నమ్మినవారికీ... సమస్యలుంటాయా? | Sakshi
Sakshi News home page

నమ్మినవారికీ... సమస్యలుంటాయా?

Published Sun, Nov 13 2016 12:36 AM

నమ్మినవారికీ... సమస్యలుంటాయా?

సువార్త

చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టి, మట్టి కప్పినంత తేలిక కాదు... ఒక జీవితాన్ని కట్టడం. అది దేవునికే సాధ్యం. మరియ, మార్తల ముద్దుల తమ్ముడు బేతనియకు చెందిన లాజరు. అతను యేసుకు కూడా ఎంతో ప్రియుడు. యూదు సమాజం దాదాపుగా వెలివేసిన యేసును వీళ్లు ఎంతో ప్రేమించడం - వారి బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటి లాజరు రోగంతో, మరణశయ్య మీదున్నాడు. యేసును ప్రేమించేవారికి కూడా రోగాలు, సమస్యలు వస్తాయా? అన్న తరతరాల ప్రశ్న అక్కడా తలెత్తింది.

లాజరు మరణశయ్యపై ఉన్నాడని మరియ, మార్తలు పంపిన కబురందుకున్న యేసు వెంటనే రాకుండా కావాలనే ఆలస్యం చేశారు (యోహాను 11:6). యేసులో అసలు మహిమలున్నాయా? అన్న వివాదం అప్పటికే చెలరేగుతోంది. యెరూషలేములో యేసు ఒక గుడ్డివాని కళ్లు తెరిచాడు. నేల మీద తన ఉమ్మితో ఆయన బురద చేసి, దాన్ని అతని కళ్లకు పూసి, వెళ్లి కోనేట్లో కడుకొమ్మన్నాడు. యేసే తనకు కళ్లిచ్చాడంటూ ఆతడు అంతటా ప్రకటించడం సంచలనమైంది. ‘ఆయన నీకు బురద పూసినపుడు అంధుడవు కదా, ఆయనే యేసు అని ఎలా తెలుసు?’ అన్న ఎదురు ప్రశ్నతో యేసు శత్రువులతణ్ణి ఇరకాటంలో పెట్టి అదంతా అబద్ధమని ప్రచారం చేశారు. యేసు అనుచరులు మాత్రం మౌనం దాల్చారు. ‘అసత్యం’ ధాటికి ‘సత్యం’ ఒక్కొక్కసారి మౌనం వహించాల్సిందే!

ఈ నేపథ్యంలో యేసు వచ్చి లాజరును బాగు చేస్తే తమకు బలమొస్తుందని యేసు అనుచరులు, ఆయన రాకపోతే యేసు చరిత్రను సమాప్తం చేయవచ్చని ఆయన శత్రువులూ ఎదురు చూశారు. అయితే యేసు రాలేదు; లాజరు చనిపోగా అతణ్ణి పాతిపెట్టారు. దాంతో యేసు శత్రువులకు వెయ్యేనుగుల బలం రాగా, విశ్వాసులు కృంగిపోయారు. ‘ఆ గుడ్డివాని కళ్లు తెరిచిన యేసు, లాజరు చనిపోకుండా ఆపలేడా?’ అని అక్కడున్న వారు ఎకసక్కాలాడారు (యోహాను 11:37). మహిమలు లేవు కాబట్టే యేసు మొహం చాటేశాడని శత్రువులు ఢంకా బజాయించారు.

అయితే లాజరు చనిపోయిన నాలుగు రోజులకు యేసు వచ్చాడు. లాజరును సమాధిలో నుండి పిలిచి మరీ అతణ్ణి సజీవుణ్ణి చేశాడు. అది మరింత సంచలనమైంది! అంధుని ఉదంతాన్ని ఆయన రహస్యంగా చేసినందుకు వివాదాస్పదం చేసిన శత్రువుల నోళ్లకిపుడు శాశ్వతంగా తాళాలుపడ్డాయి. ఎందుకంటే లాజరును సమాధి చేసినవాళ్లంతా ఇప్పుడతణ్ణి సజీవంగా చూస్తున్నారు. దాంతో యేసు దేవుడన్న ‘సత్యం’ స్పష్టమైంది. యేసు అనుచరులు కూడా ఆయన రోగాలు బాగు చేసి మరణం బారిన పడకుండా ఆపేవాడే కాదు, చనిపోయినా ప్రాణంపోయగల శక్తిసంపన్నుడని ఎరిగి, విశ్వాసంతో మరో మెట్టెక్కారు.

జీవితాల్లో సమస్యలు తీవ్రమైనపుడు, పరిష్కారాలు ఆలస్యమైనపుడు బాధపడకూడదు. దేవుడు తన సంపూర్ణ శక్తి నిరూపణకు సిద్ధమవుతున్నాడని విశ్వాసులు అర్థం చేసుకోవాలి. అసత్యానికి నోరెక్కువ, హోరెక్కువ! సత్యానిది మాత్రం కొండల్ని పెకలించగల మహాప్రవాహ నిశ్శబ్ద శక్తి!! ఆలస్యాలు అనూహ్యమైన దేవుని ఆశీర్వాదాలనిచ్చే ద్వారాలు. సత్యానిదెపుడూ చేతల భాష, విశ్వాసిని బలపరిచేబాట!!     - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్

Advertisement
Advertisement