ఉత్తమ విలన్? | Sakshi
Sakshi News home page

ఉత్తమ విలన్?

Published Fri, May 1 2015 11:57 PM

ఉత్తమ విలన్? - Sakshi

సల్మాన్ ఖాన్ ఉత్తమ హీరో కావచ్చు.
ఉత్తమ విలన్ కావచ్చు.
కాని ఉత్తమ నటుడు ఎప్పుడూ కాడు...
జీవితంలో నటించడం అతనికి చేత కాదు.
ఒంటి మీద ఉన్న చొక్కాను విప్పి 42 అంగుళాల ఛాతీని...
దాని చాటున ఉన్న గుండెను చూపినట్టే ఏదీ దాచలేడు.
ఈ కారణం వల్లే అతడు హీరో అయ్యాడు.
కానీ వివాదాల వల్ల విలన్ కాబోతున్నాడా?
 

షారూక్‌ఖాన్‌ను అందరూ షారూక్ అంటారు. ఆమిర్‌ఖాన్‌ను ఆమిర్ అని ఆదరిస్తారు. సల్మాన్‌ఖాన్‌ను మాత్రం సల్లూ భాయ్ అని ప్రేమగా
 చేరదీసుకుంటారు. జనం ఒకరిని తమ సోదరుడిగా అన్నగా అనుకోవాలంటే అతడిలో చాలా ఉండాలి. తన ప్రయత్నం లేకుండానే వాళ్ల హృదయాలను తాకే పనులేవో చేస్తూ ఉండాలి. కపటం లేదు. కుట్ర లేదు. బయట ఒకలాగా లోపల ఒకలాగా వ్యవహరించే నటన లేదు.ప్రేమ ఉంటే వ్యక్తం చేస్తాడు. కోపం ఉంటే ప్రదర్శిస్తాడు. జేబు నుంచి ఏదైనా  తీసి ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు. కాదు అనుకుంటే దేవుణ్ణయినా ఎదిరిస్తాడు. ముక్కున కోపం. కరిగితే మంచు.
 
షారూక్‌ఖాన్ తొలిరోజుల్లో సల్మాన్ ఇంట్లో ఆదరణ పొందాడని చాలామందికి తెలియదు. షారూక్ కెరీర్ నిలబడ్డానికి సల్మాన్ సాయం చేశాడని కూడా చాలామందికి తెలియదు. కత్రీనా కైఫ్ పార్టీలో ఆ షారూక్ మీద సల్మాన్ భగ్గుమనడమే అందరికీ కనిపించింది. కాని తన చెల్లి పెళ్లికి స్వయంగా ఆహ్వానించి ఆ వేడుకలో మరో అన్న మిస్ కాకుండా చూశాడు.
 
సల్మాన్ కుటుంబంతో జాతి కులం మతం అనే బేధం లేదు. ఎక్కువ తక్కువ అనే వివక్ష లేదు. నలుపు తెలుపు అనే తేడా లేదు. తండ్రి సలీమ్‌ఖాన్ ముస్లిం. తల్లి  సుశీల హిందు. దారిన పోయే ఒక దీనురాలు ఎవరో కుమార్తెను కని చనిపోతే ఆ పాపను దత్తత తీసుకొని అర్పిత అని పేరు పెట్టుకొని సొంతబిడ్డ కంటే గారాబంగా పెంచి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. సాధారణంగా చెల్లి ప్రేమకు అన్న విలన్. సల్మాన్ కోట్లాది రూపాయలు కానుకగా ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఐశ్వర్యారాయ్‌ని ప్రేమ  కోసం వేధించాడని పుకారు. కాని అలా అని చెప్తూ మీడియాకు అందిన టేప్ నకిలీది అని ఫొరెన్సిక్ నిపుణులు తేల్చారు.
 
చాలామంది సల్మాన్ వల్ల ఇవాళ నోటికి నాలుగు మెతుకులు తినగలుగుతున్నారు. సంజయ్ లీలా బన్సాలి తొలి సినిమా ఖామోషీ బయటకు రావడానికి సల్మాన్ కారణం. హిమేష్ రేష్మియా దేశానికి తెలిశాడంటే సల్మాన్ కారణం. కత్రినా కైఫ్ నంబర్ ఒన్ స్థానంలో ఉందంటే సల్మాన్ కారణం. రాజకీయపరంగా, సినిమాల పరంగా వెనకబడి- సల్మాన్ నువ్వే సహాయం చేయాలి అని అడిగితే- గోవిందాకు ‘పార్టనర్’ సినిమాలో లైఫ్ ఇచ్చి నిలబెట్టాడు. స్థూలకాయంతో బాధపడుతున్న సోనాక్షి సిన్హా, బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌లను మీరు టాప్ స్టార్స్ కాగలరు అని ఉత్సాహపరిచి స్టార్‌లను చేసినవాడు సల్మాన్. ఈ నొప్పి కంటే చావే నయం అనిపించే ముఖ నరాల సమస్య ఉన్నా పంటి బిగువున భరిస్తూ ఉత్సాహంగా తనను నమ్ముకున్నవారికి భరోసాగా కనిపించే ధీరోదాత్తత.
 
