కరుణామయుడు మనిషి కొరకు దైవమే... కరిగి వెలిగిన కాంతిపథం... | Sakshi
Sakshi News home page

కరుణామయుడు మనిషి కొరకు దైవమే... కరిగి వెలిగిన కాంతిపథం...

Published Sat, Apr 4 2015 10:15 PM

కరుణామయుడు  మనిషి కొరకు దైవమే...  కరిగి వెలిగిన కాంతిపథం...

రొట్టెల్లేవు... అన్నీ రాళ్లే! పువ్వుల్లేవు... అన్నీ ముళ్లే!  డబ్బుల్లేవు... నిద్ర లేదు... తిండి సహించదు...  ప్రతి క్షణం టెన్షన్... టెన్షన్! ఒక్క సినిమా... ఒకే ఒక్క సినిమా తీయడం కోసం... విజయచందర్ నెత్తి మీద ముళ్లకిరీటం ధరించారు. కాలం కొట్టిన కొరడా దెబ్బలను భరించారు. కలవరపడినా... కల్లోలపడినా... చివరకు కదిలింది కరుణరథం! మనిషి కొరకు సాక్షాత్తూ దైవమే... వెంట నిలిచాడా అనిపించిన ‘చిత్ర’పథం! ‘కరుణామయుడు’ చిత్రమే కాదు... చిత్రనిర్మాణమూ ఓ చరిత్ర. 37 ఏళ్ల క్రితం కెమేరా ముందు జరిగిన ఒక దైవఘటన!
 క్రీస్తు పునరుత్థానమైన ‘ఈస్టర్’ సందర్భంగా... ‘కరుణామయుడు’ తెర వెనుక కథ...
 
 1978...  మద్రాసులోని ‘ఆంధ్రా క్లబ్’...  ‘‘షో...’’ అని గట్టిగా అరిచాడు విజయచందర్.

అక్కడున్న అందరి మొహాలూ వాడిపోయాయి. మరోసారి ఆట గెలిచాడు విజయచందర్. ఆ పేకముక్కల్ని గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు. టేబుల్‌పై చెల్లాచెదురుగా ఉన్న కరెన్సీని ఆప్యాయంగా పొదువు కుని జేబులో కూరుకున్నాడు. మళ్లీ ఆట మొదలు. ఉదయం నుంచి ఆ ఆట - పన్నెండోదో... పదమూడోదో! మనుషులు మారుతున్నారు కానీ, విజయ చందర్ మాత్రం కదలడం లేదు.
 చాలా దీక్షగా...  చాలా ప్రేమగా...  ఓ తపస్సులాగా ఆడుతున్నాడు. నిజంగా ఒక ఉన్మాదంలో ఉన్నాడు విజయచందర్.
 17 సిగరెట్లు... 21 కాఫీలు... తిండి మాత్రం లేదు.. అయినా ఆకలి తెలియడం లేదు.  అతని ఆకలి వేరే! డబ్బు ఆకలి. సాయంత్రమయ్యే సరికి విజయచందర్ దగ్గరకు ఒకతను వచ్చాడు.
 
అతనో ప్రొడక్షన్ మేనేజర్. జేబులో నుంచి డబ్బులన్నీ తీసి లెక్కపెట్టి ‘‘ఇవ్వాళ పదివేలు వచ్చాయి. షూటింగ్‌కి కావాల్సినవన్నీ కొనేయండి. మళ్లీ రేపు సాయంత్రం వస్తే ఇంకొంత డబ్బిస్తాను...’’ అని చెప్పాడు విజయచందర్. ఆ ప్రొడక్షన్ మేనేజర్ అయోమయంగా ముఖం పెట్టి వెళ్లిపోయాడు. దాదాపు 30 రోజుల పాటు ఇదే తంతు. రెండు వేల రూపాయలతో లోపలికి వెళ్లినవాడు పది లక్షలతో బయటకు వచ్చాడు.  ఆ డబ్బులతో అతను చేసిందేంటో తెలుసా? ఆగిపోయిన ‘కరుణామయుడు’ సినిమాను పూర్తి చేయగలగడం!  ఒక పరమ పవిత్రమైన సినిమాకు పేకాట డబ్బా?  విజయచందర్‌కు పిచ్చెక్కిందా?\  ఎర్రగా కొబ్బరిలౌజులా ఉండే విజయచందర్ కొంచెం శ్రద్ధ పెడితే హీరోగానో, విలన్‌గానో రాణించే పరిస్థితి.  అవన్నీ వదిలేసి క్రీస్తు సినిమా వెనుక ఎందుకు పడ్డట్టు?  ఆ సినిమా చేయడానికి అతనికేం అర్హత ఉంది?  ఒక సద్బ్రాహ్మణుడు... జీసస్ కాగలడా? ఎన్నో కామెంట్లు... ఎన్నో వాగ్బాణాలు... ఎన్నో ముళ్లు...  వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ‘కరుణామయుడు’.

 1970...

‘ఈ గడ్డంలో మీరు అచ్చం ఏసుక్రీస్తులా ఉన్నారు’ అన్నారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ‘మరో ప్రపంచం’ షూటింగ్ స్పాట్ అది. విజయచందర్‌కి అదే తొలి సినిమా. అందులో యువ జర్నలిస్టు పాత్ర.  మొదటి రోజే విజయచందర్‌కి ఏసుక్రీస్తులా ఉన్నావంటూ కాంప్లిమెంట్. అతనికి ఓ పక్క ఆనందం... మరోపక్క అయోమయం.  ఫలానా హీరోలా ఉన్నావంటే ఆనందపడాలి. కానీ, తాను ఏసుక్రీస్తులా ఉండటమేంటి?  విజయచందర్‌ది గమ్మత్తై ఫ్లాష్‌బ్యాక్... గ్రాండ్ ఫ్లాష్ బ్యాక్...
 
ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి తమ్ముడి మనుమడు తెలిదేవర విజయచందర్. చదువులో స్లో... ఆట పాటల్లో ఫాస్ట్. ముఖ్యంగా సినిమాలంటే ప్రాణం. సొంత పిన్ని టంగుటూరి సూర్యకుమారి లాగా సినిమాల్లో ఓ వెలుగు వెలగాలనేది విజయచందర్ డ్రీమ్. బి.ఏ. పట్టా చేతికి రావడం ఆలస్యం... సినిమా ఫీల్డ్‌లోకి జంప్. కానీ అక్కడేం చేయాలి?

 1965... ఓ సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు విజయచందర్.  సినిమా పేరు... ‘దారి తప్పిన డాక్టర్’. నిజంగానే ఆ సినిమాకి దారి తెలియక ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. ఆదుర్తి దగ్గర కో- డెరై క్టర్‌గా పనిచేసే కె.విశ్వనాథ్ పరిచయమై, ‘‘ఎందుకయ్యా నువ్వు సినిమా తియ్యడం... ఎంచక్కా యాక్టింగ్ ట్రై చేయొచ్చుగా...’’ అని సలహా ఇచ్చారు. ఇదేదో బాగుందే అనిపించింది విజయచందర్‌కి. అలా ‘మరో ప్రపంచం’తో సినీ ప్రపంచంలోకి విజయచందర్ ఎంటరయ్యారు.

వేషాలు బాగానే వస్తున్నాయి. ‘సుపుత్రుడు’లో ఏయన్నార్‌కి విలన్... ‘దేవీ లలితాంబ’లో కె.ఆర్.విజయకి విలన్..., ‘మా ఊరి మొనగాళ్లు’లో ఒక మొనగాడు, ‘రౌడీరాణి’లో కౌబాయ్ హీరో... విజయచందర్ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. అప్పటివరకూ విలన్‌గా చేస్తున్న కృష్ణంరాజు హీరోగా మారిపోవడంతో ఆ స్లాట్ ఖాళీ. ఆ స్లాట్ విజయచందర్‌కే అని ఫిక్స్ అయిపోయారు చాలామంది.
 ఆ రోజు - ఎవరో ఒకతను విజయచందర్‌నే దీక్షగా చూస్తున్నాడు. కాసేపటి తర్వాత దగ్గరకు వెళ్లి ‘‘అయ్యా... నా పేరు తంగప్పన్. నేనొక నృత్య దర్శకుణ్ణి. ‘అన్నై వేళాంగణి’ అనే తమిళ సినిమా డెరైక్ట్ చేయబోతున్నా. అందులో ఏసుక్రీస్తు పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలో తెలియక ఆగాం. మిమ్మల్ని చూడగానే ఆ పాత్రకు మీరే సూటబుల్ అనిపిస్తోంది. మీరా పాత్ర చేయాల్సిందే’’ అని చెప్పాడు తంగప్పన్.
 విజయచందర్ ఆశ్చర్యపడిపోయాడు... సంబరపడిపోయాడు. కానీ అది కొద్దిసేపే. ఏదో అవాంతరం వచ్చి, ఆ సినిమా చేయలేకపోయాడు.

1974 సెప్టెంబర్ 2... ‘రారాజు క్రీస్తు’ సినిమా ఓపెనింగ్... ఇద్దరు డెరైక్టర్లు... బి. కృష్ణమూర్తి, ఫాదర్ క్రిస్టఫర్ కొయిలో.
 మాటలూ -పాటలూ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం: బి. గోపాలం. టైటిల్ రోల్ విజయచందర్. హీరో కృష్ణ క్లాప్ కొట్టారు. ఓపెనింగ్ అయ్యాక ప్రెస్‌మీట్. ‘కాగడా’ శర్మ, వాశిరాజు ప్రకాశం, గౌతమ్, భూషణ్... ఇలా సినీ జర్నలిస్టులంతా వచ్చారు. వాళ్లతో వాడీ వేడిగా చిన్నపాటి డిస్కషన్. ‘‘నీకు తెలుసో లేదో ఈ మధ్య తమిళ సూపర్‌స్టార్ ఎమ్జీఆర్ ఈ పాత్ర చేయాలనుకుని మేకప్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. ఆ ఫొటోలు చూసి అందరూ మెచ్చుకోవడంతో క్యాలండర్లు కూడా వేయిం చారు. కానీ, షూటింగ్ మొదలుకాక ముందే ఆ సినిమా ఆగిపోయింది.

కొంతమంది నిర్మాతలు ఎమ్జీఆర్ దగ్గరకెళ్లి ‘ఈ సినిమా మీరు చేయొద్దు. ఈ పాత్ర వేసే నటుడు నామరూపాలు లేకుండా పోతాడని, చనిపోతాడని జనంలో ప్రచారం ఉంది. అందుకే హాలీవుడ్ సినిమా ‘టెన్ కమాండ్‌మెంట్స్’లో క్రీస్తు ముఖం కానీ, రూపం కానీ చూపించకుండా అంగీని, చేతిని మాత్రమే చూపించారు. అందుకే మీరీ పాత్ర చేయొద్దు’ అని చెప్పడంతో ఆయన సినిమా చేయడం మానేశారు. మరి నువ్వు ఈ పాత్ర చేశావనుకో. సినిమా మొదట్లోనో, మధ్యలోనో నీకేదైనా అయితే...?’’ అని చెప్పాడో జర్నలిస్ట్.
 ‘‘ఏం జరిగినా సరే నేనీ పాత్ర చేస్తాను’’ అన్నాడు విజయచందర్ మొండిగా. ‘‘మరి ఇలాంటి పవిత్రమైన పాత్ర చేస్తూ కౌబాయ్ వేషాలు, విలన్ వేషాలు ఎలా వేస్తావ్?’’ ఇంకో జర్నలిస్టు ప్రశ్న సంధించాడు. విజయచందర్ టకీమని ‘‘ఈ వేషం పూర్తయ్యేదాకా వేరే సినిమాలు చేయను’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు.
 
ఆ రాత్రి విజయచందర్‌కి నిద్ర పట్టలేదు. తన నిర్ణయం కరెక్టేనా? ఏదో అతీత శక్తి తననీ నిర్ణయం తీసుకునేలా చేసిందేమో అనిపించింది. తీరా నాలుగు రోజులు షూటింగ్ చేశాక ‘రారాజు క్రీస్తు’ ఆగిపోయింది.
 విజయచందర్ గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం చేయాలి?

సజ్జల చిట్టిబాబు... బాపు-రమణల సినిమాలకు చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆయనింట్లోనే ఉండేవాడు విజయచందర్.  ‘నువ్వు హీరోవవుతావ్’ అని మొదట చెప్పింది ఆయనే. ‘రారాజు క్రీస్తు’ ఆగిపోవడంతో విజయచందర్ వ్యాకులపడి పోయాడు. చిట్టిబాబు ధైర్యం చెప్పారు.

‘రారాజు క్రీస్తు’ సినిమా తెర వెనుక ఓ ముఖ్య వ్యక్తి ఉన్నారు. ఆయనే ఫాదర్ ఎం.ఎం. బాలగర్. ఎస్.జె. క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్‌కి చైర్మన్. ఆయనకీ సినిమా ఆగిపోవడం ఇష్టం లేదు. విజయచందర్, ఆయన దగ్గరకెళ్లి ‘‘ఆగిపోయిన ‘రారాజు క్రీస్తు’ సినిమాను ఎవరైనా టేకప్ చేస్తారేమో ప్రయత్నించమంటారా?’’ అనడిగాడు. ఓకే అన్నాడాయన. ఆ ప్రయత్నంలో విజయచందర్ తిరగని ఊరు లేదు. చివరకు బొంబాయి కూడా వెళ్లొచ్చాడు. ఫలితం శూన్యం.  ఇక ‘రారాజు క్రీస్తు’కు శుభం కార్డు పడిపోయింది. ‘‘ఏదైనా దారి చూపించు ప్రభూ...’’ అని ప్రార్థించాడు విజయచందర్.

చిట్టిబాబుకు చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలో భాగస్వామ్యం ఉంది. ఈ వ్యాపారం బావుందని ఆయన చాలాసార్లు చెప్పడంతో, విజయచందర్ దృష్టి అటు మళ్లింది. కొంతమంది మిత్రులతో కలిసి ‘ల్యూమ్స్ ఇండియా ఫ్యాబ్రిక్స్’ కంపెనీ పెట్టాడు. 9 నెలలు హ్యాపీ. ఇంతలో 4 లక్షల రూపాయలకో పెద్ద ఆర్డర్ వచ్చింది. కింగ్‌సైజ్, క్వీన్‌సైజ్ బెడ్ షీట్స్ అమెరికా పంపాలి. కానీ పంపడానికి పెట్టిన గడువు దాటిపోవడంతో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఆఫీసు నిండా దుప్పట్లే దుప్పట్లు. ఇక తనకు వ్యాపారం అచ్చిరాదని డిసైడైపోయాడు విజయచందర్.

రోజులు గడుస్తున్నాయి. మళ్లీ సినిమాల వైపు గాలి మళ్లింది. విజయచందర్‌కి ఓ ఆలోచన వచ్చింది. తానే నిర్మాతగా ఏసుక్రీస్తు సినిమా చేస్తే ఎలా ఉంటుంది? చిట్టిబాబు ఓకే అన్నారు. ఫాదర్ బాలగర్ కూడా పచ్చ జెండా ఊపారు. ఫాదర్ క్రిస్టఫర్ కొయిలోను కలిశారు. క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్‌లో పని చేస్తుంటాడాయన. బైబిల్‌పై బోలెడంత కమాండ్ ఉందాయనకు. జీసస్‌పై పరిశోధన చేసి ఆంగ్లంలో ఓ కథ తయారు చేశారు.

ఆ కథతో తీస్తే 13 గంటల సినిమా అవుతుంది. మూడు గంటల సినిమాకు కథను కుదించమని కోరాడు విజయచందర్. ఆయన కుదరదనేశారు. కథ మళ్లీ మొదటకు వచ్చేసింది. చేస్తే గీస్తే కొయిలో కథతోనే సినిమా చేయాలని విజయచందర్... చివరకు బాలగర్ రంగప్రవేశం చేశారు. కొయిలో మెత్తబడ్డారు.

మోదుకూరి జాన్సన్, విజయచందర్ రాత్రింబవళ్లు కూర్చుంటే 13 గంటల కథ 3 గంటలకొచ్చింది. కానీ, కొయిలో ఈ కథ విని కయ్‌మన్నాడు. ‘‘సినిమాలో అన్నీ చూపిం చడం కష్టం. ఇంతకు మించి నిడివి పెరగ కూడదు’’ అంటూ ఆయనను బుజ్జగించారు. ‘‘షూటింగ్ జరిగినన్నాళ్లూ మీరు మాతోనే ఉండాలి. కో-డెరైక్టర్‌గా కూడా పని చేయాలి’’ అనడిగితే, కొయిలో ఓకే.
 ఇక, జాన్సన్ మాటల పని మొదలు పెట్టారు. మళ్లీ ఇంకో గొడవ. మామూలు మాటలకు భిన్నంగా ప్రత్యేకంగా ధ్వనించే క్రిస్టియన్ యాసలో డైలాగులు రాస్తానంటాడాయన. ఛత్... వీల్లేదు... మామాలుగా అందరూ మాట్లాడుకొనేలానే డైలాగ్స్ ఉండాలంటాడు విజయచందర్. మళ్లీ బాల్ బాలగర్ కోర్టులోకి వెళ్లింది. ఆయన కూడా జాన్సన్ మాటే కరెక్టన్నారు. ఆ యాసలో లేకపోతే క్రిస్టియన్లు సినిమా చూడరని తేల్చి చెప్పేశారు.

కానీ, విజయచందర్ మాత్రం తన పట్టు వీడలేదు. ‘‘సార్... నేను ఈ సినిమా తీసేది క్రిస్టియన్ల కోసం కాదు. వాళ్లకు ప్రత్యేకంగా క్రీస్తు గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ ఉండదు. ఇది అందరు ప్రేక్షకుల కోసం తీసే సినిమా. వాళ్లకు అర్థమయ్యే భాషలో సినిమా ఉంటే, వాళ్లక్కూడా క్రీస్తు గొప్పతనం గురించి తెలుస్తుంది’’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. చిక్కుముళ్లన్నీ తొలగిపోయాయి.  సినిమా పని వేగవంతం అయ్యింది. టైటిల్ కూడా ఓకే.... ‘కరుణామయుడు’.

దర్శకునిగా ఎవరిని తీసుకోవాలి? విజయచందర్ మనసులో ఎందుకో భీమ్‌సింగ్ మెదిలారు. చాలా సీనియర్ డెరైక్టర్ ఆయన. దిలీప్‌కుమార్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో సినిమాలు తీసిన వ్యక్తి. విజయచందర్ అడగ్గానే సంతోషంగా ఒప్పుకున్నాడాయన. ఈలోగా ఇంకో సమస్య వచ్చి పడింది.  ‘రారాజు క్రీస్తు’కు పని చేసిన కొంతమంది టెక్నీషియన్లు ఫిల్మ్ ఛాంబర్‌లో కేసు పెట్టారు. ‘‘ఆగిపోయిన సినిమానే పేరు మార్చి మళ్లీ మొదలుపెట్టారు కాబట్టి, మా బ్యాలెన్స్ ఎమౌంట్ మాకు ఇప్పించండి’’ అనేది వారి వాదన. ‘‘అయ్యో! దానికీ దీనికీ సంబంధం లేదు. ఇది నేను కొత్తగా మొదలుపెట్టిన సినిమా’’ అని విజయచందర్ వాదించినా ఛాంబర్ పెద్దలు ఒప్పుకోలేదు. చివరకు వాళ్లతో రాజీ పడాల్సి వచ్చింది.

 సినిమా పని మొదలైంది. బి. గోపాలం, జోసఫ్ ఫెర్నాండెజ్‌లు పాటల తయారీలో పడ్డారు. ఐదు పాటలు.... సి.నారాయణరెడ్డి, గోపి, విజయరత్నం 4 పాటలు రాశారు. ఐదో పాట రాస్తానని మోదుకూరి జాన్సన్ ముచ్చటపడ్డారు. ఏసుక్రీస్తును శిలువతో ఊళ్లో ఊరేగిస్తున్నప్పుడు వచ్చే పాట. జాన్సన్ తనదైన క్రిస్టియన్ ధోరణిలో ఓ పాట రాస్తే, విజయచందర్ రిజెక్ట్ చేశాడు. ఇదేం పాట అని తిట్టినంత పని చేశాడు విజయచందర్. జాన్సన్‌కి కోపం వచ్చి రాత్రంతా కూర్చుని ‘కదిలింది కరుణ రథం...’  పాట రాశాడు. ఓ పక్క పాత్రల ఎంపిక జరుగుతోంది. ప్రతి ఒక్కరి దగ్గరకూ తనే వెళ్లి పారితోషికం తగ్గించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడు విజయచందర్. ఏదో మంత్రం వేసినట్టుగా

అందరూ ఓకే... ఓకే అనడమే.

జగ్గయ్య... రావు గోపాలరావు... రాజసులోచన... పద్మనాభం... మిక్కిలినేని... గిరిబాబు... చంద్రమోహన్... శ్రీధర్... రామ్మోహన్... ధూళిపాళ... ముక్కామల... కాకరాల... ‘వెన్నిరాడై’ నిర్మల... జయమాలిని... ఇలా తారలంతా రెడీ.
 సద్బ్రాహ్మణుడైన విజయచందర్ ఏసుక్రీస్తు సినిమా చేయడమేంటని ఒకటే  కామెంట్లు. అన్నీ విజయచందర్‌కు వినబడుతూనే ఉన్నాయి. ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నాడు. ఇంట్లోవాళ్లు మాత్రం ఒక్క మాట అనలేదు. వాళ్లకా పట్టింపులూ లేవు.

‘కరుణామయుడు’ తీయడానికి విజయచందర్ దగ్గర రూపాయి డబ్బు లేదు. ఉన్నదల్లా నాలుగు లక్షల దుప్పట్లు... వెల కట్టలేనంత కాన్ఫిడెన్సు.  ఆ దుప్పట్లనే సినిమా కాస్ట్యూమ్స్‌గా అనుకున్నారు. ఓ ఇరవైమంది టైలర్లను పెట్టుకుని దుప్పట్లన్నింటితో సినిమాకు అనుగుణంగా కాస్ట్యూమ్స్ తయారు చేయించారు. స్నేహితుల దగ్గర తలో కొంత అప్పు తీసుకుంటే లక్ష రూపాయలు పోగయ్యింది. క్రిస్టియన్ సెంటర్ వాళ్లూ చేతులెత్తేశారు. ఫాదర్ బాలగర్ మాత్రం ‘అమృతవాణి’ సంస్థ ద్వారా నాలుగు లక్షల బ్యాంక్ లోన్ ఇప్పించారు.

1977 ఫిబ్రవరి 10. మద్రాసులోని ఏవీయమ్ స్టూడియోలో ‘కరుణామయుడు’ షూటింగ్ స్టార్ట్. మొదటి రోజు హ్యాపీ. రెండో రోజు షూటింగ్ క్యాన్సిల్. ఎందుకంటే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ మరణించారు. మూడు రీళ్ల సినిమా అయ్యేసరికి చేతిలో డబ్బంతా అయిపోయింది. ఎక్కడా అప్పు పుట్టలేదు. షూటింగ్ ఆగిపోయింది.

కొడుకు బాధ చూసి విజయచందర్ నాన్న తెలిదేవర వెంకట్రావు కరిగిపోయారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న తమ 11 ఎకరాల స్థలాన్ని తాకట్టు పెట్టి ఆరు లక్షలు ఇచ్చారు. మళ్లీ కొంతకాలం షూటింగ్ జరిగింది... ఆ డబ్బు అయిపోగానే మళ్లీ ఆగిపోయింది. విజయచందర్‌కు 24 గంటలూ ఈ సినిమా గురించే ధ్యాస. హీరోగా చేయమని, విలన్‌గా చేయమని కొన్ని సినిమా ఆఫర్లు. అన్నిటికీ నో. మద్రాసులోని పాండీబజార్‌లో పిచ్చోడిలా తిరగసాగాడు. ఎవరైనా పలకరిస్తే ‘ఓ అయిదు లక్షలు అప్పిస్తారా?’’ అని వెంటపడేవాడు. ‘‘పాపం... మనిషి మంచివాడే కానీ, సినిమా ఆగిపోవడంతో మెంటల్‌గా ఇలా అయిపోయినట్టున్నాడు’’ అని అందరూ జాలిపడేవారు. అయినా విజయచందర్‌లో ఏదో తెలియని పట్టుదల. చివరకు ఒకాయన ఆరు లక్షలు అప్పు ఇస్తానని మాటిచ్చారు.

ఈసారి 30 రోజుల భారీ షెడ్యూలు చేయాలి. లొకేషన్... గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో భైరవపాడు అనే పల్లెటూరు. చూడడానికి అక్కడ కొంచెం జెరూసలేమ్ ఇళ్లల్లా ఉంటాయి. ఆర్ట్ డెరైక్టర్ దిలీప్‌సింగ్‌తో చెప్పి ఆ ఊరంతా సెట్లు వేయించారు. రేపటి నుంచి షూటింగ్. ఈ రోజు మాచర్ల బయలుదేరి వెళ్లాలి. డబ్బిస్తానన్నాయన పత్తా లేడు. చివరకు హ్యాండిచ్చాడతను. విజయచందర్‌కి పిచ్చి కోపం వచ్చింది. ఎదురుగా ఉన్న క్రీస్తు క్యాలండర్‌ను చూసి ఒక్క తిట్టు తిట్టాడు. మళ్లీ కాసేపటికి క్షమించమని ప్రార్థించాడు.

చేతిలో కేవలం రెండు వేల రూపాయలు. మద్రాసు నుంచి మాచర్ల వెళ్లేసరికి 300 రూపాయలు హాం ఫట్. 1700 రూపాయలతో షూటింగ్ ఎలా చేయాలి? అక్కడో చర్చి ఫాదర్ కనబడితే బతిమాలుకుని ఆయన దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తానే హీరో, నిర్మాత అయ్యుండి కూడా హోటల్‌లో ఉండలేని దుఃస్థితి. అక్కడే సెయింట్ మేరీస్ స్కూల్లో ఓ రూమ్‌లో బస. ఆ స్కూలు ప్రిన్సిపాల్ మదర్ ఇగ్నేషియస్ దగ్గర కూడా అప్పు తీసుకున్నాడు. అలాగే తెలిసిన చర్చి ఫాదర్‌లనూ వదిలిపెట్టలేదు.  షూటింగ్ చూడడానికి చుట్టు పక్కల ఊళ్ల నుంచి ఒకటే జనం. ఎలాగూ జూనియర్ ఆర్టిస్టులు కావాలి కాబట్టి, వాళ్లకే కాస్ట్యూమ్స్ తొడిగారు. వాళ్లందరికీ భోజనాలు ఏర్పాటు చేసేసరికి తలప్రాణం తోకకొచ్చేది.

కొన్నాళ్ళకు డబ్బుల్లేక మళ్లీ షూటింగ్ ఆగిపోయింది. విజయచందర్‌లో పిచ్చి కసి... కోపం. ఏసుక్రీస్తు ఫొటో ముందు నిల్చుని ‘‘నీ సినిమా తీస్తున్నందుకా ఇన్ని కష్టాలు నాకు? ఎన్నాళ్లిలా? సినిమా ఆగిపోవాల్సిందేనా? నువ్వే దారి చూపించాలి’’ అని ప్రార్థించాడు. ఆ రోజు ఆంధ్రా క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ చాలామంది పేకాట ఆడుతున్నారు. విజయచందర్ పేకాట ప్రియుడు. జేబులో చూస్తే రెండు వేలున్నాయి. అక్కడే కూర్చున్నాడు. నెల రోజుల తర్వాత లేచాడు. ఇప్పుడతని దగ్గర పది లక్షలున్నాయి. విజయగర్వంతో బయటకు వచ్చాడు. మళ్లీ షూటింగ్ మొదలు... ఇక ఆగలేదు. ఆగదని కూడా విజయచందర్‌కి తెలుసు. ఆగితే ఏం చేయాలో కూడా తెలిసిపోయింది.

