంతో గుండె కండరం దెబ్బతినడం మొదలవుతుంది. అలాంటప్పుడు ఆరు నుంచి పన్నెండు గంటల్లో దానికి అందాల్సిన పాళ్లలో రక్తసరఫరాను పునరుద్ధరించలేకపోతే... ఇకపై మళ్లీ ఎప్పటికీ కోలుకోలేనంతగా శాశ్వతంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది.

ఒకసారి గుండెకండరం శాశ్వతంగా చచ్చుబడితే... దాని వల్ల శరీరంలోని మిగతా అన్ని అవయవాలకూ రక్తం అందకుండాపోయిన మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎంత త్వరగా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించగలిగితే అంత మంచిది. ఎంత త్వరగా గుండె కండరాన్ని చచ్చుబడకుండా చూస్తే అంత సమర్థంగా రోగికి  మరణాన్ని తప్పించినట్లవుతుంది. అందుకే గుండెపోటును నిర్ధారణ చేసే పరీక్షలు వెంటనే చేయించాలి.

హార్ట్ ఎటాక్ నిర్ధారణకు పరీక్షలు...
ఈసీజీ: ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. గుండెపోటు అయితే 80, 90 శాతం కేసుల్లో ఆ విషయం నిర్ధారణ అవుతుంది. అంతేకాదు... గతంలో వారికి గుండెపోటు వచ్చి ఉండి, ఆ విషయం రోగికి తెలియకున్నా ఈ పరీక్షతో గతంలో వచ్చిన గుండెపోటునూ గుర్తించవచ్చు.అయితే కొన్నిసార్లు చాలా చిన్న గుండెపోటును ఈసీజీ గుర్తించలేకపోవచ్చు. అయితే ఈసీజీ గతంలోని గుండెజబ్బుల విషయంలో కొన్ని క్లూస్ ఇస్తుంది.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. అది ఇచ్చే క్లూస్ అన్నీ నూరు శాతం కచ్చితం కాకపోవచ్చు. అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకుండా, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే గుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా గుండెపోటు వల్ల కలిగే మార్పులను ఈ పరీక్ష వెంటనే నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులు లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు.

ఎకో పరీక్ష : గుండెస్పందనల్లోని మార్పులు, గుండె కండరంలో వచ్చిన మార్పులను ఎకో పరీక్ష తెలుపుతుంది. ఇక గుండెపోటు వచ్చినప్పుడు గుండెస్పందనల్లో మార్పులు రావచ్చు కాబట్టి గుండెపోటు నిర్ధారణ కోసం ఎకో పరీక్షపైనా ఆధారపడవచ్చు. పైగా గుండెజబ్బు వల్ల ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకునేందుకు ఎకో పరీక్షలో అవకాశాలు 95 శాతం కంటే ఎక్కువ. కాకపోతే ఈ పరీక్ష ఈసీజీ కంటే కాస్తంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కాకపోతే దీన్ని తప్పనిసరిగా ఎకో పరీక్ష నిర్వహించడంలో తర్ఫీదు పొందిన నైపుణ్యం కలిగిన కార్డియాలజిస్టులే నిర్వహించాలి.

హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు : గుండెపోటు వచ్చిన 4 గంటల లోపే రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌ల పాళ్లు పెరుగుతాయి. ఈ పరీక్ష ద్వారా ఆ విషయం నిర్ధారణ అయితే, ఎంత చిన్న గుండెపోటు అయినప్పటికీ అది తప్పనిసరిగా గుండెపోటే అన్న విషయం కచ్చితంగా నిర్ధారణవుతుంది.

యాంజియోగ్రామ్:  గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేకపోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా ఈ పరీక్ష వాటిని సమకూరుస్తుంది. దాంతోపాటు గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి కచ్చితంగా తెలుస్తాయి. అయితే ఈసీజీ, ఎకోలతో పోలిస్తే ఈ పరీక్షకు అయ్యే ఖర్చు ఎక్కువ. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి.
 
-డాక్టర్ అనుజ్ కపాడియా
 సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్
,బంజారాహిల్స్
 హైదరాబాద్
.

Advertisement
Advertisement