చర్మంలోకి గోరు పెరుగుతుంది... ఏం చేయాలి? | Sakshi
Sakshi News home page

చర్మంలోకి గోరు పెరుగుతుంది... ఏం చేయాలి?

Published Fri, Jul 29 2016 12:15 AM

చర్మంలోకి గోరు పెరుగుతుంది... ఏం చేయాలి?

డెర్మటాలజీ కౌన్సెలింగ్


నా వయసు 22 ఏళ్లు. నేను కొన్ని నెలల నుంచి షూ తొడుక్కోలేకపోతున్నాను. కారణం... నా కాలి బొటనవేలి గోరు చర్మం లోపలికి పెరుగుతోంది. దీని వల్ల అప్పుడప్పుడూ నొప్పి కూడా వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - శివరామ్, మహబూబ్‌నగర్
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ గోరు చర్మం లోపలివైపునకు పెరుగుతోందని తెలుస్తోంది. ఈ సమస్యను ఒనైకోక్రిప్టోసిస్ లేదా అన్‌గ్యువస్ ఇన్‌కార్నేటస్ అంటారు. దీనికి కారణలు :  మీకు సరిపడని పాదరక్షలు (మరీ ముఖ్యంగా మీరు 21 ఏళ్లలోపు ఉన్నప్పుడు) ధరించడం.  మీ సైజు కంటే చిన్నవైన షూ అదేపనిగా తొడుగుతూ ఉండటం.  మీ గోళ్ల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం... అంటే మీ గోరును అంచుల వెంట చాలా లోతుగా కట్ చేసి ఉండటం  ఏదైనా ప్రమాదంలో మీ గోటికి గాయం కావడం.


చికిత్స : మందులతో చేయాల్సిన చికిత్సల్లో భాగంగా మీకు ఐదు రోజుల పాటు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి.   యాంటీ ఇన్‌ఫ్లమేటరీ టాబ్లెట్స్ కూడా ఉపయోగించాలి. అయితే వీటన్నింటినీ డాక్టర్ సలహా మేరకే వాడాలి.

ఇక మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి..
కాస్తంత గోరు వెచ్చగా ఉన్న నీటిలో ఉప్పు వేసి, మీ గోటిని రోజుకు మూడు సార్లు ఆ నీటితో తడపాలి.  అప్పటికీ సమస్య అదేపనిగా బాధిస్తూ ఉంటే... గోటి లోపలి వైపునకు  పెరుగుదలను అరికట్టే పార్షియల్ వెడ్జ్ రిసక్షన్ అనే (గోటిని పాక్షికంగా తొలగించే)  శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.

 

నా వయసు 42 ఏళ్లు. అండర్‌వేర్ ధరించే చోట చర్మం మడతలలో ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. దురదగా కూడా ఉంటోంది. పరిష్కారం చూపండి.   - సూరిబాబు, నల్లగొండ
మీ లక్షణాలను బట్టి మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినాఫిన్ కాంబినేషన్ ఉన్న క్రీమును 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం రాయాలి. ఆ తర్వాత ప్లెయిన్ టర్బినఫిన్ ఉన్న క్రీము మరో పదిరోజుల పాటు ఉదయం,  సాయంత్రం రాయాలి. దీంతోపాటు మీరు ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. మీరు ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్

Advertisement
Advertisement