ఇప్పుడు కూడా అతడి మీద దాదాపు 500 కోట్ల వ్యాపారం జరుగనుంది. ప్రత్యేక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సినిమా పరిశ్రమకు ప్రత్యేక్ష దైవం. ఈ దైవం ఉంటే కెమెరా ముందు ఉండాలి. లేదంటే ప్రేక్షకుల ముందు ఉండాలి. కాని కటకటాల వెనుక ఉంటే?
 
రెండు ప్రాణాలు పోయాయని సల్మాన్ మీద అభియోగం. ఒకటి

1998లో రాజస్థాన్‌లో ఒక కృష్ణజింక అతడి చేతిలో హతమైందని కేసు నమోదైంది. 2002లో ముంబైలో కారు దూసుకెళ్లిన సంఘటనతో పేవ్‌మెంట్ మీద నిద్రపోతున్న ఒక వ్యక్తి చనిపోయాడని మరో కేసు. రెండు కేసులూ అనేక ఏళ్లుగా నడుస్తున్నాయి. అందులో ‘హిట్ అండ్ రన్’ కేసు తీర్పుకు వచ్చింది. రేపో మాపో తీర్పు. నేరం రుజువైతే పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలియక ఇండస్ట్రీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
 
‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి మానవ సేవలో అసలైన ఆనందం ఉందని చెబుతున్న సల్మాన్ నేరం రుజువైతే విలన్ అవుతాడు. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ దిల్ దే చుకే సనమ్, దబంగ్ సినిమాల హీరో విలన్ కాగలడా, విలన్‌గా
 మిగలగలడా?
 
సల్మాన్‌కు జైలు శిక్ష పడితే సూరజ్ భరజ్యాత్యా తాజా సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఘోరంగా నష్టపోతుంది. ఎందుకంటే అది ఇంకా షూటింగ్ దశలో ఉంది. కరణ్ జొహర్ మరో భారీ సినిమా ‘శుద్ధి’ సల్మాన్‌తో సగం పూర్తయ్యింది. అదీ ఆగిపోతుంది. సల్మాన్ వల్లే టిఆర్‌పి రేటింగుల్లో నిలిచి ఉన్న బిగ్‌బాస్ షో తీవ్రమైన నష్టాన్ని చవి చూస్తుంది. ఇవన్నీ పక్కనపెడితే సల్మాన్ లేని ముంబై, అతడు సైకిల్ మీద రివ్వున తిరుగుతూ కనిపించే ఆ గల్లీలూ స్టూడియోలూ, ముంబై నైట్ పార్టీలు బోసి పోతాయి.
 
 రేపు ఏదైనా జరగొచ్చు.  ఉత్తమ హీరో! ఉత్తమ విలన్?
 
పుట్టింది డిసెంబర్ 27, 1965 (49 ఏళ్లు)
 
తొలి సినిమా: బివీ హో తో ఐసీ
(ఆగస్టు 26, 1988న విడుదల)
 
కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా
మైనే ప్యార్ కియా
(డిసెంబర్ 29, 1989న విడుదల)
 
అవార్డులు
మైనే ప్యార్ కియాతో ఫిల్మ్‌ఫేర్,
కుచ్‌కుచ్ హోతాహై సినిమాకు
రెండో ఫిల్మ్‌ఫేర్ అవార్డు
 
చారిటీ
2007లో ’బీయింగ్ హ్యూమన్’
ఎన్జీవో ప్రారంభం. దీని ద్వారా
అనాథపిల్లలకు సాయం.
 
కృష్ణజింకల కేసు
1998లో జోధ్‌పూర్ కోర్టులో
కేసు నమోదు. 2006లో
ఐదేళ్ల జైలు శిక్ష. 3 రోజులు జైల్లో .
శిక్షపై స్టే. 2012 నుంచి
రాజస్థాన్ హై కోర్టులో విచారణ.
 
తదుపరి విచారణ
మే 4, 2015
 
హిట్ అండ్ రన్ కేసు
2002 సెప్టెంబర్ 28న బాంద్రా ప్రాంతంలో కారు ప్రమాదం. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌పై
అరెస్టు. బెయిల్. విచారణ మొదలు.
 
ఈ కేసులో తుదితీర్పు
మే 6, 2015
 

Advertisement

తప్పక చదవండి

Advertisement