కాళ్ల సత్యనారాయణ.. రాయని ఆత్మకథ | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 26 2018 12:58 AM

The Unwritten Autobiography Tribute To Kalla Satyanarayana - Sakshi

కాళ్ల సత్యనారాయణ ప్రపంచాన్ని ఎన్నడూ లెక్క చెయ్యలేదు, ప్రపంచమూ అతణ్ని అలాగే  పట్టించుకోలేదు. అతని కవిత నిరూపం, ఆయన గానం ఏకాంతం, కుంచె ధరించిన ఆ చేయి నైరూప్యం, తను తొక్కిన రిక్షా పెడల్‌పై జారిన చెమట చుక్క నిశ్శబ్దం. చిత్రకారుడు, కవి, రిక్షా పుల్లర్, స్క్రీన్‌ ప్రింటర్, తన లోకపు నవ్వుల వేదాంతి కాళ్ల సత్యనారాయణ నవంబర్‌ 24 తెల్లవారు ఝామున ప్రపంచపు పోకడ నుండి నిష్క్రమించారు. దాన్ని మనం మరణం అనుకోవచ్చు. 

గత ఇరవై రోజుల నుండి మృత్యుశయ్యపై మేను వాల్చి ఉన్న ఈ మనిషి, అంతకు రెండు రోజుల ముందే బాల్యమిత్రుడు కడుపు గంగాధర్‌ కోరిక మేరకు తన జీవితానికి అక్షర రూపం ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు పేరాలు మాత్రమే ఆ రచన సాగాక ఆసుపత్రి పాలయ్యారు, మనకో ఆత్మకథ దక్కే అదృష్టం లేకుండా. ఆ రాసింది సాక్షి సాహిత్యం పాఠకుల కోసం...

‘ఓ జ్ఞాపకం. నేను రెండుమూడు తరగతుల్లో వున్నప్పుడే బొమ్మలెయ్యడం ఇష్టం. నాలుగైదు తరగతులకొచ్చేసరికి ఇష్టం పిచ్చిగా మారింది. ఆ వయసులో మా కుటుంబం బీదరికం కంటే దీనంగా వుండేది. రాత్రిపూట కోడిగుడ్డు చిమ్నీ కిరసనాయిల్‌ దీపం ముందు చదువుకుంటున్నట్టు నటించేవాణ్ని. అంతకుముందే మా అమ్మ హెచ్చరించేది ‘నాయనా కిరసనాయిల్‌ రేపటిక్కూడా అదే’ అని. ఆ దెబ్బకి ప్రాణం గిలగిల్లాడిపోయేది. రిక్షా తొక్కీ తొక్కీ మా నాన్నా, పాచి పనులు చేసి మా అమ్మా అలిసిపోయి, ఎప్పుడెప్పుడు నిద్రపోతారా అని చూసేవాణ్ని. అంతకుముందే దీపాన్ని గోరంత చేసేవాణ్ని. వాళ్లు నిద్రపోయారన్న సంకేతాలు రాగానే... ఇక నా అస్త్రాలు (అంగుళన్నర పెణసలు ముక్క, అరిగిపోయిన లబ్బరు, పొద్దున బడిలో పక్కోడి నోటు పుస్తకంలోంచి కొట్టేసిన తెల్లకాయితం) తీసేవాణ్ని ధైర్యంగా. కానీ నా ముందున్న ఆ గోరంత దీపాన్ని పెంచే ధైర్యం లేకపోడంతో అది అలా మిణుకుతూనే వుండేది. ఐనా, ఎక్కళ్లేని ఉత్సాహంతో బొమ్మ మొదలెట్టేవాణ్ని. ఆ క్షణాల్లో, ఈ ప్రపంచంలో నేనొక్కణ్నే. ఎవరన్నా వుంటే... నాతరవాతే. అలాగ ఎంతసేపుండేవాడినో! 

నా పిచ్చి అమ్మా నాన్నలు ఒళ్లెరక్క నిద్రపోతుంటే అలివికానంత ఆనందంగా వుండేది. వాళ్లు హాయిగా నిద్రపోతున్నారని కాదు, ఇక ఆ సమయంలో నాకు యే అడ్డూ లేదని. ఎలాంటి కాలసూచికలూ లేని ఆ యింట్లో, నా లోకంలో వున్నప్పుడు, ఏదో కవురుకంపు యీ లోకంలోకి లాగింది. ఏదో కాలుతుంటే వచ్చే దుర్వాసన అది. ఆ వేళప్పుడు ఏదో తగలబడుతున్నట్టనిపించి భయవేసింది. తీరా చూస్తే కాలింది నా జుత్తే, దానివల్లే కవురు కంపు. ఏమయిందంటే, నా ముందున్నది గుడ్డిదీపం బుడ్డి, దాని వెలుగెంత! నేను వేసే బొమ్మ కోసం బాగా కిందకి వంగితే చిమ్నీలోంచి వచ్చే సెగకి నా జుత్తు కాలిందన్నమాట...

Advertisement
Advertisement