సంతోషమే జీవితప్రయోజనం! | Sakshi
Sakshi News home page

సంతోషమే జీవితప్రయోజనం!

Published Mon, Sep 8 2014 11:21 PM

సంతోషమే జీవితప్రయోజనం!

 గ్రంథపు చెక్క
 
మానవులందు జ్ఞానము అంకురించినది మొదలు ‘‘నేను ఎవ్వడను? ఎచ్చట నుండి వచ్చితిని? ఎచ్చటికి పోవుచున్నాను? మరణమే నా స్థితికి అంత్యమా  లేక మరనంతర జీవితము కలదా? మానవకోటి యందు ఇట్టి వివిధత్వమునకు కారణములేమి?

 సృష్టికర్త ఉన్నాడా?
 ఉండిన యే ఉద్దేశముతో  ఇట్టి విచిత్రమైన సృష్టిని గావించు చున్నాడు. ఒకడు సుఖింపనేల, మరి యొకడు దుఃఖింపనేల? ఇట్టి ప్రశ్నలు, విచారములు, సంశయములు పొటమరించు చుండెను. నాటి నుండి నేటి వరకు ఇట్టి ప్రశ్నలడుగబడుచున్నవి. ఒక్కొక్క దేశమున ఒక్కొక్కకాలమున ఒక్కొక్క మతము ఇటువంటి సమస్యల చిక్కు విడదీయ ప్రయత్నించినది. తన పుట్టు పూర్వోత్తరములు తెలిసికొను ఇచ్చ ప్రతి మానవునకును సహజముగ నుండును. ఇట్టి విషయములనే ఖయ్యాము తన రుబాయతులలో  చర్చించియున్నాడు. పాశ్చాత్యవిమర్శకులు కొందరు ఖయ్యామును ఎపిక్యుర్ అని పేర్కొనిరి. వాడుకలో ఎపిక్యుర్  అనగా పరచింతన లేని భోగలాలసుడు. ఎపిక్యురస్ సిద్ధాంతములు ఒకటి రెండు విషయములలో తప్ప ఖయ్యాము నమ్మకముల కంటే భిన్నముగా ఉండును.
 
‘‘శరీరం భౌతికం. ఆత్మ భౌతికమైన సూక్ష్మశరీరం. ఆత్మ దేహమున వ్యాపించి యుండును. దేహముతోడ ఆత్మయు నశించును. మరణాంతర జీవితం లేదు. సంతోషమే జీవిత ప్రయోజనము. విధి యనునది లేదు. మానవుని అదృష్టము తన చేతిలో యున్నది’’ అని ఎపిక్యురస్  చెప్పెను.

ఎపిక్యురసు, ఖయ్యాముల భావములు చాలావరకు పరస్పర విరుద్ధములు. ఎపిక్యురసు నిరీశ్వరవాది, ఖయ్యాము ఈశ్వరవాది. అతడు విధి లేదని చెప్పును. ఇతడు మన సుఖదుఃఖములు విధినిర్ణీతములని సిద్ధాంతీకరించును.

- దువ్వూరి రామిరెడ్డి ‘పానశాల’ నుంచి.
 (సెప్టెంబర్ 11 దువ్వూరి వర్థంతి)

 

Advertisement

తప్పక చదవండి

Advertisement