నాటకంలో గాంధీ బాట | Sakshi
Sakshi News home page

నాటకంలో గాంధీ బాట

Published Wed, Oct 2 2019 5:22 AM

Vijay Bhaskar Special Story on Gandhi Jayanti - Sakshi

జాతీయోద్యమంలో మహాత్మునిది ఒక శకం. బ్రిటీష్‌వారు ఈ ప్రపంచాన్ని పాలించడానికే పుట్టారన్న భావన ఆయన రాకతో పటాపంచలైంది.  దక్షిణాఫ్రికాలో మొదటి తరగతి రైలు బోగీ నుంచి∙గెంటి వేయబడిన ఒక భారతీయుని ఆత్మబలం ఆ తర్వాత రోజుల్లో జాతీయోద్యమానికి నాయకత్వం వహించేలా ప్రజ్వరిల్లింది. అహ్మదాబాద్‌ కోర్టులో మహాత్మునిపై రాజద్రోహం నేరం మోపబడినప్పుడు ‘నేను నిప్పుతో చెలగాటం ఆడుతున్నానని నాకు తెలుసు. కానీ మీరు స్వేచ్ఛనిచ్చి వదిలేస్తే నేను మళ్లీ అదే పని చేస్తాను’ అన్నాడాయన. గాంధీ ఇచ్చిన ఇలాంటి స్టేట్మెంట్లు భారతీయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అప్పటివరకు ఉన్నత వర్గాలకు పరిమితమైన స్వాతంత్య్ర పోరాటం కింది వర్గాలకు చేరింది. 

ఆనాడు జాతి యావత్తు గాంధీ వైపు చూసింది. అతని బాట నడిచింది. కవులు గొంతు కలిపారు. కళాకారులు వంతపాడారు. ఎంతో కవిత్వం, అనేక కథలు, నవలలు, నాటకాలు భారతీయ భాషల్లో వచ్చాయి. స్వరాజ్య సాధనే లక్ష్యంగా గాంధీని, గాంధీతత్త్వాన్ని వస్తువుగా చేసుకొని వచ్చిన నాటకాలు నాడు తెలుగునాట ఉర్రూతలూగించాయి. 

తెలుగులో మొదట గాంధీజీని కథానాయకుడిగా చేసుకొని రెండు నాటకాలు 1. నవయుగం, 2. గాంధీ విజయం రాసినవారు దామరాజు పుండరీకాక్షుడు. ఈయన గొప్ప గాంధేయవాది. ఇంకా, పండిత సీతారామ రచించిన ‘స్వరాజ్యధ్వజము’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి ‘గాంధీ విజయ ధ్వజ నాటకం’, పాకురి అంజయ్యగారి రచన ‘భారత దివ్య దర్శనం’,  ముద్దా విశ్వనాథంగారి ‘జన్మభూమి’,  జాస్తి వెంకట నరసయ్య, ధూళిపాల వెంకట సుబ్రహ్మణ్యం గార్లు కలిసి చేసిన రచన ‘కాంగ్రెస్‌ విజయం’ ముఖ్యమైనవి. 

గాంధీ మహాత్మున్ని కథానాయకుడిగా ఈ వ్యాస రచయిత రచించిన ‘గాంధీ జయంతి’ (నాటకం), ‘బాపు చెప్పిన మాట’ (నాటిక) విరివిగా ప్రదర్శితమయ్యాయి. గాంధీ బతికి వచ్చి ఈనాటి రాజకీయ నాయకుల్ని, వారి ప్రవర్తనను, ప్రజలపై వారికున్న అవకాశవాద దృక్పథాన్ని చూసి ఎలా స్పందిస్తారనేది ఇతివృత్తం. గాంధీ చెప్పిన మాటను సూచించిన బాటను అనుసరించని రాజకీ య పక్షాలు అన్నీ ఏకమై కుట్రపన్ని ఆయన్ని ఖూనీ కేసులో ఇరికిస్తారు. గాంధీజీకి ఉరిశిక్ష పడుతుంది. గాంధీ తన చివరి కోరికగా భారతదేశంలో మళ్లీ పుట్టాలని ఉందంటాడు. దేవేంద్రుని సారథి మాతలి తీసుకొచ్చిన పుష్పక విమానంపై తిరిగి స్వర్గానికి వెళ్లిపోతూ.. ‘ఉషోదయపు వెలుగుల్లో జాబిలి వెన్నెల్లో నేనే ఉంటాను.. విరిసిన పుష్పం గా, కురిసే మేఘంగా నేనే వస్తాను.. నింగిన చుక్క నై, నాలుగు దిక్కులై నేనే నిలుస్తాను.. అన్యాయపు కోట లని, అవినీతి బాటల్నిఅంధకా రపు గోడల్ని అం తం చే  యడానికి మళ్లీ అవతరిస్తా..  అంతం చేస్తా... అంటూ ఆ నాటకం ముగుస్తుంది.  
– డాక్టర్‌ దీర్ఘశి విజయభాస్కర్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత 

Advertisement
Advertisement