మొదటి విలువ... స్వయం నియంత్రణ | Sakshi
Sakshi News home page

మొదటి విలువ... స్వయం నియంత్రణ

Published Sat, Sep 12 2015 12:35 AM

మొదటి విలువ... స్వయం నియంత్రణ - Sakshi

విద్య - విలువలు
 
నేను సాధారణంగా ఉదయం వేళ ఆఫీసుకు వెళ్ళొచ్చాక, సాయంకాలం ఏదైనా దేవాలయంలోగానీ, పెద్దవాళ్లున్న చోటగానీ, (పిల్లలు ఉండకూడదన్న నిషేధం ఏమీలేదు) ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటాను. అది నా జన్మకు ఉద్ధారకమవుతుంది అని. కానీ ప్రవృత్తిరీత్యా నాకు పిల్లలని ఉద్దేశించి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. దానికి ఒక్కటే కారణం...

ఒక మొక్కకి నీళ్లు పోస్తే ఉండే ప్రయోజనం వేరు. ఒక మహావృక్షానికి నీళ్లు పోస్తే ఉండే ప్రయోజనం వేరు. మొక్కకి నీళ్లు పోస్తే అది మహావృక్షం అవుతుంది. మహావృక్షానికి నీళ్లుపోస్తే ఏమవుతుంది.. అంటే చెప్పడం కష్టం. పిల్లలకు నాలుగు మంచి మాటలు చెబితే, వాటిల్లో ఒక్కటయినా ఎవరి మనస్సునైనా స్పృశించి, దాని వల్ల ఏదైనా ప్రయోజనం చేకూరితే ఈశ్వరుడు నాకిచ్చిన ఊపిరి సార్థకత చెందుతుందని నాలుగు మాటలు చెప్పడం తప్ప, యథార్థానికి మీకు చెప్పగలిగిన సమర్థత నాకున్నదని కాదు. నా దగ్గర నేర్చుకోవాల్సిన స్థితిలో మీరున్నారనీ కాదు. నేనేదో గురుస్థానంలో కూర్చొని బోధ చేస్తున్నట్లుగా భావించకుండా, నన్ను మీ పినతండ్రో, మేనమామో అనుకుని వినండి. అలా భావన చేస్తే మీకు, నాకు ఒక అనుబంధం ఏర్పడుతుంది.

చెప్పే వ్యక్తికి వినేవారికి ఒక సంబంధం ఉండాలి. చెప్పే వ్యక్తి స్థానంపై వినేవారికి గౌరవం ఉండాలి. నేను ఒక దేవాలయంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తే, నేను వెళ్లి కూర్చున్న పీఠం వేరే వ్యాసపీఠం. కాబట్టి అక్కడ కూర్చుని పెద్దమాటలు చెప్పడానికి ఒక అర్హత ఉంటుంది. కానీ ఒక కాలేజీలో చదువుకునే పిల్లలతో మాట్లాడినప్పుడు ఏ స్థానంలో కూర్చుని మాట్లాడుతున్నానో నాకే సరైన అవగాహన లేనప్పుడు, ఏం మాట్లాడాలన్నా దానిపట్ల నాకే ఒక అయోమయ స్థితి ఏర్పడుతుంది. అది తొలగిపోవాలంటే ముందు పిల్లలకు, నాకు ఒక అనుబంధం ఉండాలి కదా...

కాబట్టి నన్ను మీ పినతండ్రిగానో, మీ మేనమామగానో భావన చేయండి. నన్నొక పెద్దమనిషిగా భావన చేయకండి. చాలా స్వేచ్ఛగా వినండి. మనం విద్యా విలువల గురించి మాట్లాడుకోవాలి. అంటే ముందు విద్య అంటే ఏమిటో నిర్వచించుకోవాలి. విలువ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అసలు విద్య అంటే ఏమిటి? తేలికగా ఆవిష్కరించడానికి దానికేమయినా నిర్వచనం ఉందా? విద్య అంటే చదువుకోవడం. నా దృష్టిలో అయితే ఒక మనిషి ఊపిరి పీల్చడం ఆరంభించిన దగ్గర నుంచి ఊపిరి ఆగిపోయే పర్యంతం చదువుతూనే ఉంటాడు. చదువుకోకపోవడం అనేది ఏమీ ఉండదు. పుస్తకం పట్టుకుని చదవడమే చదవడం కాదు. పుస్తకం పట్టుకోకపోయినా మీరు చదువుతూనే ఉంటారు.

