త్రీమంకీస్ - 10 | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 10

Published Tue, Oct 28 2014 11:42 PM

త్రీమంకీస్   - 10

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 10
 
చాలామంది యమధర్మరాజుతో కరచాలనం చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. ఆయన చిరునవ్వుతో అందరికీ ‘థాంక్యూ, ‘థాంక్యూ’ అని జవాబు చెప్తున్నాడు. ఓ మహిళ శవం ఓ వైపు నేల మీది చాప మీద పడుకోపెట్టి ఉంది. ఆవిడ చేతిలోని సెల్ ఫోన్ చెవి దగ్గర ఆనించి ఉంది. సెల్‌ఫోన్ గుప్పెట్లో బిగిసిపోవడంతో ఎంత ప్రయత్నించినా రాలేదు. ఆ మహోత్సవాన్ని ఫొటోలు, వీడియో తీసే ఒకతను ఇంకొకరికి చెప్పడం ముద్దాయి విన్నాడు.

 ‘‘నేను ఫొటోగ్రఫీని ఎందుకు హాబీగా చేసుకున్నానంటే, నేను ద్వేషించే వారిని షూట్ చేసి, జైలుకి వెళ్ళకుండా వారి తలలు కట్ చేయగలను కాబట్టి.’’ సీఐ యమధర్మరాజు దగ్గరికి నడిచి సెల్యూట్ చేసి చెప్పాడు. ‘‘కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఆనర్.’’
‘‘థాంక్యూ. థాంక్యూ’’ ఆయన ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు. ‘‘మీకు తీరిక ఉంటే ఓ ముద్దాయిని రిమాండ్ కోసం తీసుకువచ్చాను యువర్ ఆనర్.’’ ‘‘ఇతనేనా?’’ ఆయన ఆ యువకుడి వంక చూస్తూ అడిగాడు.‘‘అవును యువర్ ఆనర్. నేనే దొంగని.’’ అతను చెప్పాడు.
 ‘‘పేరు?’’
 ‘‘వానర్.’’
 ‘‘తండ్రి పేరు?’’
 ‘‘కిష్కింధ.’’
 ‘‘సోదరుడి పేరు?’’ అనుమానంగా చూస్తూ అడిగాడు.
 ‘‘అయోధ్య.’’
 ‘‘రాముడికీ, మీకూ ఏమైనా సంబంధం ఉందా?’’
 ‘‘ఉంది యువర్ ఆనర్. మా నాన్న సీతారామకళ్యాణం నడిచే సినిమా హాల్లో కర్టెన్లని లాగేవాడు.’’
 సీఐ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని చదివి అడిగాడు.
 ‘‘దీని మీద సంతకం నీదేనా?’’

 ‘‘నాదే యువరానర్. అది చేసి అరగంటైంది. సిఐ గారికి తొందరెక్కువ సార్. ‘తొందర లేదు. ఆగుదాం’ అన్నా తీసుకొచ్చేశారు’’ వానర్ చెప్పాడు.
 ‘‘నిన్ను జైలుకి కస్టడీకి పంపిస్తున్నాను. చెప్పుకోడానికి ఏమైనా ఉందా?’’
 ‘‘నాక్కావాల్సింది జైలు కాదు. బెయిల్.’’
 ‘‘నీకు జీవితంలో మంచి మిత్రుడు ఉన్నాడో లేడో రేపటి కల్లా తెలుసుకోవచ్చు.’’ ఆయన నవ్వుతూ చెప్పాడు.
 ‘‘ఎన్ని రోజులు రాసుకోను సార్?’’ సీఐ ప్రశ్నించాడు.
 ‘‘రాసుకో ఓ నాలుగు రోజులు.’’
 ‘‘థాంక్యూ సర్. పాపం. మీ ఆవిడ పోయినందుకు మీకు నా సానుభూతి యువర్ ఆనర్’’ వానర్ చెప్పాడు.
 యమధర్మరాజు అతని వంక కోపంగా చూసి చెప్పాడు.
 ‘‘ప్లన్  మూడు. ఏడు రోజులు రాయి.’’
 తర్వాత అతని టీ షర్ట్ మీద పదాలని చదివాడు.
 ‘ఐ కెన్ ఓన్లీ ప్లీజ్ ఒన్ పర్సన్ పర్ డే. టు డే ఈజ్ నాట్ యువర్ డే’
 ‘‘ప్లస్ నాలుగు. పదకొండు రోజులు రాసుకో’’ యమధర్మరాజు మళ్ళీ చెప్పాడు.
 ‘‘ఎస్సార్.’’
 
