నింగిలో వెలుగు నేలను చేరిన సుదినం | Sakshi
Sakshi News home page

నింగిలో వెలుగు నేలను చేరిన సుదినం

Published Sun, Dec 24 2017 1:31 AM

tomorrow christmass - Sakshi

ఆకాశంలో వెలుగు
బెత్లెహేము ఊరి వెలుపల పొలంలో రాత్రివేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా హఠాత్తుగా గొప్ప వెలుగు ఆవరించింది. ఆకాశం నుంచి మాటలు వినిపించాయి.. ‘‘ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త నేడు మీకు తెలుపుతున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. పశువుల పాకలో ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి, పశువుల తొట్టిలో పరుండి ఉండడం మీరు చూస్తారు’’ప్రకటన అయిన వెంటనే గగనం నిండిన దేవదూతల సమూహాలు, పాటల ప్రతిధ్వనులు ‘సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ....

ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద శాంతి, సమాధానం కలుగును గాక..!’’ నింగి, నేల ప్రతిధ్వనించిన ఆ సంతోష శుభవర్తమానాలు, సంగీత నాదాలు, వెలుగుల వైభవ కాంతులు స్వర్గలోకపు స్తుతిపాటలు ఆకాశంలో వెలుగులను విరబూశాయి. దివిలోని దూతల సమూహాలు, భువిలోని గొర్రెల కాపరులు కలిసి కబుర్లాడుకున్న అపూర్వ.. అపురూప సన్నివేశానికి కారణం పతనమైన మానవజాతిని ఉద్ధరించి, రక్షించి, నిత్యానంద సంతోషాన్నిచ్చే రక్షకుని, ప్రభుని జననం.. క్రిస్మస్‌! క్రీస్తుకు అర్పిస్తున్న ఆరాధన!

‘‘ఆశ్చర్యకరుడు... ఆలోచన కర్త.. బలవంతుడయిన దేవుడు... నిత్యుడగు తండ్రి... సమాధానకర్త అయిన అధిపతి... ఆయన భుజము మీద రాజ్యభారముంటుంది...’’ వందలు, వేల సంవత్సరాలకు ముందు ప్రవచించబడ్డ ప్రవక్తల మాటలు పొల్లుపోకుండా అక్షరమక్షరం శరీర రూపుదాల్చాయి! తల్లిదండ్రులు దైవదూత ఆశించినట్టే ‘యేసు’ అనే పేరు పెట్టారు. సృష్టికర్తగా పరమందు ఉండి మనిషి హృదయంలోని అవకతవకలను ఎలా చెక్కుతూ సరి చేస్తున్నాడో, ఈ లోకంలోని తండ్రి ఇంట కూడా అదే చేశాడు. కట్టెలను, కొయ్యలను కోసి, చెక్కి, ఉపయోగకరమైన అందమైన వస్తువులను చేసే వడ్రంగి పనిని యోసేపునకిచ్చి– అతనని తనను పెంచే తండ్రిగా ఎంచుకున్నాడు.

ఆ పనిలోని సులువులను, నైపుణ్యాలను తండ్రికి నేర్పించాడు. అతి తక్కువకాలంలో చరిత్రను మార్చే ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చుననే కాలం విలువను, పనిపట్ల అంకితత్వాన్ని ప్రజలకు నేర్పించాడు! మనిషి నీతిగా బతికితేనే శాంతి సొంతమవుతుందని ప్రకటించాడు. ప్రకృతిని శాసించాడు. మరణించిన వారిని పునర్జీవుతులను చేశాడు. సత్యాలను, విలువలను బోధించాడు! ‘‘యేసుక్రీస్తు గురించి, ఆయన చేసిన ఇంకా ఎన్నో కార్యాల గురించి రాస్తే– అలా రాయబడే గ్రంథాలకు ఈ భూలోకం చాలదు’’అని ఆయన శిష్యుడు యోహాను అన్న మాటల్ని నిజం చేస్తూ, ప్రపంచ సాహిత్యంలో తొంభైశాతం క్రీస్తు ప్రేమతో ప్రభావితమౌ రాయబడినదే! ఆయన పలికిన మాటలు లక్షల గ్రంథాలకు రూపునిచ్చాయి. ఆయన సందేశం కోట్లాది ప్రజల జీవితాలను మార్చివేసింది. ఆయా దేశాల పాలనా విధానాలను తీర్చిదిద్దింది. ప్రభుత్వాల రాజ్యాంగాలు, చట్టాలు మానవత్వంతో పరిమళించేందుకు ‘నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న వెలుగు రేఖ ప్రామాణికమయ్యింది.

మానవీయ విలువలను బోధించే క్రీస్తు ప్రభువు మాటలను అందరూ ఆచరించగలిగితే మన దేశంలో శాంతి సౌభాగ్యం సమృద్ధిగా ఉండేవి కాని, కొట్టు, నరుకు, చంపు అనే పదాలనే నిరంతరం వినే సమాజం బాలలు వాటినే నినదిస్తారు తప్ప– ప్రేమించు, ఆదరించు, క్షమించు, సహించు అనే భావాలను ఎలా అలవరచుకోగలరు? అధికారం, అహంకారం, అసమానతల విద్వేషాలతో సాగుతున్న వ్యవస్థలో ప్రేమ, దయ, కరుణ ఉప్పొంగే యేసు ప్రభువు మాటలు గాఢాంధకారంలో వెలుగు కిరణాలుగా ప్రసరించాయి. కఠినాత్ములను కరుణామూర్తులను చేశాయి. దీనులను, హీనులను ఆత్మస్థైర్యంతో నింపి, తామూ ఇతరులతో సమానమే అన్న నమ్మకాన్ని, జీవితం మీద ఆశను రగిలించాయి. మహారక్షకుడిగా అభిషిక్తుడైన ఆ ప్రభువు జననం చీకట్లను ఛేదించిన వెలుగు కిరణాల గానం! గుండె గుండెలో నినదించే సుమధుర సునాదాల సంరంభం!! అదే క్రిస్మస్‌ మహా పర్వదినం!
 

క్రిస్మస్‌ చెట్టు ఆవిర్భావానికి కథ ఒకటి చెప్తారు. ఆ కథేంటంటే...
’’చాలా ఏళ్ళ క్రితం క్రీస్తు పుట్టినరోజున చర్చికి వెళ్లి, రకరకాల బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లవాడికి ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో పైసా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబో తన ఇంటిముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి, ఓ చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసికెళ్లాడు.

అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన వారంతా ప్లాబో చేతిలోని కుండీని చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యంగా.. ఆ చిన్న మొక్క అప్పటికప్పుడు పెద్ద మొక్కగా ఎదిగి, బంగారు వృక్షంగా మారిపోయిందట! ప్రేమతో ఆ పేద బాలుడు తెచ్చిన కానుకే విశిష్టమైనది అయింది. అందరూ ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు సిగ్గుపడ్డారు. మంచి మనస్సుతో ఇవ్వడం ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా అందరూ క్రిస్మస్‌ చెట్టుని అలకరించడం మొదలుపెట్టారట!’’

– ఝాన్సీ కె.వి.కుమారి

Advertisement
Advertisement