తొలిగడప | Sakshi
Sakshi News home page

తొలిగడప

Published Thu, Jan 22 2015 11:32 PM

తొలిగడప

వీటన్నిటినీ పరిశీలిస్తే, వాతావరణ పరిస్థితుల  ప్రభావమనే ఊహే కొంత సమంజసంగా కనిపిస్తుంది. ఎందుకంటే, మీసోజోయిక్ యుగాంతంలో భూమి  బాగా చల్లబడి, అడపాదడపా మంచు కురవడం మొదలైనట్టు దాఖలాలు కనిపిస్తున్నాయి.
 
స్తన్యజంతువును పోలిన ‘థెరియోమార్ఫా’ మినహాయిస్తే, ఆ పొరల్లో దొరికిన కొన్ని దవడ ఎముకలు ముమ్మూర్తులా స్తన్యజంతువు లక్షణాలు సూచిస్తున్నా, దవడ ఎముకకు మించిన ఏవొక్క ఎముక దొరకకపోవడంతో ఈ సందిగ్ధావస్థ ఏర్పడింది. మీసోజోయిక్ యుగంలో పరిణామదశ పొదుగుండే జంతువుల దశకు చేరుకున్నదనే వాదనను మనం ఔననలేకపోయినా, బహుశా ఉంటే అవి ఎలుకల సైజుకు మించివుండే జంతువులు కాదనే వాదనతో ఏకీభవించవచ్చు.

డైనసార్స్ కాక, చెప్పుకోవలసిన ఆ కాలం బల్లిజాతులు మరోమూడు. చూసేందుకు అవి పక్షుల్లా కనిపిస్తాయి గానీ, పక్షులు కాదు - బల్లులే. వీటికి నోట్లో పళ్ళవరుస ఉంటుంది; పక్షులైతే పళ్ళుండవు. అలాంటి జంతువుల్లో మొదటిది ‘టెరెడాక్టైల్.’ దీని పక్కల్లోనుండి ముందుకాళ్ళ పొడవునా చర్మం పొర అంటుకోనుండి రెక్కలాగా కనిపిస్తుంది. తోక మాత్రం బల్లులదే. ఎద ఎముక పక్షుల్లోలాగా రెక్క కండరాలకు సహకరించేంత బలిష్టంగా లేనందున, వాటికి రెక్కల్లా కనిపించే పొరలో కండరాలుండే ఆస్కారం లేదు. ఆ పొర ఉపరితలంలో ఉండేవి బల్లిచర్మానికుండే పొలుసులేగానీ, ఈకలు కాదు. ఆ జంతువులు బహుశా మీసోజోయిక్ యుగంలోని గబ్బిలాలై వుంటాయి.
 రెండవ తరహా జంతువు ‘ఆర్కియోటెరిక్స్.’ ఇది పక్షులకు పూర్వీకురాలయ్యుండే అవకాశాలు మెండుగా వున్నా, అప్పటిదాకా అది బల్లే. వీటికి ఏర్పడినవి ఈకలుండే నిజమైన రెక్కలు. అయితే, రెక్క కొసలో మూడు గోర్లు మిగిలే వుంటాయి. తోక గూడా వేరుగా ఉంటుంది. పక్షికి తోక ఈకలన్నీ గుజ్జిగా తోకముట్టెలో మొలుస్తాయి. ఆర్కియోటెరిక్స్ తోక పొడవాటి తాడులా ఉండి, చింతాకు తొడిమకు పత్రాలు ఇరువైపులా అతుక్కున్నట్టు, తోక పొడవునా ఈకలు అటూ ఇటూ మొలిచుంటాయి. ఆహారం కోసం అది చేపల మీద ప్రధానంగా ఆధారపడుతుంది.

‘హెస్పెరోర్నిస్’ అనేది మూడవరకం. ఇది బాతులాగా నీటిమీద ఈదే బల్లి. దీని వెనకకాళ్ళు ఈతకు అనుకూలమైన తెడ్లలాగా ఏర్పడివుంటాయి. ముందుకాళ్ళు కురచబారి మొట్టెల్లా మిగిలుంటాయి. దంతాలే లేకపోతే దాన్ని పక్షికాదేమోనని అనుమానించేందుకే వీలుండదు.

ఇంతకూ ఇన్ని సందేహాలకు కారణం ఏమిటంటే - అంచెలంచెలుగా పరిణామక్రమాన్ని విశ్లేషించేందుకు వీలైనన్ని ఆధారాలు మీసోజోయిక్ సరీసృపాలకు సంబంధించి మనకు దొరకకపోవడం. ఏవోకొన్నిటిని మినహాయిస్తే మిగతా జంతువులు జీవనవిధానం నీటితో అనుబంధం కోల్పోయిన కారణంగా సముద్రగర్భంలో వీటి అవశేషాలు విస్తారంగా ఉండవు. వాటికోసం ప్రపంచమంతా నేలపొరలు పెళ్ల్లగిస్తూ కూర్చునేందుకు వీలుపడదు. అడపాదడపా సున్నపురాతి గుట్టల్లో దొరుకుతున్న అవశేషాలకు మాత్రమే మన విశ్లేషణ పరిమితం కావడంతో వీటిచరిత్రలో సందులు మిగిలిపోతున్నాయి.

