నేడు వరల్డ్ స్నేక్ డే

15 Jul, 2016 23:16 IST|Sakshi
నేడు వరల్డ్ స్నేక్ డే

పపపపపప... ప్రకృతి!
 

కల్లోకొస్తే... గజగజ వణికిపోతాం. కళ్లెదురుగా కనిపిస్తే బిగుసుకుపోతాం. ‘పపపపపపపపప.. పాము...’ అంటూ పరుగులు తీస్తాం. కానీ కొంతమంది అలా ఉండరు. పాముని కళ్లింత చేసుకుని అబ్బురంగా చూస్తారు. పాముకు కలలో కూడా అపకారం తలపెట్టరు! పామును ఎవరైనా చంపబోతే... ‘వద్దొద్దు.. మూగప్రాణి వదిలేద్దాం’ అంటారు.  ఏమిటి.. వాళ్లకూ మనకూ తేడా? మనకు భయం. వాళ్లకు భయం లేదు. అంతే తేడా. అవును. పామును ప్రకృతిలో భాగంగా చూస్తే... భయం అనిపించదు. ప్రకృతి నుంచి వేరు చేసి చూసినప్పుడే... భయం ఆవహిస్తుంది. భయం పాముకన్నా ప్రమాదకరమైనది.  ఇవాళ ‘వరల్డ్ స్నేక్ డే’! పాముల గురించి తెలుసుకుందాం.  భయాన్ని పోగొట్టుకుందాం...
 
 
ప్రతి ‘డే’కి ఒక హిస్టరీ ఉంటుంది. కానీ ‘స్నేక్ డే’కి అలాంటి హిస్టరీ ఏం కనిపించదు! ‘జూలై 16 వరల్డ్ స్నేక్ డే’  అన్నదొక్కటే ప్రపంచానికి తెలుసు. దీనిని ఎవరు ప్రారంభించారో ఎక్కడా సమాచారం లేదు! ఎలా మొదలైందో అదీ లేదు. అంతమాత్రాన ఈ ‘ప్రపంచ సర్ప దినోత్సవానికి’ ప్రాముఖ్యం లేదని కాదు. ఏటా ఈ రోజు ప్రపంచ పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు స్నేక్ డేని జరుపుకుంటారు. అంతా ఒక చోట చేరతారు. పాముల ముద్దు ముచ్చట్లను షేర్ చేసుకుంటారు. ఈ సందడినంతా మనం టెక్సాస్‌లో చూడాలి! కోళ్ల ఫారంలా అక్కడొక ఫేమస్ స్నేక్ ఫారం ఉంది. 1967 నుంచి అది అక్కడ ఉంది. 1970లలో ‘రమోన్స్’ అనే రాక్ బ్యాండ్ సాంగ్‌తో ఆ పాముల ఫారానికి క్రేజ్ పెరిగింది. టూరిస్టులు ఎక్కువయ్యారు. ఇక జూలై 16 వచ్చిందంటే సందర్శకుల కిటకిట. స్నేక్ డే సందర్భంగా ఫ్యామిలీ ఇస్తున్న సర్ప సమాచారం ఇది.
 
సర్పాలు-సంగతులు
 
పాములు తమ తలకంటే పెద్ద పరిమాణం ఉన్న జంతువుల్ని కూడా మింగేయగలవు. వీటి దడవల నిర్మాణం అందుకు అనువుగా ఉంటుంది.
అంటార్కిటికాలో తప్ప ప్రపంచంలోని ప్రతి ఖండంలోనూ పాములు ఉన్నాయి. పదహారు వేల అడుగుల కంటే ఎత్తున ఉన్న హిమాలయాల మీద కూడా పాములు కనిపించవు. అలాగే ఐర్లాండ్, ఐస్‌ల్యాండ్, న్యూజిలాండ్ దీవుల్లో కూడా పాములు ఉండవు. వాటి మనుగడకు అవసరమైన వాతావరణం ఆ ప్రాంతాలలో ఉండదు.
ఇవి నాలుకతో వాసన చూస్తాయి..
నీటి అడుగున  ఉండే పాములు తమ చర్మం ద్వారా శ్వాస తీసుకుంటాయి.
 
 సర్పచిత్రాలు
నోము (1974) :  ఈ చిత్ర కథానాయిక చంద్రకళ  నాగభక్తురాలు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. భర్త తరపు చుట్టాలు ఆస్తి కోసం ఇద్దర్నీ చంపాలని కుట్రలకు పాల్పడతారు. భక్తురాలి కోసం నాగదేవత ఏవిధంగా ఆ కుట్రలను తిప్పి కొట్టింది? నాస్తికుడైన భర్తను ఎలా రక్షించింది? అనేది చిత్ర కథాంశం.
దేవతలారా దీవించండి (1977) : నల్లమల అడవిలో ఉన్న  నాగదేవత గుడిలోని  నిధిని   ఐదుగురు స్నేహితులు వశం చేసుకోవాలని  చూస్త్తారు. నాగదేవతకు హాని తల పెడతారు.  నాగదేవత ఎలా పగ తీర్చుకుందనేది చిత్రకథ.
పున్నమి నాగు (1980) : చిన్నప్పట్నుంచీ తండ్రి కొంచెం కొంచెం విషాన్ని ఆహారంలో కలిపి ఇవ్వడంతో నాగులు (చిరంజీవి)లో పాము లక్షణాలు వస్తాయి. పౌర్ణమి రోజున పాము తరహాలో ప్రవర్తిస్తాడు. అతని కాటుకు అమాయక మహిళలు మరణిస్తారు. ఈ లక్షణాలను వదిలించుకోవడానికి పరిష్కారం లేదని తెలిసి నాగులు ఆత్మహత్య చేసుకుంటాడు.
దేవి (1999) : ఓ ప్రమాదంలో చిక్కుకున్న నాగదేవతను రక్షించబోయి ఓ పెద్దాయిన ప్రాణాలు కొల్పోతాడు. దుష్టశకులు, కుటుంబ సభ్యుల నుంచి ఆయన కుమార్తెను రక్షించడానికి మనిషి రూపంలో భువిపైకి వచ్చిన నాగదేవత కథే ఈ చిత్రం.
 
 దశ విషసర్పాలు
పాము కనబడగానే గుండె గుభేల్‌మంటుంది. అది కరుస్తుందేమో, కరిస్తే ప్రాణం హరీమంటుందేమోనని కంగారు పుడుతుంది. కానీ అన్ని పాములూ కరిచేయవు. కరిచినా అన్ని పాముకాట్లకూ ప్రాణాలు పోవు. ప్రపంచంలో ఉన్న పాముల్లో కొన్ని మాత్రమే విషపూరితమైనవి. వాటిలో ఇవి తొలి పది స్థానాల్లో ఉన్నాయి...
 
 1. ఫియర్స్ స్నేక్ లేక ఇన్‌ల్యాండ్ తైపాన్

 ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సర్పం. ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఇది ఒక్కసారి కాటేస్తే వచ్చే విషంతో 100 మంది మనుషులు, 2,50,000 ఎలుకలు చనిపోతాయట. అంటే సాధారణ కోబ్రాలో ఉండే విషంతో పోలిస్తే యాభై రెట్లు.  
 
2. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్
 ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, ఇండోనోసియాల్లో అత్యధికంగా కనిపించే ఈ పాము అత్యంత వేగంగా కదులుతుంది. దీనికి కోపం ఎంత ఎక్కువంటే ఒక్కసారి కాటేసి ఊరుకోదట. కసి తీరేవరకూ వేస్తూనే ఉంటుందట.

3. బ్లూ క్రెయిట్
 ఇవి ఆగ్నేయ ఆసియా, ఇండో నేసియాల్లో కనిపిస్తాయి. ఇవి రాత్రిళ్లు చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. కోబ్రాలో కంటే పదహారు రెట్ల అధిక విషం ఉంటుంది వీటిలో. ఇది కాటు వేస్తే కండరాలు చచ్చుబడటం, నరాలు చిట్లిపోవడం, వాంతులు వంటి లక్షణాలు కలుగుతాయి. త్వరగా చికిత్స చేయకపోతే కోమా లోకి వెళ్లిపోవడమో, బ్రెయిన్ డెడ్ కావడమో జరుగుతుంది.
 
4. తైపాన్
 ఇది కూడా ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కరవగానే రక్తం గడ్డ కట్టడం మొదలవుతుంది. ఊపిరి సలపదు. ఓ గంటలోపే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇది కరిచిన ప్రతిసారీ విషయం విడుదల కాదట. విడుదలైతే మాత్రం అంతే సంగతులు.
 
5. బ్లాక్ మాంబా
ఆఫ్రికా ఖండంలో ఇవి విరివిగా ఉంటాయి. నేలమీద జీవించే పాముల్లో ఇది అత్యంత వేగ వంతమైన సర్పం. ఒక్క కాటుతో విడుదలయ్యే విషంతో పది నుంచి ఇరవై అయిదు మంది ప్రాణాలు పోతాయి. ఇది కరిస్తే ముందు నోరు ఆరిపోతుంది. కళ్లు మసకబారతాయి. కండరాలు పట్టు వదిలేస్తాయి. కడుపునొప్పి, వాంతులు, పెరాలిసిస్.. ఇలా రకరకాల సమస్యలు తలెత్తి పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల్లోపు ప్రాణం పోతుంది.
 
6. టైగర్ స్నేక్

ఆస్ట్రేలియాలో కనిపించే ఈ సర్పం ఒంటిమీది డిజైన్ పులుల మాదిరిగా అనిపిస్తుంది. అందుకే దీనికా పేరు వచ్చింది. ఇవి గుడ్లు పెట్టవు. ఒకేసారి ఇరవై నుంచి ముప్ఫై పిల్లల్ని కంటాయి. కరిస్తే అరగంటలో ప్రాణం పోతుంది. ఒకవేళ విషం కాస్త తక్కువ మోతాదులో విడుదలైతే ఆరు నుంచి ఇరవై నాలుగ్గంటల్లో పోతుంది.
 
7. ఫిలిప్పైన్ కోబ్రా
 కోబ్రాలన్నింటిలోకీ ఇది ప్రమాదకరమైనది. ఇది మన ప్రాణం తీయాలంటే దాని దగ్గరకు వెళ్లక్కర్లేదు. మూడు మీటర్ల దూరంలో ఉన్నా మన ముఖమ్మీదికి విషాన్ని చిమ్ముతుంది. అది కళ్లలో పడితే చూపు పోతుంది. శరీరంలోకి చేరితే కార్డియాక్ అరెస్ట్ అయ్యి ప్రాణం పోతుంది.
 
8. వైపర్స్
 సా స్కేల్డ్ వైపర్, చెయిన్ వైపర్, పిల్ వైపర్స్ అంటూ వీటిలో చాలా రకాలు ఉన్నాయి. అన్నీ ప్రమాదకరమే. ఇండియా, చైనా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో విరివిగా ఉంటాయి. రకరకాల రంగుల్లో ఉంటాయి. ఇవి జంతువుల్ని చుట్టేసి కాటేసి వదిలేస్తాయి. అవి విలవిల్లాడి చనిపోయేవరకూ ఉండి అప్పుడు మింగుతాయి.  
 
9. డెత్ యాడర్
 ఆస్ట్రేలియా, న్యూ గినియాల్లో కనిపించే ఈ సర్పాలు తోటి సర్పాల్ని కూడా కాటేస్తుంటాయి. ఇవి ఎంత తెలివైనవంటే... ఆకలేసినప్పుడు తలని, తోకని మాత్రమే బయట ఉంచి మిగతా శరీరాన్ని ఇసుకలోనో, ఆకుల్లోనో దాచిపెట్టేసుకుంటాయి. అవతలి జీవులు దగ్గరికి రాగానే మింగేస్తాయి.
 
