అసలు సిసలు స్త్రీవాది | Sakshi
Sakshi News home page

అసలు సిసలు స్త్రీవాది

Published Sat, Apr 14 2018 12:37 AM

Today Ambedkar Jayanti - Sakshi

‘మహిళల విముక్తే మానవ జాతి విముక్తి’ అంటారు అంబేడ్కర్‌. రాజకీయ, సామాజిక ఆర్థిక అసమానతలో పాటు లింగ వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తోందనీ స్త్రీపురుష సమానత్వం మాత్రమే సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలదనీ ఆయన మనసా వాచా నమ్మారు.  అసమానతలను తరిమికొట్టేందుకు రాజ్యాంగ రచనను ఒక సమున్నతావకాశంగా అంబేడ్కర్‌ భావించారు. ఆర్టికల్‌ 14 నుంచి 16 వరకు స్త్రీపురుష సమానత్వాంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతేకాకుండా స్త్రీల రక్షణకు ఉద్దేశించిన అనేక చట్టాలకు ఆయన రూపకల్పన చేశారు. అందులో భాగమే.. జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు న్యాయ శాఖా మంత్రి హోదాలో అంబేడ్కర్‌ ప్రవేశపెట్టిన  హిందూ కోడ్‌ బిల్‌. భారత స్వతంత్య్రానంతర తొలి న్యాయ శాఖా మంత్రి అయిన అంబేడ్కర్‌.. వివాహం, విడాకులు, సంపద హక్కుతో పాటు సంరక్షణ హక్కులకు హామీ యిచ్చే హిందూ కోడ్‌ బిల్లుని ప్రవేశపెట్టడం ద్వారా స్త్రీల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులను ఆశించారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందకుండా నెహ్రూ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తిరస్కరిస్తూ న్యాయ శాఖా మంత్రి పదవినే తృణప్రాయంగా వదులుకున్న ఘనత డాక్టర్‌. బిఆర్‌ అంబేడ్కర్‌కే దక్కుతుంది. 

మహిళా చట్టాలకు ఆద్యుడు
స్త్రీజనోద్ధరణకోసం అంబేడ్కర్‌ అనేక చట్టాలకు రూపకల్పన చేశారు. ఉమన్‌ లేబర్‌ వెల్ఫేర్‌ ఫండ్, ఉమన్‌ లేబర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్‌ ఫర్‌ వుమెన్‌ లేబర్‌ బిల్, లీవ్‌ బెనిఫిట్‌ టు పీస్‌ వర్కర్స్, రివిజన్‌ ఆఫ్‌ స్కేల్‌ ఆఫ్‌ పే ఫర్‌ ఎంప్లాయీస్, రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బ్యాన్‌ ఆన్‌ వుమెన్‌ వర్కింగ్‌ అండర్‌గ్రౌండ్‌ మైన్స్, మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ ఫ్రం హస్‌బెండ్స్‌ ఆన్‌ గెటింగ్‌ లీగల్లీ సెపరేషన్, వేతనాల్లో లింగ వివక్ష పాటించకుండా సమాన పనికి సమాన వేతనం.. ఇలాంటì  చట్టాలన్నిటికీ అంబేడ్కరే ఆద్యుడు. ప్రధానంగా  మెటర్నిటీ బెనిఫిట్స్‌ యాక్ట్‌ రూపకల్పనలో అంబేడ్కర్‌ కృషి అత్యంత కీలకమైంది. 1929లో ముంబై అసెంబ్లీలో దేశంలోనే తొలిసారిగా మెటర్నిటీ బెనిఫిట్స్‌ యాక్ట్‌ ఆమోదం పొందింది. ఆ తరువాతే 1934లో మద్రాసు లెజిస్లేచర్‌ కౌన్సిల్‌ మెటర్నిటీ బెనిఫిట్స్‌ యాక్ట్‌ని  ఆమోదింపజేసుకుంది. 1942– 46 మధ్యన వైస్రాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో కార్మిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ‘మైన్స్‌ మెటర్నిటీ బెనిఫిట్స్‌ బిల్‌ ఫర్‌ ఉమెన్‌’ బిల్లుని తీసుకురావడంలో కూడా ఆయన పాత్రే కీలకం. ఈ చట్టమే గనుల్లో పనిచేసే మహిళలకు 8 వారాల పాటు జీతంతో కూడిన సెలవుని ప్రసాదించింది. అనంతరం 1961లో ‘కామన్‌ మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌’తో కేంద్రం ఈ చట్టాన్ని దేశంమొత్తానికీ వర్తింపజేసింది. 

సమాన పనికి సమాన వేతనం
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39(డి) డైరెక్టివ్‌ ప్రిన్సిపుల్స్‌లోని నాల్గవ భాగం సమాన పనికి సమాన వేతనాన్ని ఖరారు చేస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ధనికులకు, ఉన్నత వర్గాల వారికీ, భూస్వాములకూ, పన్నులు కట్టేవారికీ మాత్రమే ఉన్న ఓటు హక్కుని పురుషులందరితో పాటు స్త్రీలకు సైతం వర్తింపజేయాలని చెప్పి స్త్రీల రాజకీయ హక్కుకు పునాది వేసిన స్త్రీజన పక్షపాతి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌. 
– అత్తలూరి అరుణ 

Advertisement
Advertisement