కృతజ్ఞత | Sakshi
Sakshi News home page

కృతజ్ఞత

Published Sat, Mar 21 2015 10:36 PM

కృతజ్ఞత

కథ
 
రామయ్య రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని తీసుకువచ్చేవాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో అతని జీవితం గడిచేది. రామయ్య ప్రతిరోజూ పెందలాడే అడవికి బయలుదేరేవాడు. ఆతని భార్య చీకటితోనే లేచి భోజనం సిద్ధం చేసి ఇచ్చేది.
 మధ్యాహ్నం వరకు కట్టెలు కొట్టి రామయ్య ఒక నీటి కాలువ ఒడ్డున ఉన్న ఒక చెట్టు నీడ పట్టున భోజనానికి కూర్చునే వాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక రామచిలుక అక్కడికి వచ్చేది. రామయ్యకు కొద్ది దూరంలో నేల మీద వాలేది. అతను తన ఆహారంలోంచి కొంత చిలుకకు పెట్టేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది.

ఒకరోజు అడవికి వెళ్ళి రామయ్య కొద్దిసేపు కట్టెలు కొట్టాడు. దాహం వేయడం తో దగ్గరలోనే ఉన్న నీటి కుంటలో మర్రి ఆకులతో చేసిన దోనెతో నీళ్ళు ముంచుకు న్నాడు. అతను అవి తాగబోయేంతలో చిలుక రివ్వున వచ్చి దోనెను తన్నింది. దోనె చిరిగి పోయింది. రామయ్య దోసిలితో నీళ్ళు తాగబోయాడు. చిలుక మళ్లీ వచ్చి అతని చేతి మీద కొట్టింది. ఇలా రెండు మూడుసార్లు జరిగేసరికి నీరు తాగకుండా చేసినందుకు చిలుకపై రామయ్యకు చాలా కోపం వచ్చింది. ఒక మట్టిబెడ్డ తీసుకుని దాని మీదకు విసిరాడు. మట్టిబెడ్డ చిలుక కాలికి తాకడంతో దానికి గాయమైంది.

రామయ్య తిరిగి నీళ్ళు తాగాలనుకు న్నాడు. ఎందుకో అతనికి త్రాగాలనిపించక వెనుకకు మరిలాడు. అలా వస్తుండగా కొద్ది దూరంలో కొన్ని జంతువులు చనిపోయి కనిపించాయి. కుంటలోని నీరు తాగి జంతువులు చనిపోయి ఉంటాయని గ్రహించాడు. నీటికుంటలో ఏదో విషం కలిసి ఉంటుంది. ఆ విషయం గ్రహించిన చిలుక తనను నీళ్ళు త్రాగకుండా అడ్డుపడిందని అర్థం అయ్యింది రామయ్యకు. వెనకకు తిరిగి వెళ్ళాడు. గాయంతో నేల మీద పడున్న చిలుకను చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరాడు.

‘ఈ మూగప్రాణులు ఎంత కృతజ్ఞతగా ఉంటాయి! చిలుకకు కొన్నిరోజులు పిడికెడు మెతుకులు పెట్టాడు. ఆ మాత్రానికే అది తన ప్రాణాలను కాపాడింది’ అని ఆర్ద్రంగా అనుకున్నాడు రామయ్య.
 
 

Advertisement
Advertisement