10. ర్యాటిల్ స్నేక్
 గలగలా శబ్దం చేస్తూ కొట్టుకునే తోకను బట్టి దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. అమెరికా, కెనడా, అర్జెంటీనాల్లో కనిపిస్తుంది. ప్రపంచంలో మొత్తం ముప్ఫై ఆరు రకాల ర్యాటిల్ స్నేక్స్ ఉన్నట్లు అంచనా. మరణానికి చేరువవుతున్న దశలో వీటిలోని విషం మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
 
పర్యావరణం భయమే.. సగం విషం
పాములు పంటపొలాలను నాశనం చేసే ఎలుకలను, కీడు చేసే కీటకాలను తింటాయి. వీటి వల్ల మనిషికి మేలే జరుగుతుంది. అదీకాకుండా పర్యావరణ సమతుల్యం కాపాడటంలో పాముల పాత్ర అధికంగా ఉంటుంది. పాము కనపడగానే చంపేయడం అనే ఆలోచన మానుకోవాలి. అలాగే, దేవత అంటూ పూజల పేరిట చేసే అకృత్యాలకు స్వస్తి చెప్పాలి. మన దగ్గర మాత్రం రక్తపింజర, తాచుపాము, చిన్నపింజర, కట్లపాము.. ఈ నాలుగే విషపూరితమైనవి. పాము కాటు వేయగానే చాలా మంది విపరీతమైన భయాందోళనలకు లోనవుతారు. ఈ కారణంగా సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. ఏదైనా పాము కాటు వేస్తే వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అన్ని పెద్ద ఆసుపత్రులలో దీనికి సంబంధించిన మందులు ఉన్నాయి.  ముందైతే మన జాగ్రత్తలో మనం ఉంటే పాములతో ఎలాంటి సమస్యా లేదు.  - అవినాష్ విశ్వనాథ్,  ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ జనరల్ సెక్రటరీ
 
ఫస్ట్ ఎయిడ్
పాము కాటు... ప్రథమ చికిత్స

 పాము కాటు తర్వాత రెండు సూదులు గుచ్చినట్లుగా ఉంటే అది విషసర్పం కాటు అని తెలుసుకోవచ్చు. దీనికి తక్షణం చికిత్స అవసరం  పాము కాటు తర్వాత ఆందోళన వద్దు. దాని వల్ల రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. ఫలితంగా ఒంటిలోపల విషం వేగంగా విస్తరించి, ప్రాణాపాయమూ కలగవచ్చు.   కాటుకు గురైన వ్యక్తి ఒంటి మీది ఉంగరాలు, బ్రేస్‌లెట్స్, వాచీ, తాయత్తులు వంటి వాటిని తొలగించాలి   వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.

చేయకూడదని పనులు :   ఆస్పిరిన్ మాత్రలు లేదా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు  సినిమాల్లో చూపించినట్లుగా పాముకాటుపై గాటుపెట్టడం, విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం వంటివి అసలు చేయకూడదు   పాము కాటు వేసిన చోట ఐస్ పెట్టడం, కాపడం పెట్టడం వంటివి చేయకూడదు   చేతిపైనా లేదా కాలిపైన కాటు పడ్డప్పుడు దాన్ని గుండె కంటే పైన ఉండేలా పెట్టకూడదు  వీలైతే కాటు వేసిన పామును గుర్తించగలిగితే మంచిదే. ఎందుకంటే కొన్ని విషాలు నరాల వ్యవస్థమీద, రక్తం మీద, కండరాల మీద పనిచేస్తుంటాయి. పామును స్పష్టంగా గుర్తించగలిగితే, దాని విషం పనిచేసే తీరు ఆధారంగా వెంటనే సంబంధిత యాంటీవీనమ్ ఇవ్వవచ్చు. అయితే ఇందుకోసం తాత్సారం చేయకూడదు.  - డాక్టర్ సి. హేమంత్, సీనియర్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్
 
సర్ప పురాణం
భారతీయ సంస్కృతిలో...అడుగడుగున పడగ జాడలు

పామును భారతీయులు నాగేంద్రుడిగా కొలుస్తారు. కొందరికి పాము ఇలవేల్పు. సాక్షాత్తు విష్ణుమూర్తి శయనించేది సర్పం మీదే. అందుకే ఆయన శేషశయనుడయ్యాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు పాములలో తాను అనంతుడ (ఆదిశేషుడు) నని చెప్పాడు. అనంతుడు అంటే అంతం లేనివాడని అర్థం. ఆదిశేషువును మూలప్రకృతికి ప్రతీకగా పురాణాలు చెబుతున్నాయి. శివుడి మెడలో కంఠాభరణంగా, వినాయకునికి జందెంగా నాగేంద్రుడు కనిపిస్తాడు.