నాకిది తెలియదు అని మీరు తెలుసుకోవడమే విద్య. విద్ అంటే తెలుసుకొనుట. విద్ అనే ధాతువు నుండే వేదం వచ్చింది. ఏది తెలుసుకొనుట? నాకిది తెలియదు అని తెలుసుకొనుట. అందుకే ఎవరూ నేను విద్యావంతుణ్ణి అని సగర్వంగా చెప్పడం కుదరదు. ఎందుకంటే మీరు ఎంత చదివినా ఇంకా మీరు చదువుకోవాల్సినది మిగిలిపోతుంది. మీరు ఎన్ని తెలుసుకుంటున్నారో దానివల్ల, నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలిసిననాడు మీరు అహంకరించడానికి అవకాశం లేదు.

రామాయణం చదవనంతకాలం రామాయణం అంతా నాకు తెలుసు అంటాడు. రామాయణంలోంచి సర్గలు చదువు అన్నారనుకోండి. చదివిన తర్వాత నీకేమర్థమయ్యింది చెప్పు అన్నారనుకోండి, చెప్పిన తరువాత కాదయ్యా ఈ సర్గల్లో ఇంత అంతరార్థం ఉందికదా? అన్నారనుకోండి. అప్పుడంటాడు... ఏమండీ! రామాయణంలో మిగిలిన సర్గలు ఎక్కడ దొరుకుతాయి అని. అంటే ఇప్పుడేం తెలిసింది. నాకు దాని గురించి కొన్ని విషయాలు తెలియవని తెలిసింది. తెలియవని తెలిసిన మరుక్షణంలో మీకు నాకు తెలుసునన్న అహంకారం పోతుంది. అందుకే పూర్వకాలంలో చదువుకునే వారిని వినీతులు అనేవారు. ఆనాడు విద్యార్థులన్నమాట లేదు. వినీతులు అంటే వినయం కోరుకునేవారు. ‘విద్యా దదాతి వినయం’ విద్య వినయమిస్తుంది అని అర్థం. అంటే అది తానంత తాను వినయమిస్తుందని కాదు. అలా ఇచ్చేటట్లయితే వేదం చదువుకున్నవాడు కాబట్టి రావణుడికి కూడా వినయం ఉండాలి. ఉందా? లేదు కదా. పాత్రత ఉండాలి. విద్య చేత వినయాన్ని పొందాలి. మనకేమీ తెలియదురా అని తెలుసుకుంటూ ఉండటమే విద్య. అదే ఎడ్యుకేషన్. మరి దీని విలువ ఏమిటి? ప్రయోజనం ఏమిటి? యాపిల్ పండు విలువ ఏమిటి అని అడిగితే ఇన్ని కాలరీస్ అనైనా చెప్పాలి లేదా ఇంత ఖరీదు అనైనా చెప్పాలి. అలా విద్య వలన వచ్చే ప్రయోజనం ఏమిటి? ప్రవర్తన, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రం ఇంతే చెబుతుంది. విద్య యొక్క విలువ, నడవడి అంటే ప్రవర్తించుట. ప్రవర్తన అన్నది కదలికకు సంబంధించింది.

నిద్రపోతున్నప్పుడు ప్రవర్తన అన్నది ఉండదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తల్లితండ్రితో మొదలుపెట్టి, కాలేజీలో మీ తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, మీ స్నేహితులతో అందరితోటి మీరు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. అలా ఏదో రకంగా ప్రతిస్పందనలతో కూడిన జీవన శైలికి ప్రవర్తన అని పేరు. ఈ ప్రవర్తన నియంత్రింపబడాలి. దాన్ని నియంత్రించడానికే శాస్త్రబోధ. కృష్ణపరమాత్మ గీత బోధించాడు. ఎవరికి? భీష్ముడికి కాదు, ధర్మరాజుకు కాదు, యుద్ధం చూడడానికి వచ్చిన ఋషులకు కాదు, అర్జునుడికి బోధించాడు. శుకుడు భాగవతం చెప్పాడు. ఎవరికి? పరీక్షిత్తుకు చెప్పాడు. గమనించండి. ఒక్కరికే చెప్తున్నారు. అందరికీ గుంపుగా కాదు. లక్షలమందికి కాదు. ఒక్కరికే చెప్పినా ఆ ఒక్కరూ మీరు కావాలి. ఎవరికి వారు ఆ ఒక్కరే కావాలి. శాస్త్రబోధ ఎవరికి చేస్తారు? ఆవేశానికి గురయ్యే వారికి చేయాలి. మీరు ఎమోషన్ అంటారే అది. ఎమోషన్ ప్రతివారికీ ఉంటుంది కాని అందరికీ ఒకే విధంగా ఉండదు. నీళ్లున్నాయి. పాలున్నాయి. రెండూ మరగబెడతాం. పెద్దమంటపెడితే నీళ్లు మరిగి మరిగి ఆవిరవుతాయి. మరిపాలో... పొంగిపోతాయి. అంటే నీళ్ల ఎమోషన్ వేరు, పాల ఎమోషన్ వేరు. మనిషికి ఊపిరి పోయేటప్పుడు కూడా ఎమోషన్ ఉంటుంది. యౌవనంలో ఉండే పిల్లలకూ ఉంటుంది. కాని పిల్లల ఎమోషన్ వేరు.

