ఓటమి కూడా ముఖ్యమే... | Sakshi
Sakshi News home page

ఓటమి కూడా ముఖ్యమే...

Published Fri, Aug 8 2014 10:55 PM

ఓటమి కూడా ముఖ్యమే... - Sakshi

వ్యాపారం కావొచ్చు.. మరే దైనా కావొచ్చు గెలుపు ఎంత ముఖ్యమో .. ఓటమి కూడా అంతే ముఖ్యం. తొలి ప్రయత్నమైనా మలి ప్రయత్నమైనా ఓటమి ఎదురైతే కుంగిపోకుండా.. దాన్నుంచి నేర్చుకోగలిగితే అదే విజయానికి బాటలు వేస్తుంది. అందుకే గూగుల్, ఫేస్‌బుక్ వంటి స్టార్టప్ కంపెనీలకు పుట్టిల్లయిన అమెరికాలో ఎంట్రప్రెన్యూర్లు ఓటమికి కూడా చాలా ప్రాధాన్యమిస్తారు.

ఏదైనా మొదలుపెట్టేందుకు నిధుల కోసం వెడితే.. ఇన్వెస్టర్లు మిగతా వాటితో పాటు ప్రధానంగా దృష్టి పెట్టేది .. ఫెయిల్యూర్ స్టోరీ ఏదైనా ఉందా అన్నదాని మీదే. అలాంటివి ఒక్కటైనా లేకపోతే.. నిధులు దొరకడం కష్టమే. దీని వెనుక బలమైన కారణమే ఉంది. డబ్బు, వ్యాపారం ఏదైనా సరే పోగొట్టుకుంటే గానీ వాటి విలువ గురించి తెలియదు.

ఆ ఫెయిల్యూర్‌లో నుంచి పుట్టే కసే... విజయం ఎలా సాధించాలన్నది నేర్పుతుంది. అందుకే ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, ఇన్వెంటర్లు దీనికీ ప్రాధాన్యం ఎక్కువ ఇస్తుంటారు. బల్బును కనుక్కునే ప్రయత్నంలో పదివేల సార్లు విఫలమైనప్పటికీ.. థామస్ ఆల్వా ఎడిసన్ దాన్ని వైఫల్యంగా తీసుకోలేదు. నేనేమీ ఫెయిల్ కాలేదు.. బల్బు తయారీకి ఉపయోగపడని పదివేల పద్ధతులు కనుగొన్నానంతే, ఇదీ అనుభవమేనన్నాడు.
 
కాబట్టి ఎందులో ఫెయిలయ్యాము, ఎలా అధిగమించగలిగాము, దాన్నుంచి ఏం నేర్చుకున్నాము అన్నది చాలా కీలకం. అలాగే, గమ్యంపైనే గురి ఉన్నా.. ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఫెయిల్యూర్ ఇస్తుంది. దాన్ని అందిపుచ్చుకోండి. ఫెయిలవ్వడం వల్ల అప్పటికి గెలవలేకపోయినా ఎంతో విలువైన అనుభవం వస్తుంది కదా. సెలబ్రేట్ చేసుకోండి. ఇక విమర్శలు ఎదురైతే హుందాగా స్వీకరించండి.

కలిసిన ప్రతీ ఒక్కరి దగ్గర్నుంచి నేర్చుకోతగిన అంశం ఏదో ఒకటి ఉంటుంది. నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ చుట్టూ మీ కన్నా తెలివైన వారూ, అనుభవజ్ఞులూ ఉండేలా చూసుకోండి. బ్రిటీషర్ల మాదిరిగా గాకుండా అమెరికన్ ఎంట్రప్రెన్యూర్ల తరహాలో మీ ప్రయత్నాల్లో చుట్టూ ఉన్నవారినీ భాగస్వాములను చేయండి. వారికి సముచిత ప్రతిఫలం అందేలా చూడండి. గమ్యాన్ని చేరడంతో పాటు ప్రయాణాన్నీ ఆస్వాదించండి.
 
ఇలాంటి చిట్కాలు మీ దగ్గరా ఉన్నాయా?
 
పొదుపు, పెట్టుబడులు, మనీ మేనేజ్‌మెంటుకి సంబంధించి మీకు తెలిసిన, మీరు పాటించే వైవిధ్యమైన చిట్కాలు, విధానాలేమైనా ఉంటే మాకు రాయండి. అలాగే, ఇల్లు, వాహనం, ఉన్నత విద్య మొదలైన లక్ష్యాల సాధన కోసం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళికలు (డౌన్‌పేమెంట్లు, మార్జిన్లు సమకూర్చుకోవడం, క్రమం తప్పకుండా ఈఎంఐలు కట్టేందుకు ప్లానింగ్ చేసుకోవడం వంటివి) సాధించిన విజయాలను మాతో పంచుకోండి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement