Sakshi News home page

భలే ఆప్స్

Published Wed, May 28 2014 10:07 PM

Unlock Reward Points

అన్‌లాక్‌తో రివార్డ్ పాయింట్స్

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే.. రోజుకు పది, ఇరవైసార్లైనా దాన్ని అన్‌లాక్ చేస్తూంటాం. కాల్ వచ్చినా, లేకున్నా జరిగే ఈ పనితో మీకు ‘ప్రయోజనం’ ఉంటే? భలే ఉంటుంది కదూ. అన్‌లాకర్ UnLockar అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే జరిగేది ఇదే. ఫోన్‌ను అన్‌లాక్ చేసిన ప్రతిసారీ మీకు కొన్ని రివార్డు పాయింట్లు దక్కుతాయి. వాటితో మీరు షాపింగ్ చేయవచ్చు. బుక్ మై షోతో సినిమా టికెట్లూ పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చిన నెట్ ఛానెల్స్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం మాత్రమే. ఆ తరువాత మొత్తం వ్యవహారమంతా మీ లాక్‌స్క్రీన్‌పైకి మారిపోతుంది. ఒక్కసారి ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత మీ లాక్‌స్క్రీన్‌పై మీకు నచ్చిన ఛానెల్ తాలూకూ వివరాలు ప్రత్యక్షమవుతాయి. స్క్రీన్‌ను ఒకవైపునకు స్వైప్ చేస్తే ఛానెల్ వివరాలను పోస్ట్ చేయవచ్చు. మరోవైపునకు స్వైప్ చేస్తే ఇంకో పని ఇలా... ప్రతిసారీ మీకు కొన్ని యూపాయింట్లు దక్కుతాయి. వాటితో కంపెనీకి చెందిన యూషాప్‌లోగానీ, ఇతర పార్టనర్ వెబ్‌సైట్ల ద్వారా గానీ వస్తువులుగా మార్చుకోవచ్చు.
 
 అంధుల కోసం ఆప్...

దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి ఈ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ భలే ఉపయోగపడుతుంది. యూనివర్శిటీ ఆఫ్ అలికాంటీ (స్పెయిన్) అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్ అంధుల దారిలో ఎదురయ్యే అవరోధాలను ముందుగా గుర్తించి వినియోగదారుడిని హెచ్చరిస్తుంది. ఫోన్‌లోని త్రీడీ కెమెరా సాయంతో ఇది జరిగిపోతుంది. తొమ్మిది మంది అంధులపై పరిశీలించి దీని పనితీరును నిర్ధారించారు. మనిషి కళ్ల మాదిరిగానే రెండు లెన్సులు ఉన్న త్రీడీ కెమెరాను ఉపయోగించడం వల్ల ఈ అప్లికేషన్ ద్వారా అవరోధాలను గుర్తించడం సులువు అవుతోందని అంచనా. ఏదైనా అవరోధం ఆరు అడుగుల కంటే తక్కువ దూరంలో ఉన్నట్లు గుర్తించిన వెంటనే అప్లికేషన్ వైబ్రేషన్ ద్వారా వినియోగదారుడిని హెచ్చరిస్తుంది. దగ్గరకొచ్చిన కొద్దీ వ్రైబేషన్ స్థాయి పెరిగిపోతుంది. సౌండ్ అలర్ట్ కూడా వినిపించడం మొదలవుతుంది. అతిత్వరలోనే ఈ అప్లికేషన్ అందరికీ అందుబాటులోకి రానుంది.
 
 సీక్రెట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్‌లోనూ...

ఆపిల్ ఐస్టోర్‌లో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన ‘సీక్రెట్’ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఫోన్ల్‌కూ అందుబాటులోకి వచ్చేసింది. మీ ఉనికిని బహిరంగపరచకుండా అంతర్జాతీయ ఫోరమ్‌లలో పోస్టింగ్ చేసేందుకు, ఫైల్స్ షేర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. సీక్రెట్ అప్లికేషన్ కోసం సైన్ చేసిన వెంటనే మీ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత జరిగేదంతా రహస్యమే.
 

Advertisement
Advertisement