ఈ ఎమోషన్ మీదే ఇప్పుడు వ్యాపారమంతా నడుస్తూ ఉంది. దోపిడీ జరుగుతూ ఉంది. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ చూడండి. ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు దానికేమీ కోట్ల ఆస్తుల్లేవు. ఇప్పుడు వేలకోట్ల ఆస్తున్నాయి. దాని పదవుల కోసం పెద్ద పెద్ద వాళ్లు పోటీ పడుతున్నారు. ఆ రోజుల్లో సంవత్సరానికి ఒకటో, రెండో మ్యాచిలు జరిగేవి. ఇప్పుడు సంవత్సరం పొడుగునా ఉంటున్నాయి. మీరొకటి ఆలోచించండి. మనదేశంలో ఎన్నికలు పెట్టేటప్పుడు పిల్లల పరీక్షల షెడ్యూలు గురించి ఆలోచిస్తారు. మరి క్రికెట్ మ్యాచీల షెడ్యూలులో అలా ఆలోచిస్తున్నారా? లేదు పిల్లలేమైపోతేనేం. మన వ్యాపారం సాగాలి. ఆటను ఆటగా చూడడం లేదు. వ్యక్తిగతంగా ఒక ఆటగాడి ప్రదర్శన మీద ఉన్న దృష్టి ఆటమీద లేదు. మన ఎమోషన్‌ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు.

 మన పత్రికల వార్తలు చూడండి. పూర్వం ఎప్పుడో అర్ధరాత్రికి గాని హెడ్‌లైన్ పెట్టేవాళ్లు కాదు. దానికి ఒక స్థాయి ఉండాలి. ఇప్పుడు చూడండి. సెన్సేషన్ కావాలి. ఒక గూండా చనిపోతే హెడ్‌లైన్. బాలమురళీకృష్ణ కచేరీ గురించి ఎక్కడో ఒక మూలన నాలుగు లైన్లు.
 యువతరం ఎమోషన్లు అడ్డంపెట్టుకుని వేగంగా డబ్బు చేసేసుకోవడం. టెలివిజన్ అంతే. సినిమాలంతే.

 మరేం చేయాలి? మీ ఎమోషన్లు నియంత్రించుకోవాలి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడాలో, ఎప్పుడు టెలివిజన్ చూడాలో, ఎప్పుడు సినిమా చూడాలో, అసలివేవీ చూడకపోయినా నష్టం ఎలా లేదో మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ పక్కనబెట్టి చదువుకోగలగాలి. మీ ఎమోషన్‌ను ఎవరూ దోపిడీ చేయకుండా చూసుకోవాలి. సెల్ఫ్ రిస్ట్రెయింట్ అంటే స్వీయ నియంత్రణ. అదీ విద్యవల్ల వచ్చే మొట్టమొదటి విలువ.    
 - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
 
 నాకిది తెలియదు అని మీరు తెలుసుకోవడమే విద్య. విద్ అంటే తెలుసుకొనుట. విద్ అనే ధాతువు నుండే వేదం వచ్చింది. ఏది తెలుసుకొనుట? నాకిది తెలియదు అని తెలుసుకొనుట. అందుకే ఎవరూ నేను విద్యావంతుణ్ణి అని సగర్వంగా చెప్పడం కుదరదు. ఎందుకంటే మీరు ఎంత చదివినా ఇంకా మీరు చదువుకోవాల్సినది మిగిలిపోతుంది. మీరు ఎన్ని తెలుసుకుంటున్నారో దానివల్ల, నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలిసిననాడు మీరు అహంకరించడానికి అవకాశం లేదు.
 
 

Advertisement
Advertisement