ఆ కరవుకు తోడు, మీసోజోయిక్ యుగాంతంలో డైనోసార్ వంటి సరీసృపాలు నిశ్శేషంగా అంతరించాయి; కనీసం వారసత్వమైనా మిగల్చకుండా తుడిచిపెట్టుకుపోయాయి. అదే సమయంలో నేలమీద నివసించే జంతువులేకాక సముద్రజీవులుగూడా విశేషంగా నశించడం ఆశ్చర్యాన్ని కలిగించే ఉపద్రవం. ఆ యుగానికి గుర్తుగా మిగిలిందల్లా చిన్న చిన్న బల్లులూ, తొండలూ, తాబేళ్ళూ, మొసళ్ళూ, అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న పక్షులూ, బుల్లిబుల్లి స్తన్యజంతువులు. ఆ యుగానికి చెందిన అంత పెద్ద జంతువులు, అంత విస్తారంగా రాజ్యమేలిన జంతువులు, హఠాత్తుగా ఎందుకు అంతరించాయని అడిగితే సమాధానాలు బోలెడు. సూర్యగోళంలో సంభవించిన తుఫానుల ఫలితమని కొందరు, భూమి వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులని మరికొందరు, ప్రచండమైన మార్పులని మరికొందరు, ప్రచండమైన ఉల్కాపాతమని ఇంకా కొందరు - ఇలా ఏవేవో కారణాలు సంధిస్తున్నారు. చివరిదశలో పుట్టుకొచ్చిన స్తన్యజంతువుల పోటీకి తట్టుకోలేక అంతరించాయని వాదించేవాళ్ళు గూడా ఉన్నారు గానీ, అది నమ్మేందుకు వీలుపడని వాదన. ఆ యుగంలో మనకు తెలిసి ఏ స్తన్యజంతువూ ఎలుకకు మించిన పరిమాణాన్ని సంతరించుకోలేదు. అంతటి రాక్షసాకారాలను సమూలంగా నిర్జించే సమర్థత కలిగిన ప్రత్యర్థి ప్రసక్తిలోనే లేదు.

మీసోజోయిక్ యుగం చివరిలో జరిగిన మరొక పరిణామం భూఖండాల చలనం. భూఖండాల నుండి ముక్కలు తునిగి, ఆ ముక్కలు మరో ఖండాన్ని ఢీకొనడం వంటి సంఘటనలు కొన్ని అప్పట్లో జరిగాయి. ఇప్పుడు భారతదేశంగా ఏర్పడిన భూభాగం అప్పట్లో ఆఫ్రికా ఖండం నుండి చీలివచ్చి, విపరీతమైన తోజుతో ఆసియాఖండాన్ని తాకిన ఒత్తిడికి హిమాలయ పర్వతాలు ఉవ్వెత్తున లేచాయి. అమెరికాలోని రాకీస్, యాండీస్ పర్వతశ్రేణీ, యూరప్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణీ ఈ తరహాలో ఏర్పడినవే. అయితే ఇవి కొన్నికొన్ని తావులకే పరిమితమైన వైపరీత్యాలు కాబట్టి, భూతల విస్తారంగా జరిగిన నష్టానికి జవాబుదారిగా నిలవజాలవు.

 వీటన్నిటినీ పరిశీలిస్తే, వాతావరణ పరిస్థితుల ప్రభావమనే ఊహే కొంత సమంజసంగా కనిపిస్తుంది. ఎందుకంటే, మీసోజోయిక్ యుగాంతంలో భూమి బాగా చల్లబడి, అడపాదడపా మంచు కురవడం మొదలైనట్టు దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆనాటి జంతువుల దేహనిర్మాణం వెచ్చదనానికి మాత్రమే సరిపడేది. చర్మంమీద బొచ్చుగానీ ఈకలుగానీ లేకుండా, కేవలం పోలికలతో నిర్మితమైన శరీరం చలిని ఓర్చుకోలేదు. మార్పు హఠాత్తుగా సంభవిస్తే నిగ్రహశక్తిని పెంపొందించుకునే అవకాశం దొరకదు. దీనికి నిదర్శనం - పురి తిరిగిన గవ్వలుండే ‘అమ్మొనైట్’ జాతి సముద్రజీవులు సంపూర్ణంగా అంతరించినా, వాటి వారసత్వంగా మిగిలిన ‘పియర్లీ నాటిలస్’ పేరుగల జీవి ఇప్పటికీ ఉందిగానీ, అది హిందూమహాసముద్రంలోనూ, పసిఫిక్ మహాసముద్రంలోనూ వెచ్చనీటి పరిసరాల్లో మాత్రమే బతుకుతుంది.

రచన: ఎం.వి.రమణారెడ్డి


 
 
 

Advertisement
Advertisement