ప్రశాంత యోగం | Sakshi
Sakshi News home page

ప్రశాంత యోగం

Published Wed, Jun 29 2016 10:19 PM

ప్రశాంత యోగం - Sakshi

లైఫ్

 

అనారోగ్యాలను మాత్రమే కాదు భావోద్వేగాలను అదుపుచేయడంలోనూ యోగాకు తిరుగులేదు. ఈ విషయంలో కొన్ని ఆసనాలు మరింతగా ఉపకరిస్తాయి.

 

చక్రాసన
వెల్లకిలా పడుకుని కాళ్లు రెండూ మడచి పాదాలు- మడమలను పిరుదుల దగ్గరగా తీసుకొని మోకాళ్లు పైకి నిలబెట్టాలి. తలకి    ఇరు వైపులా అరచేతులు నేల మీద ఉంచి (చేతి వేళ్లు లోపలి వైపునకు ఉంటాయి) శ్వాస తీసుకుంటూ అరచేతులూ, అరిపాదాలు భూమికి బలంగా నొక్కుతూ శరీరాన్ని పైకి లేపాలి. రెండు లేదా మూడు శ్వాసల తరువాత శ్వాస వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని కిందకు తీసుకురావాలి. కాళ్లను స్ట్రెచ్ చేసి చేతులు శరీరం పక్కన ఉంచి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఒక వేళ పూర్తి స్థితిలో చేయలేకపోతే...


స్టెప్-1 ముందుగా భుజాలు భూమి మీదనే ఉంచి సీటు భాగాన్ని పైకి లేపాలి. శ్వాస వదులుతూ సీటు భాగాన్ని భూమి మీద ఉంచాలి.


స్టెప్-2 మళ్లీ స్టెప్ 1 లోకి వచ్చి, ఈ సారి తలను (మాడు భాగాన్ని) నేలమీద ఉంచి అరచేతులు భూమి మీద ఉంచి భుజాలను కూడా పైకి లేపి రెండు మూడు సాధారణ శ్వాసల అనంతరం శ్వాస వదులుతూ ముందు భుజాలను తరువాత సీటు భాగాన్ని నేల మీదకు తీసుకురావాలి.

 

స్టెప్-3 ఇంకా పూర్తి స్థాయిలో చేయాలనుకుంటే స్టెప్ 2లో నుంచి, చేతుల మీద భారం ఉంచుతూ తలను భుజాలను పూర్తిగా పైకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి స్థితిలోకి వచ్చిన తరువాత శరీరం మొత్తాన్ని చేతుల మీద తేలికగా నిలుపగల స్థితి ఉన్నట్లయితే కుడి కాలుని పైకి ఆకాశంలోకి లేపి పాదాన్ని కాలివేళ్లను పైకి స్ట్రెచ్ చేసి ఉంచవచ్చు. తరువాత కుడి కాలుని కిందకు తీసుకువచ్చి తిరిగి ఎడమకాలుని పైకి తీసుకువెళ్లవచ్చు.

 
జాగ్రత్తలు: ఇది కొంచెం ముందస్తు భంగిమ (అడ్వాన్స్ పోశ్చర్) కాబట్టి ఊబకాయం ఉన్నవారు శరీరాన్ని పైకి లేపాల్సి వచ్చినప్పుడు భుజాలు, చేతి మణికట్టు బలంగా ఉన్నట్లయితే తేలికగా చేయవచ్చు. మణికట్టు ఏమాత్రం బలహీనంగా ఉన్నా పూర్తి స్థాయిలో చేయకుండా స్టెప్ 1 లేదా స్టెప్ 2 వరకూ చేయడం మంచిది.

ఉపయోగాలు: వెన్నెముకకు ఆధారంగా ఉన్న కండరాలకి, పొట్ట కండరాలకి, భుజం, తొడ కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. కిడ్నీలకు, ఎడ్రినల్ గ్రంథులకు టోనింగ్ జరగడం వల్ల భావోద్వేగాలను అదుపులో ఉంచడానికి ఉపకరిస్తుంది.

 

కర్ణ  పీడాసన
ఆసనంలో వెల్లకిలా పడుకుని కాళ్లు రెండూ కలిపి ఉంచి, చేతులు రెండూ వెనుకకు పైకి స్ట్రెచ్ చేయాలి. ఇలా చేసేటప్పుడు రెండు చెవులకు రెండు భుజాలు తాకుతూ ఉంటాయి. శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ పైకి లేపి మళ్ళీ శ్వాస వదులుతూ కాళ్లు కిందపెడుతూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల భుజాలను పైకి లేపి శ్వాస వదులుతూ ముందుకు వంగి తలను మోకాలు దగ్గరకు వచ్చేటట్లు చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలతో పాటు కాళ్లను కూడా పైకి లేపి, శ్వాస వదులుతూ తలా, కాళ్ళు వెనుకకు హలాసనంలోనికి తీసుకు వెళ్ళి, కాళ్ళు రెండూ రిలీజ్ చే యాలి. మోకాళ్ళు రెండింటిని తల చెవుల పక్కకు దగ్గరగా తీసుకువచ్చి పాదాలను ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచాలి. చేతులు రెండూ స్ట్రెచ్ చేసి అరచేతులు భూమి మీద ఉంచి సాధారణ శ్వాసలు తీసుకుంటూ రెండు మూడు శ్వాసల తరువాత వెన్నుపూసను భూమి మీద ఆనిస్తూ సీటు భాగాన్ని నేలమీదకు తీసుకువచ్చి కాళ్ళు రెండు కిందికి తీసుకురావాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా ఉంటాయి కనుక, ఆసనం తరువాత శవాసనంలోకి వచ్చి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఊపిరితిత్తులకు పూర్తిగా గాలిని తీసుకుని వదలాలి. ఫొటోలో చూసిన విధంగా పూర్తి స్థాయిలో చేయలేనివారు నావాసనంలో లాగా తలను మోకాళ్ళను వీలైనంత దగ్గరగా ఉండేటట్లుగా వెన్నెముక మీద ముందుకు వెనుకకు రోల్ అవ్వవచ్చు. ఈ ఆసనంలో వెన్నుపూస పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది. ఒకవేళ కేవలం వెన్నెముక మీద రోల్ అయినట్లయితే చక్కగా వెన్నెముకకు మసాజ్ జరుగుతుంది. మెడ, వెన్నెముక సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా చేయాలి.


ఉపయోగాలు: భుజాలను, వెన్నెముకను స్ట్రెచ్ చేస్తుంది. మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. మానసిక, శారీరక ఒత్తిడులు, అలసటను తగ్గిస్తుంది. వంధత్వం, మెనోపాజ్ సమస్యలను పరిష్కరిస్తుంది. తలనొప్పి, సైనసైటిస్, ఆస్తమా సమస్యలను కూడా ఈ ఆసనంతో తగ్గించుకోవచ్చు. (గమనిక: కఠినమైన ఆసనాలను నిపుణుల పర్యవేక్షణలో చేయడం మేలు)

 

ఎ.ఎల్.వి కుమార్  ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్

 

Advertisement
Advertisement