విష్ణుపురాణం ప్రకారం బ్రహ్మదేవుని కుమారుడైన కశ్యపునికి నలుగురు భార్యలు. అందులో మూడవ భార్య అయిన కద్రువ వేయి పాములకు జన్మనిచ్చింది. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, క ర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు... ప్రముఖులు. ఆమె కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.

పాములు తమోగుణానికి ప్రతీక. ఇవి పాతాళంలో ఉంటూ, భూగర్భంలో ఉన్న సంపదలను సంరక్షిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మానవాళి పురాతన కాలం నుంచి పాముని ఆరాధించినట్లుగా చరిత్ర చెబుతోంది. పునఃసృష్టికి, శక్తికి ప్రతీకగా సర్పాలను కొలిచే ఆచారం భారతీయులలో ఉంది. పాము కుబుసం విడిచి, మళ్లీ చర్మం ధరించడం వల్ల వాటికి పునఃసృష్టి శక్తి ఉన్నట్లుగా భావిస్తారు. ముఖ్యంగా తాచుపామును నాగదేవతగా కొలిచే ఆచారం కనపడుతుంది. నాగపంచమికి, నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తే, ఆ పాలు నాగేంద్రుడు స్వీకరిస్తాడని ఒక నమ్మకం. భారతదేశంలో అనేక ప్రాంతాలలో నాగేంద్రుడి ఆకారంలో చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. అనంతపురం జిల్లా లేపాక్షిలో పెద్ద నాగేంద్రుని శిలా విగ్రహం ఇందుకు నిదర్శనం.

దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ప్రమాదవశాత్తు తాచుపాము చనిపోతే, మానవులకు అంత్యక్రియలు జరిపిన విధంగా వీటికి కూడా చితి పేర్చి తలకొరివి పెట్టి, భస్మం చేస్తారు. ఉత్తర భారతదేశంలో మగ పామును నాగరాజుగా భావించి, గుడి కట్టి, ఆ విగ్రహానికి పూజలు చేస్తారు. మరికొన్ని ప్రాంతాలలో నేరుగా సర్పానికే పూజలు చేస్తారు. సింధు నాగరికత ప్రజలు సర్పాన్ని పూజించినట్లుగా చరిత్ర చెబుతోంది. ‘కద్రువ నాగమాత’ అని చిన్నయసూరి బాలవ్యాకరణంలో నాగేంద్రుడిని ప్రస్తావించాడు.
 భాగవతంలో అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి సన్నద్ధులయ్యారు. మంధరగిరిని కవ్వంగా ఎంచుకున్నారు. తాడుగా వాసుకిని ప్రయోగించారు. తల భాగం వైపు రాక్షసులు, తోక భాగం వైపు దేవతలు నిలబడి, మంధరగిరిని చిలికారు. అమృతాన్ని సాధించారు. ఈ సత్కార్యంలో వాసుకిదే ప్రధానపాత్ర. శంకరుడికి ఆభరణంగా ఉన్న సర్పం కారణంగా సంగీతంలో ‘శంకరాభరణం’ అనే రాగం కూడా పుట్టింది. నాగరత్నమ్మ, నాగమణి, నాగేశ్వరరావు... వంటి పేర్లు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది. సర్పాన్నే భుజంగం, అహి, పాము, ఉరగం, గాలి మేపరి, పన్నగం... వంటి అనేక పేర్లతో పిలుస్తాం. భారతీయ సాహిత్యంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ నవలలో ప్రథమంగా, ‘వేయి పడగల పాము విప్పారుకొని వచ్చి, కాటందుకొన్నది కలలోన రాజును’ అని వర్ణించాడు.  - డా. పురాణపండ వైజయంతి
 
 

మరిన్ని వార్తలు