 ‘‘భార్య పోతే ఏమిటి ఈయనకి ఇంత ఆనందం?’’ వానర్ వేన్‌లో సీఐని అడిగాడు.
 ‘‘నీకు పెళ్ళి కాలేదా?’’
 ‘‘కాలేదు సార్.’’
 ‘‘అందుకే తెలీలేదు.’’
   
 ‘‘ఏమిటి ఇవాళ ఇంత మందిని తెస్తున్నారు?’’ జైలర్ వానర్‌ని ఎగాదిగా చూసి ిసీఐని అడిగాడు.
 ‘‘వాతావరణం వేడిగా ఉంది కదండి.’’
 వాతావరణం నలభై డిగ్రీల  సెల్సియ్‌స్ దాటితే నేరాలు అధికంగా జరుగుతాయన్నది పోలీస్ శాఖలో పని చేేన  సీఐ అనుభవం. పోలీసులకి వానర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని చదివి జైలర్ అడిగాడు.
 ‘‘ఇది నీ సంతకమేగా?’’
 ‘‘అవునండి. నేను దాన్ని ఫోర్జరీ చేయలేదండి’’ వానర్ జవాబు చెప్పాడు.
 ‘‘నిన్నెక్కడో చూసినట్లుంది?’’
 ‘‘టివిలో చూసి ఉంటారు సార్.’’
 ‘‘టివి ఏక్టర్‌వా?’’
 ‘‘కాదు సార్. హిజ్రా అసోసియేషన్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం వారానికి నాలుగు గంటలు ఛారిటీ వర్క్ చేస్తూంటాను.’’
 ‘‘నీ పేరు?’’
 ‘‘వానర్.’’
 జైలర్ ఉలిక్కిపడి సిఐని చూసి అడిగాడు.
 ‘‘ఇవాళ వరసగా కోతుల్ని పట్టుకొస్తున్నారేమిటి?’’
 ‘‘ప్రజలు ఒకప్పుడు వెరైటీ పేర్ల కోసం తెగ ఇదైపోయేవారండి. ఈ రోజుల్లో ఎవరికీ లేని కొత్త పేర్ల కోసం ఇదవుతున్నారు. మా అన్నయ్య కొడుక్కి మృగ్ అనే పేరు పెట్టారు’’ ిసీఐ వివరించాడు.
 ‘‘పాపం! నీ వయసెంతో?’’ జైలర్ అడిగాడు.
 ‘‘నలభై రెండు సార్’’ సీఐ వెంటనే చెప్పాడు.
 ‘‘నీది కాదు. నీది’’ వానర్ వంక వేలితో చూపించాడు.
 ‘‘ఈయన వయసుకి పంతొమ్మిది తక్కువ సార్.’’
 ‘‘నేను ఇంజనీరింగ్ చదవలేదు. లెక్కలు సరిగ్గా రావు. నీ వయసెంతో సూటిగా చెప్పు.’’
 ‘‘ఇరవై మూడు సార్.’’
 ‘‘నువ్వు కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షనా?’’
 ‘‘అవును సార్.’’
 ‘‘ఆపరేషన్స్ రీసెర్చ్‌లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో?’’
 ‘‘ఎయిటీ ఫైవ్ సర్.’’
 ‘‘ఎస్‌ఐ ఉద్యోగానికి అప్లై చేశావా?’’
 ‘‘చేసాను సార్.’’
 ‘‘మరి దాంట్లో ఎందుకు చేరలేదు?’’
 ‘‘ఇంటర్వ్యూలో తుస్సుమంది సార్.’’
 (వానర్ ఏ మూర్ఖపు పనితో  పోలీసుకి పట్టుబడ్డాడు?)
 
 
 

Advertisement
Advertisement