ఇంకో దెబ్బ పడింది. ఇది పెద్ద దెబ్బ. దర్శకుడు భీమ్‌సింగ్‌కు పక్షవాతం వచ్చింది. కానీ భీమ్‌సింగ్ మొండివాడు. వీల్ చైర్‌లో కూర్చొనే డెరైక్షన్ చేస్తున్నాడు. కానీ ఎన్నాళ్లిలా? రోజురోజుకీ వ్యాధి ముదిరిపోసాగింది. ఇక ఆయన వల్ల కాలేదు. విజయచందర్‌నూ, తన అసిస్టెంట్‌లైన ఆర్.తిరుమలై (భీమ్‌సింగ్‌కు సొంత బావమరిది), మహాలింగంలను పిలిచి ‘‘ఇక మీరే చూసుకోండి’’ అని చెప్పి, ఎక్కడెక్కడ ఏయే షాట్లు ఎలా తీయాలో వివరించి మద్రాసు వెళ్లిపోయారు. (ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన కన్ను మూశారు). అసిస్టెంట్లే దర్శకులుగా ఆఖరి షెడ్యూల్ సాగిపోయింది.

ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచీ విజయచందర్‌కు తిండీ తిప్పలు సరిగ్గా లేవు. ప్లేట్ ఇడ్లీ... నాలుగు ప్లేట్ల సాంబారు. ఈ పస్తులు, ఈ ఆలోచనలతో కళ్లు గుంటలు పడి మొహం బాగా పీక్కుపోయింది. యాదృచ్ఛికంగా ఈ నిస్సత్తువ అంతా క్లైమాక్స్ బాగా పండడా నికి ఉపకరించింది. శిలువ మోస్తూ అతనలా నిస్సత్తువగా కదులుతుంటే ఆ ఊళ్లో జనం ఏడుపే ఏడుపు. నల్ల తుమ్మమొద్దుల్లా ఉండే ఇద్దరు విజయచందర్‌ను కొరడాలతో కొడుతుంటారు కదా! అది చూసి తట్టుకోలేకపోయారు వాళ్లు. ఆ ఇద్దరినీ ఊళ్లోంచి పొమ్మనమని ఒకటే గొడవ. ఈ కొట్టడమంతా ఉత్తుత్తినే అని చెబితే కానీ వినలేదు వాళ్లు. ఇక ఏసుక్రీస్తుకు శిలువ వేసే సన్నివేశంలో అయితే, అక్కడ నిజంగా కన్నీటి వరదే. జూనియర్ ఆర్టిస్టులకు గ్లిజరిన్ వాడాల్సిన అవసరమే లేకపోయింది. ఎట్టకేలకు సినిమా పూర్తయింది.
 అంతా కలిపి 115 రోజులు షూటింగ్ చేశారు. ఖర్చు తడిసి మోపెడయ్యింది. 29 లక్షలు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలకే ఖర్చు 20-30 లక్షలు మించేదికాదు.

‘కరుణామయుడు’ ఫస్ట్ కాపీ వచ్చింది. కొనే నాథుడే లేడు. సరికదా... అంతా బోడి సలహాలు. లక్ష్మీ ప్రొడక్షన్స్ పంపిణీ సంస్థ అధినేత రాఘవేంద్రరావు ప్రివ్యూ చూశారు. ‘‘క్రైస్తవులు సినిమాలు చూడరు కదా! మరి ఇంకెవరి కోసం ఈ సినిమా తీసినట్లు! రెండ్రోజులు కూడా ఆడదేమో?’’ అని సందేహం వెలిబుచ్చారాయన. ‘‘లేదండీ... ఈ సినిమా 200 రోజులు ఆడుతుంది’’ అన్నాడు విజయచందర్. ఎంచక్కా ఈ సినిమాను 16 ఎం.ఎం.లోకి మార్చి ప్రతి ఆదివారం చర్చిల ముందు ప్రదర్శించాలని ఉచిత సలహా పడేశారు. తారకరామా ఫిలిమ్స్ పంపిణీ సంస్థ అధినేత అనుమోలు జగన్మోహనరావు ప్రివ్యూ చూస్తానన్నారు. అప్పటికిది 41వ ప్రివ్యూ. అయినా విజయచందర్‌లో ఆశ పోలేదు. ప్రివ్యూ చూసి ఒకటే మాట అన్నాడాయన. ‘‘ఆంధ్రా ఏరియా నేనే పంపిణీ చేస్తాను... రెండు లక్షలు ఇస్తాను.’’

