లక్షల్ని బస్తాలకెత్తుతున్నాడు! | Sakshi
Sakshi News home page

లక్షల్ని బస్తాలకెత్తుతున్నాడు!

Published Mon, Aug 5 2013 11:48 PM

లక్షల్ని బస్తాలకెత్తుతున్నాడు! - Sakshi

ఉజ్వల్ కుమార్ యంగ్ అండ్ డైనమిక్. అందుకే అతడు 2011లో చెన్నైలోని ఎంజీఆర్ యూనివర్శిటీ నుంచి ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పట్టా అందుకుని బయటికి రాగానే ఉద్యోగం ఇస్తాం రమ్మని పెద్దపెద్ద కంపెనీలు అతడి వెంట పడ్డాయి. వాటన్నిటినీ కాదని ముజఫర్‌పూర్‌లోని తన ఇంటి దారి పట్టాడు ఉజ్వల్. అయితే ఉత్తర బీహార్‌లోని ఆ సొంత పట్టణం అతడికి ఏ విలువా ఇవ్వలేదు! చిన్న పొలం చెక్క కూడా లేనివాడు పట్టభద్రుడైతే ఏంటి? పీహెచ్.డీ చేస్తే ఏంటి అన్నది అక్కడివారి అభిప్రాయం. 
 
భూమి ఉన్నవాడే అక్కడ మనిషి. ఆ లెక్కన ఉజ్వల్ మనిషి కాదు. అతడికి సెంటు భూమి కూడా లేదు. మరి ఉజ్వల్ అక్కడికి ఎందుకు వెళ్లినట్లు? వ్యవసాయం చేయడానికి!! వ్యవసాయం తన ప్రాణం అన్నాడు. కౌలుకిస్తే పండించుకుంటానన్నాడు. ఊళ్లో భూములున్నవారు నమ్మలేదు. మోతుబరులకే కావట్లేదు, స్టూడెంటు కుర్రాడివి నీకేం చేతనౌతుందని చీవాట్లు పెట్టి పంపారు. అక్కణ్ణుంచి దగ్గర్లోనే ఉన్న సిరిసియా వెళ్లాడు ఉజ్వల్. 
 
అక్కడ భిక్షువులుంటారు. వారికొక పెద్ద ఆరామం ఉందని, ఆ ఆరామం పేరిట కొన్ని భూములు ఉన్నాయని తెలుసుకుని ఆరామం పెద్ద దగ్గరికి వెళ్లాడు. ‘రెండెకరాలు పొలం ఇప్పించండి. బంగారం పండించి ఇస్తాను’ అన్నాడు. ‘పండిన బంగారం నువ్వే ఉంచుకుని, పంటను మాత్రం మాకివ్వు చాలు’ అన్నారాయన. అలా ఉజ్వల్‌కుమార్ బి.టెక్ కాస్తా కౌలుదారుగా మారిపోయాడు. తను మారడమే కాదు, రెండేళ్లలో ఆ చుట్టుపక్కల నిరుద్యోగుల దశను కూడా మార్చాడు. 
 
ప్రస్తుతం ఆ యువరైతు నెలసరి ఆదాయం కనీసం 75 వేలు. గరిష్టంగా లక్ష! ఇంతకీ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రెండ్స్ తలా ఇంత వేసుకున్నారు. వేసిన పంట ఏమిటి? ఒకటి కాదు, రెండు పంటలు. పసుపు కొమ్ములు, కంద. ఉపయోగించిన టెక్నాలజీ ఏమిటి? పెద్దగా ఏంలేదు. హైబ్రిడ్ విత్తనాలు, అధునాతన పద్ధతులు. స్థానికంగా ఇప్పుడతడు నిరుద్యోగ యువకులకు ‘వ్యవసాయ గురు’. ‘నచ్చిన పనే మనల్ని ఎప్పటికైనా నిలబెడుతుంది’ అంటాడు ఉజ్వల్. కానీ అతడిని చాలా త్వరగా నిలబెట్టినట్లుంది. ప్రస్తుతం డెబ్బైఎకరాలలో పంట పండిస్తున్నాడు ఉజ్వల్.

Advertisement
Advertisement