విజయా వారి విందుభోజనం | Sakshi
Sakshi News home page

విజయా వారి విందుభోజనం

Published Fri, Mar 7 2014 11:56 PM

విజయా వారి  విందుభోజనం

 ఆ మధ్య వరకు ప్రతి టీవీ చానల్‌లోనూ ఆవిడ చేసిన వంటలే... ఏ వార్తాపత్రికలో చూసినా ఆమె రుచులే... ఏ రేడియో ఆన్ చేసినా ఆమె వంటల స్వరమే...చిరునవ్వులు చిందిస్తూ, చేసే పనిని ఆస్వాదిస్తూ...కన్నతల్లిలా ఆప్యాయంగా వంట నేర్పిస్తూ... ఇంటింటా ప్రత్యక్షమయ్యారు... ‘శాకాహార వంటలు’ పరిచయం చేశారు... ఐదువేలకు పైగా కార్యక్రమాలు చేసి రికార్డు సృష్టించిన దిట్ట పాకశాస్త్ర ప్రవీణురాలువిజయారావు. ఊరంతా పురుష పుంగవులే చెఫ్‌లుగా రాణిస్తుంటే, అందుకు భిన్నంగా వనితల చేతి వంటే రుచి అని నిరూపించిన ఆమె ప్రస్థానం
 

 ఈ ‘మహిళా దినోత్సవ’ ప్రత్యేకం...
 
 
 ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే అవార్డులు, బహుమతులు స్వాగతం పలుకుతాయి. ఆ వెంటనే ఆ బహుమతులు అందుకున్న వ్యక్తి చిరునవ్వుతో లోపలకు ఆహ్వానిస్తారు. ఆ పలకరింపులో అమ్మలోని ఆప్యాయత, ఆ చేతి ముద్దల మాధుర్యం గుబాళిస్తాయి. ఆవిడ చేయి కదిపితే వంట, చిరునవ్వులో చిట్టి చిట్కాలు, పలకరింతలో పంచదారచిలుకలు... మొత్తం మీద ఆ ఇల్లు నలభీమశాల. ఏ మాత్రం భేషజం, గర్వం లేకుండా నిండుకుండలా ఉన్న ఆమె ఇంట్లో వంటింటి ఘుమఘుమలు మన నాసికను ముద్దాడతాయి. అంతటి అమృతహస్తం విజయారావుది. వరంగల్‌లో పుట్టి పెరిగిన విజయారావు, ఐడిపియల్‌లో పనిచేస్తున్న రామమోహనరావుగారితో వివాహం జరిగాక ఎన్నో రాష్ట్రాలు పర్యటించి, ప్రస్తుతం హైదరాబాద్‌లో తన ఏకైక కుమారుడితో నివాసం ఉంటున్నారు.
 

ఇలా మక్కువ...
 ఆమె చిరునవ్వులకు ఏ మాత్రం తీసిపోని, ఆ గదికి అందం తెచ్చిన అవార్డుల గురించి ప్రశ్నిస్తే,  ‘‘మా అమ్మ వంట బాగా చేసేది. అందుకేనేమో నాకు చిన్నప్పటి నుంచీ వంట మీద మక్కువ కలిగింది. అమ్మ దగ్గర నుంచి రకరకాల వంటలు నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న వంటలకే ఈ అవార్డులు. అంతేకాదు... మావారు భోజనప్రియులు. అందువల్ల వంట బాగా చేయడం నేర్చుకున్నాను. దానికితోడు ఆయనే స్వయంగా రకరకాల వంటలు తయారుచేయడం దగ్గరుండి మరీ నేర్పించారు. ఆయన శిక్షణలో మరింత రుచిగా చేయడం వచ్చింది. ఆ వంటలను మా వంటింటి నుంచి, అందరి వంటిళ్లకు చేర్చాలనుకున్నాను. కొత్తకొత్త వంటలను అక్షరీకరించి, 1998 నుంచి అన్ని ప్రముఖ వార్తాపత్రికలకు పంపడం మొదలుపెట్టాను. అవి అందరి వంటిళ్లను పలకరించాయి. ఇదంతా ఒక్కరోజులో సాధించినది కాదు.
 

కఠోరశ్రమ...

 ‘‘నా వంటలు బాగున్నాయని చాలామంది ప్రశంసిస్తుంటారు. అదే నాకు ఆనందం, బలం. ఆ ఆనందంతోనే  అన్ని పత్రికలకూ కొన్ని వందల వంటల గురించి రాసి పంపాను.  అదే సమయంలో, ‘వంటలు చేస్తూ జీవితం గడుపుతావా?’ అని ఎందరో నన్ను నిరాశపరిచారు. ఎప్పుడైతే నేను అవార్డులు, బహుమతులు సంపాదించుకున్నానో, అప్పుడు వారి నోళ్లన్నీ మూతపడ్డాయి’’ ఒకప్పుడు అందరూ  తనను  నిరాశపరిచిన సంఘటన గుర్తుతెచ్చుకుంటూ చెప్పారు అరవైనాలుగేళ్ల విజయారావు. ఫలానా వారి అమ్మాయిగానో, ఫలానా వారి భార్యగానో కాకుండా, ‘విజయారావు’ అనగానే పాకశాస్త్ర ప్రవీణురాలు అని ఠక్కున గుర్తు వచ్చేలా చేసుకున్నారు. ఇంత గుర్తింపు వెనుక ఆమె కఠోరశ్రమ, పట్టుదల ఉన్నాయి.
 

 అన్నిటినీ ఆస్వాదిస్తారు.

ఇన్నిరకాల వంటలు ఆవిడకు తెలియడానికి కారణం విజయారావుగారి భర్త రామమోహనరావు ఉద్యోగ రీత్యా  తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఉన్నప్పుడు అక్కడి వంటకాలు నేర్చుకున్నారు. ‘‘నేను ఎక్కడికి వెళితే అక్కడి రుచులను బాగా ఆస్వాదించాను. అలాగే నేను మన వంటకాలు తయారుచేసి అక్కడి వారికి రుచి చూపించాను. వారి దగ్గర నుంచి అక్కడి వంటకాలు నేర్చుకున్నాను. అలా రకరకాల వంటలలో ప్రావీణ్యం సంపాదించాను’’ అంటారు... వంటలకు భాషాభేదం లేదనే విజయారావు.
 తపన ఉండాలి...
 సుమారు ఇరవై ఏళ్ళ పాటు 23 చానల్స్‌లో 5000 పైగా వంటలు చేసిన ఆమె, స్టార్ ప్లస్ చానెల్‌లో మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి వెళ్లినప్పుడు, అక్కడ నాన్ వెజ్ తయారుచేయవలసి రావడంతో వెనక్కు వచ్చేశారు. ప్రస్తుతం ఏ చానల్‌లోనూ పెద్దగా కనిపించట్లేదు. ఆ మాటే అడిగితే, ‘‘ఈమధ్యకాలంలో టీవీలో వంటల కార్యక్రమాలు చేసేవారు, టీవీలో కనిపిస్తే చాలనుకుంటున్నారు. నాకు మాత్రం వంట బాగా రావాలనే తపన ఎక్కువ. నేనే స్వయంగా తింటున్నంత ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. అందువల్లే ఇన్ని ఎపిసోడ్స్ చేయగలిగాను. అంతేకాదు, ఈ కార్యక్రమాల పని మీద సుమారు ఇరవై జిల్లాల్లో పర్యటించాను. వంటల కార్యక్రమాలకు జడ్జిగా వెళ్లిన ప్రతిచోటా చాలామంది మగవాళ్లు, ‘మేం మంచి భోజనం తింటున్నాం, అని నన్ను అభినం దిస్తూ  నా ఆటోగ్రాఫ్ అడుగుతుంటే నాకు మళ్లీ ఉత్సా హం వస్తూంటుంది’’ అంటారు.
 

 తెలుగువంటలే ఇష్టం...

 ‘‘నేను ఎన్ని రకాల వంటలు చేసినా పులిహోర అంటే చాలా ఇష్టం. ఇంకా చేగోడీలు, మిర్చి బజ్జీలు కూడా ఇష్టంగా తింటాను. కొందరు నేపాలీయులు నా దగ్గర ప్రత్యేకంగా పులిహోర తయారీ నేర్చుకున్నారు.  స్వీట్స్ లో పాలతో తయారుచేసేవంటే ఇష్టం’’ అంటారు ఈ వంటలరాణి. ఇంతకాలం వివిధ ప్రాంతాలకు చెందిన రకరకాల వంటలను పరిచయం చేసిన విజయారావు, ప్రస్తుతం ఎస్‌విబిసి చానల్‌వారి ‘నైవేద్యం’ కార్యక్రమం ద్వారా ప్రసాదాలు ఎలా తయారుచేయాలో నేర్పబోతున్నారు.
 - డా. వైజయంతి
 
 
 ‘టీవీలో నా కార్యక్రమం చూసి ఇడ్లీబండి, బజ్జీల బండి పెట్టుకున్నవాళ్లు ‘అమ్మా! మీరు నాకు సహాయం చేశారు’ అంటున్నప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు. అలాగే నేను ఈ రంగంలో రాణించడానికి కారణం ప్రముఖ రచయిత్రి, వంటలు - పిండివంటలు పుస్తకం ఫేమ్ మాలతీచందూర్‌గారే. నేను ఆవిడకు ఏకలవ్య శిష్యురాలిని. ఘుమఘుమలు, మిర్చిమసాలా, ఖానా ఖజానా అనే మూడు పుస్తకాలు ప్రత్యేకంగా ప్రచురించాను. ఈ పుస్తకాలు కొత్తగా పెళ్లయినవారికి  బాగా ఉపయోగపడతాయి’
 - విజయారావు

Advertisement
Advertisement