 ‘‘మహాప్రసాదం’’ అన్నాడు విజయచందర్. ఈ వార్త దావానలంలా బిజినెస్ సర్కిల్‌లో పాకిపోయింది. ‘తారకరామా జగన్మోహన్’ పంపిణీ చేస్తున్నాడంటే ఆ సినిమాలో ఏదో ఉందని అందరూ ఎగబడ్డారు. కట్ చేస్తే - రెండే రెండు రోజుల్లో బిజినెస్ క్లోజ్. అటు మలయాళ వెర్షన్ కూడా రెడీ. రెండు వెర్షన్లూ ఒకే రోజు రిలీజ్. కానీ అప్పు ఇచ్చిన కొందరు ఫ్రెండ్స్ హైకోర్టులో కేసు వేశారు. సినిమా రిలీజ్ ఆగిపోతుందా? మళ్లీ టెన్షన్. కేసు డిస్మిస్ అయ్యింది. టెన్షన్ క్లియర్.

1978 డిసెంబర్ 21... ‘కరుణామయుడు’ రిలీజ్. ఎవ్వరికీ ఎలాంటి అంచనాల్లేవ్. హంగామా అస్సల్లేదు. చాలామందికి సినిమా విడుదలైందన్న సంగతే తెలియదు. మొదట్రోజు... ఓ 60, 70 మంది చూసి ఉంటారేమో! రెండో రోజు... మూడోరోజు... క్రిస్‌మస్ కూడా వెళ్లిపోయింది. ఇక డబ్బాలు తిరుగుటపా కట్టేయడానికి మూటాముల్లె సర్దుకుంటున్నాయి.26వ తేదీ... ఎవరూ ఊహించని ట్విస్ట్. అన్ని చోట్లా హౌస్‌ఫుల్. ఇక అక్కడ నుంచీ మొదలైంది జనప్రవాహం. థియేటర్ల దగ్గర తిరనాళ్ల సందడి. కులం లేదు... మతం లేదు... అందరికీ సినిమా నచ్చేసింది. కర్చీఫ్‌లు కన్నీళ్లతో తడిసిపోయేవి. ఊళ్ల నుంచి బళ్లు కట్టుకుని మరీ వచ్చి సినిమా చూడసాగారు. కొంత మందైతే థియేటర్ల దగ్గరే వంటలు. అప్పుడెప్పుడో ‘లవకుశ’ తర్వాత మళ్లీ అలాంటి వాతావరణం.

తెలుగువారికి శ్రీరాముడు.... శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరే. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే... దేవదాసు అంటే ఏయన్నారే.
 ఏసుక్రీస్తు అంటే విజయచందరే... సినిమాకు కులం లేదు... మతం లేదు. ఉంటే కనుక - సద్బ్రాహ్మణుడైన విజయచందర్ ఏసుక్రీస్తు మీద సినిమా తీయడు. తీస్తే గీస్తే ప్రేక్షకులంతా మతం గితం మరిచిపోయి ఈ సినిమాను గుండెలకు హత్తుకోరు. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరుంటుంది. ఈ పాత్ర కోసమే విజయచందర్ పుట్టారేమో! ఏసుక్రీస్తు వెనుకుండి నడిపించి విజయచందర్‌తోనే ఈ సినిమా తీయించారేమో!. ‘మనిషి కొరకు దైవమే... కరిగి వెలిగె కాంతిపథం’ అన్నట్టుగా ఈ సినిమా కొరకు దైవమే విజయచందర్‌ని ఈ వి‘చిత్ర’పథంలో నడిపించాడేమో! ఏది ఏమైనా విజయచందర్ జన్మ ధన్యం...
 
అప్పటికి ఏసుక్రీస్తు సినిమాలు తెలుగు తెరకు కొత్త. అంతకుముందు ‘మేరీమాత’, ‘ముళ్ల కిరీటం’ లాంటి సినిమాలొచ్చినా అవన్నీ అనువాదాలే. ‘కరుణామయుడు’ తెలుగులో నేరుగా వచ్చిన తొలి ఏసుక్రీస్తు చిత్రం. జనాలు దీన్ని క్రైస్తవ సినిమాగా చూడలేదు. ఓ హిస్టరీగా చూసి, కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘అమ్మలారా! నా కోసం ఏడవకండి... మీ కోసం... మీ పిల్లల కోసం ఏడవండి’’ అంటూ విజయచందర్ చెప్పిన డైలాగులు విన్న ప్రతిసారీ కన్నీళ్ల వరదే..! ఇక మతాలకు అతీతంగా... పాటలు మోగని... ఊరూ వాడా లేనే లేదు... ఇప్పటికి 14 భాషల్లో ఈ సినిమా అనువాదమైంది. ఇంతవరకూ దాదాపు 1600 ప్రింట్లు వేశారు. వీడియో రూపంలో అయితే లక్షలు దాటిపోయింది సంఖ్య.

Advertisement
Advertisement