ప్రయాణం... ఒరు మధుర జ్ఞాపకం... | Sakshi
Sakshi News home page

ప్రయాణం... ఒరు మధుర జ్ఞాపకం...

Published Wed, Apr 20 2016 11:05 PM

ప్రయాణం... ఒరు మధుర జ్ఞాపకం...

వేసవిలో...

 

ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్... ఈ రెండు ముక్కలు చిన్నప్పుడు వీధిబడిలో తెలియడం గొప్ప. పాస్ట్ అంటే గతం అని తెలియడం చాలా గొప్ప. కాని క్లాస్‌మేట్ ఒకడు ఒక ఆకు ఎక్కువే చదివి ఎక్స్‌కర్షన్‌కు రెలైక్కి- అబ్బ... ట్రైన్ భలే ఫాస్ట్‌గా పోతోందిరా అంటే అదేదో తప్పు మాట్లాడానుకొని ఒకటే ఏడిపించిన గుర్తు. పాపం చాలా చిన్నబుచ్చుకున్నాడు. కాని దాని అర్థం నిజంగా తెలిశాక ఇప్పటికీ చిన్నబుచ్చుకుంటూనే ఉండాల్సి వస్తోంది. ‘నాన్‌స్టాప్’ అనే పాట ఎనభైల్లో చాలా పాపులర్. ఫలానా ఊరు నుంచి ఫలానా ఊరికి వెళ్లాలంటే మధ్యలో ఎన్నో స్టాపులు. హోల్డాన్‌లు. రైరైలు. కాని నాన్‌స్టాప్‌లు వచ్చాక వేగం పెరిగింది. ప్రయాణపు కోరిక కూడా పెరిగింది. ఎవరు ఎటుపోయినా ఆగాల్సిన అవసరంలేని వేగానికి అలవాటు పడటం మొదలైంది.

 
ఆటోలు, సెవన్‌సీటర్‌లు లేని కాలం అది. రైలు దిగితే, బస్సులో నుంచి కాలు బయటపెడితే రిక్షా ఎక్కాలి. రిక్షా మాత్రమే ఎక్కాలి. కొన్ని గూడు రిక్షాలు, కొన్ని ఓపెన్ రిక్షాలు. బెజవాడ రిక్షాలు ఒకలాగా. మద్రాసు రిక్షాలు ఒకలాగా. ఆకారం ఏదైనా దేని ముచ్చట దానిది. జట్కాలు ఉండేవి. అవి పచ్చగడ్డి వాసన వేసేవి. గుర్రం పరుగు పెడుతూ ఉంటే చర్నాకోలాను బండి చక్రం పళ్లకు తాడనం చేయిస్తూ జట్కావాడు చేసే కటపట శబ్దం ఒక మధుర జ్ఞాపకం. కళ్లెం బిగించిన గుర్రం నోటి దగ్గర కొద్దిగా కారే ఆ తెల్లటి నురగ కూడా.

 
వేసవి వస్తుంది. బంధువులందరూ గుర్తుకు వస్తారు. చిటికెన వేలి దగ్గరి నుంచి బొటన వేలి వరకూ మడుస్తూ మడుస్తూ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు... మార్కులు, ర్యాంకులు కాదోయ్ పిల్లలకు సంబరం... ఇవిగో టికెట్లు అనే మాటే కదా లడ్ల మూట. ప్రయాణం రోజునే ఎందుకు పులిహార చేస్తారో తెలియదు. ప్రయాణం మధ్యలోకని కొన్ని చల్ల మిరపకాయలతో పాటు కట్టిన పెరుగన్నం పొట్లాలే వైరు బుట్టలోకి ఎందుకు చేరుతాయో తెలియదు.

 
విండో సీటు అతి పెద్ద విలన్. ఒక్క విండో సీటు ఇద్దరు అన్నదమ్ములను నిలువునా చీల్చేస్తుంది. ఇద్దరు అక్కచెల్లెళ్లను బద్ధశత్రువులుగా మార్చేస్తుంది. అమ్మానాన్నలు ఈ తగువు తీర్చలేక కండక్టర్‌నే సుప్రీం కోర్టుగా భావించి చూస్తారు. లక్కీగా బుర్ర మీసాలున్నవాడు డ్రైవర్‌గా ఉంటే అతన్ని చూపి భయపెడతారు. పాపకు తల తిప్పుతుందేమో... బాబుకు డోకు వస్తుందేమో... కాని ఊరు వచ్చేలోగా నాన్నకు తల తిప్పుతుంది... అమ్మ తలను బయటకు పెట్టి వ్యాక్ వ్యాక్ అంటుంది. కొంగులో కట్టి తెచ్చిన నిమ్మకాయను ముక్కుకు అడ్డుగా పెట్టుకుంటుంది.

 
బస్సుల్లో జామకాయలు వస్తాయి. నీళ్లు కారుతున్న కలర్ సోడాను పట్టుకుని ఒక కుర్రాడు అటూ ఇటూ తిరుగుతుంటాడు. పాప్‌కార్న్ అప్పుడప్పుడే కొత్త. సీల్ చేసిన ప్యాకెట్లలోని పసుపురంగు పాప్‌కార్న్‌ను కళ్ల ముందు ఊపుతారు. ఫుల్లుగా ఉన్న బస్సులో ఒకే ఒక్క సీటు ఖాళీగా ఉంటే దానిలో కూర్చోకూడదని కూర్చుంటే లేపి కండక్టర్ కూచుంటాడని అతి తొందరగా తెలుస్తుంది. బస్సు నడిచినంత సేపు గేర్‌రాడ్డునే గమనించడం ధ్యానానికి ఏమాత్రం తక్కువ కాదు. దానిని అలా ఎలా పడితే అలా ఆడిస్తూ బస్సును నడిపించేవాడు బ్రూస్‌లీ కంటే ఏమాత్రం తక్కువ వీరుడు కాడు.


కాని పూలమ్మే వాళ్లు మాత్రం రైళ్లనే తమ పుట్టిళ్లు చేసుకుంటారు. మల్లెలమ్మా... జాజులమ్మా... ఇప్పుడే తోట నుంచి వచ్చాయమ్మా అని మెత్తగా పలుకుతూ పచ్చటి తామరాకుల్లో చుడుతూ కంపార్ట్‌మెంట్లను పరిమళభరితం చేస్తారు. ఏడుకొండల సామీ... ఎక్కాడున్నావయ్యా... ఈ దేశపు అసలు స్వరూపం ఆ యాచకుని పాటలో అవగతమైనట్టు అనిపిస్తుంది. అమ్మ ఎటో చూస్తుంది. నాన్న ఆలోచిస్తూ ఉంటాడు. పాపం... ఇద్దాం నాన్నా అనంటే కొంత చిల్లర అతని జోలెలో పడుతుంది. మధ్య స్టేషన్‌లో ట్రైన్ దిగి కుళాయి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి సీసాలో నీళ్లు పట్టుకొని తిరిగి రెలైక్కడం ఆ రోజుల్లో అనకొండను పట్టి బంధించడం కంటే తక్కువ సాహసం కాదు. కొందరు తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తారు. కొందరు తల్లిదండ్రులు సీటుకేసి కట్టేస్తారు.

 
రైలు ప్రయాణంలో ఒక థ్రిల్ ఏమిటంటే అది ఉండి ఉండి ఎక్కడో ఆగిపోతుంది. ఎందుకు ఆగిందో తెలియదు. ఎప్పుడు కదిలిందో తెలియదు. అప్పుడు తీరిగ్గా రైలు దిగి పొలాలు చూస్తూ, ట్రాక్ మీదుగా కంపార్ట్‌మెంట్ నీడలో కొంత దూరం నడుస్తూ, కంకర రాళ్లను విసిరి ఇనుప స్తంభాలను టంగుటంగు మనిపిస్తూ, ఒక కన్ను సిగ్నల్ మీద వేసి, విసురుగా వీచే గాలిలో ఏమీ తోచక హాయిగా తిరగడం నిజంగానే ఒక మధుర జ్ఞాపకం. నేరుగా ఉంటాయనుకున్న పట్టాలు ఎంత వంకరగా ఉంటాయో మలుపు తిరిగి ఉన్న రైలును చూసి తెలుసుకోవడం చాలా మంచి జ్ఞాపకం.

 
ఊళ్లకు వెళితే ఏమవుతుంది? ఊళ్లు తిరిగితే ఏమవుతుంది? ఆ ఊళ్లల్లోని గోడలు తెలుస్తాయి. మన ఊరిలోని సినిమా పోస్టరే ఈ ఊరిలో కూడా అంటిస్తారని అక్కడిలాగే మనుషులు ఇక్కడ కూడా సమానం అని తెలుస్తుంది. బంధువుల్లోని అమ్మ మన అమ్మలాగే ఉంటుందని బంధువుల్లోని నాన్న మన నాన్నలాగే ఉంటాడని కూడా తెలుస్తుంది. అందరూ మాటిమాటికీ నవ్వుకుంటూ ఉంటారని అందరూ పదే పదే కబుర్లు చెప్పుకుంటారని అందరికీ సాటి వాళ్లతో కలిసి ఉండటమే ఇష్టమని తెలియడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇది చాలా పెద్ద దారపు ఉండ అనీ ఒక కొసలో మనం ఉంటే మరో కొసలో మనవాళ్లు ఉంటారని ఈ కొసను ఇంకా పొడిగిస్తే ప్రాంతాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి అందరం ఒకటేనని అన్ని ప్రాంతాలూ ఒక్కటేనని తెలుసుకున్నట్టు అవుతుంది. జీవితం కొండగుహ. చీకటిగా ఉంటుంది. కాని ప్రయాణం టార్చిలైట్. దానిని చెదరగొడుతుంది. అప్పటి జ్ఞాపకాలు అప్పటివి. ఇప్పుడు చేసేవారి జ్ఞాపకాలు మర్నాటివి. ప్రకృతి ఎండను అందుకే తీక్షణం చేస్తుంది. చర్రుమని వీపు మాడ్చి బ్యాగ్ పుచ్చుకుని బయల్దేరండిరా అని చెప్పడానికే తీక్షణం చేస్తుంది.  ఈ వేసవి- నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆదాబ్ తెలంగాణ.                                                                       

 

 

Advertisement
Advertisement