అన్నిటి విజయాలకు కారణం.. | Sakshi
Sakshi News home page

అన్నిటి విజయాలకు కారణం..

Published Sun, Oct 12 2014 11:58 PM

అన్నిటి విజయాలకు కారణం..

ఆన్‌లైన్ స్టార్టప్స్‌లో అధిక శాతం సంస్థలు విజయ పథంలో దూసుకెళుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. నిర్వహించతలపెట్టిన వ్యాపార కార్యకలాపాల గురించి వ్యవస్థాపకులకు స్పష్టత, చక్కటి ఆలోచనలు ఉండటమే అనేది నిపుణుల అభిప్రాయం. ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ముందు సదరు రంగంలో మార్కెట్ ప్రగతి, వినియోగదారుల అభిరుచి, వాస్తవ పరిస్థితి, వినియోగదారు లకు ఇప్పటికీ అందని సదుపాయాలు వంటి విషయాలపై అవగాహనతో వ్యాపార వ్యూహాలు రూపొందించుకుంటే కచ్చితంగా విజయం సాధించొచ్చు. ఈ క్రమంలో స్టార్టప్స్ సంస్థలు అనుసరించాల్సిన కొన్ని ముఖ్య వ్యూహాలు..
     
ముందుగా వ్యక్తిగత అభిరుచికి తగిన రంగంపై దృష్టి సారించడం ముఖ్యం. ఆ తర్వాత ఆ రంగంలో వ్యాపారావకాశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
     
ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు పరిణామాలపై అంచనాలు రూపొందించుకోవాలి. ఈ క్రమంలో అకడమిక్ నేపథ్యం కూడా కొంత ఉపకరిస్తుంది.
     
నిధుల సమీకరణ మరో ప్రధాన అంశం. కొంత మంది ఔత్సాహికులకు ఎన్నో మంచి ఆలోచనలు ఉంటాయి. వాటికి కార్యరూపమిచ్చే ఆర్థిక స్థోమత లేక నిధుల సమీకరణ గురించి తెలియక ఇబ్బంది పడతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిధుల సమీకరణకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మంచి ఐడియాలు ఉంటే మూలధనం అందించేందుకు ఎన్నో సీడ్ ఫండింగ్ ఏజెన్సీలు అందుబాటులోకి వచ్చాయి.
     
మరో ముఖ్యమైన అంశం మార్కెటింగ్. తాము ఏర్పాటు చేయదలచుకున్న స్టార్టప్ ద్వారా అందించే సేవలు, ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ వ్యూహాలు కూడా ముందుగానే రూపొందించుకోవాలి.
     
ప్రస్తుతం సదరు రంగంలోని ఇతర సంస్థలు వాటి ద్వారా లభిస్తున్న సేవలు.. ఇప్పటికీ వినియోగదారులకు అందుబాటులో లేని సేవలు/ఉత్పత్తుల గురించి తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేస్తే మార్కెటింగ్‌లో విజయం తథ్యం.
     
ప్రతి రంగంలోనూ కొత్త కంపెనీలు నెలకొంటున్నాయి. దీంతో పోటీని తట్టుకునే విధంగా నిత్యనూతనంగా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. తమ స్టార్టప్ కార్యకలాపాలకు కూడా నిరంతరం కొత్త రూపమిస్తే భవిష్యత్తు వృద్ధి గణనీయంగా ఉంటుంది. ఈ తరహా వ్యూహాల్లో లోపాల వల్లే ఎన్నో కంపెనీలు మధ్యలోనే మూతపడటం లేదా నష్టాల బారిన పడటం జరుగుతోంది. ఉదాహరణకు 1990లలో వెబ్‌సైట్ బ్రౌజింగ్‌లో వెలుగులీనిన నెట్‌స్కేప్ తర్వాత ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పోటీని తట్టుకోలేకపోయింది.
     
తక్కువ ఖర్చుతో స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునే వారికి అనువైన మార్గం ఆన్‌లైన్ స్టార్టప్స్. టెక్నాలజీ, ఇంటర్నెట్ కనెక్టివిటీలతో బీ2బీ (బిజినెస్ టు బిజినెస్), బీ2సీ (బిజినెస్ టు కస్టమర్) పద్ధతిలో స్టార్టప్స్ నెలకొల్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, ఈబే వంటివన్నీ ఇలాంటివే.
 
మార్కెటింగ్ విధానాలు ప్రధానం

స్టార్టప్స్ విషయంలో ప్రధానమైన అంశం మార్కెటింగ్ విధానాలు, వ్యూహాలు. ఈ రెండిటినీ చక్కగా అమలు చేయగలిగితే సులువుగా నిలదొక్కుకోవచ్చు. అదే విధంగా తమ లక్షిత వ్యాపారానికి సంబంధించి సరైన బ్రాండింగ్ ఉంటే సులువుగా సీడ్ ఫండింగ్ లభిస్తుంది. ఇప్పుడు దేశంలో ఎన్నో సంస్థలు సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఉంటూ ఆయా రంగాల్లో రాణిస్తున్న స్టార్టప్స్‌కు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ముందుకొస్తున్నాయి. వీటిని గుర్తిస్తే వ్యాపారం మరింతగా వృద్ధి సాధిస్తుంది.
 - అపూర్వ సేథి, సీనియర్ బ్రాండ్ మేనేజర్, ఫ్లిప్‌కార్ట్
 

Advertisement
Advertisement