జీతంలోనూ.. అలుసే! | Sakshi
Sakshi News home page

జీతంలోనూ.. అలుసే!

Published Sun, May 22 2016 11:17 PM

జీతంలోనూ..   అలుసే!

ఉద్యోగాల్లో ప్రారంభ స్థాయిలో ఈ వేతన వివక్ష తక్కువగానే ఉంటోంది. కానీ, సీనియర్ స్థాయికి వెళుతున్న కొద్దీ ఆడా, మగా జీతాల్లో తేడా దాదాపు 40 శాతం దాకాకనిపిస్తున్నట్లు నిపుణులు లెక్కిస్తున్నారు.

 

చేస్తున్న పని ఒకటే! మరి జీతం మాటేమిటి? ఆడ అయినా, మగ అయినా - చేసే పని ఒకటే అయినప్పుడు, జీతం ఒకటే ఉండాలిగా! అలా ఉంటోందా? లేదని అంటున్నాయి అధ్యయనాలు. స్త్రీపురుషులు ఇద్దరికీ సమానం జీతం చెల్లించాలని ఇటీవలే ‘సమాన వేతన దినోత్సవం’ (ఈక్వల్ పే డే) జరుపుకొన్నాం. కానీ, వాస్తవంలో మాత్రం స్త్రీ పురుషులకు చెల్లిస్తున్న వేతనాల్లో చాలా తేడా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఈ రకమైన ‘వేతన వివక్ష’ ప్రపంచం మొత్తంలో మన దేశంలోనే ఎక్కువ ఉంది! భారతదేశంలో ఆడ, మగ వేతనాల్లో తేడా (జెండర్ పే గ్యాప్) ఏకంగా 27 శాతం మేర ఉందని ‘మాన్‌స్టర్స్ సేలరీ ఇండెక్స్’ (ఎం.ఎస్.ఐ) వెల్లడించింది. మన దేశంలో మగవాళ్ళకు గంటకు రూ. 288.7 మేర వేతనం చెల్లిస్తుంటే, ఆడవాళ్ళకు మాత్రం రూ. 207.9 మాత్రమే చెల్లిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
 

గమనించాల్సిన విషయం ఏమిటంటే - ఆ యా రంగాలను బట్టి ఈ వేతన వివక్ష కూడా ఇంకా ఎక్కువే ఉంటోంది. ఉదాహరణకు, వస్తూత్పత్తి రంగంలో మగవాళ్ళకు చెల్లిస్తున్న దాని కన్నా 34.9 శాతం తక్కువ మొత్తం మహిళలకు ఇస్తున్నారు. అంటే, మిగతాచోట్లతో పోలిస్తే మహిళలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉన్న కర్మాగారాల్లో సైతం ఇంత తేడా ఉందన్న మాట! ఆడ, మగ వేతనాల్లో తేడా తక్కువ ఉన్నదల్లా - రవాణా, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లో! వాటిల్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకు 17.7 శాతం మేర తక్కువ జీతం చెల్లిస్తున్నారు.

 

మగాడికైతే 100 డాలర్లు...  మహిళకైతే 76!
అందరినీ కలుపుకొనిపోతూ అభివృద్ధి సాధించడానికి మన దేశంలో ప్రయత్నాలు మొదలైనప్పటికీ, ఒకే సంస్థలో ఒకే ఉద్యోగానికి స్త్రీ కన్నా పురుషులకే ఎక్కువ జీతం ఆఫర్ చేయడమన్నది ఇప్పటికీ తరచూ జరుగుతోందని మాన్‌స్టర్ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న వేతన వ్యత్యాసాల వివరాల్నీ, వాటితో మన దేశ వివరాల పోలికనూ మాన్‌స్టర్ సంస్థ ప్రకటించలేదు. అయితే అందుబాటులో ఉన్న ఇతర అధ్యయనాలను బట్టి చూస్తే -  జపాన్, కొరియాల్లో కూడా ఈ ఆడా, మగా జీతాల తేడా 25 శాతం పై మాటే. అంటే, అక్కడి కన్నా మన దేశంలోనే ఈ వివక్ష మరీ ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికోలలో ఈ ‘జెండర్ పే గ్యాప్’ 20 శాతం కన్నా తక్కువ. ఉన్నంతలో న్యూజిలాండ్, స్పెయిన్‌లలో ఆడవాళ్ళ పరిస్థితి కొంత మెరుగట! అక్కడ వేతనాల్లో తేడా 10 శాతం కన్నా తక్కువే. ప్రపంచ బ్యాంకు గణాంకాలను బట్టి చూస్తే - ఒక పనికి సగటున ప్రతి పురుషుడికీ 100 డాలర్లు ఇస్తుంటే, అదే పనికి మహిళకు మాత్రం దాదాపు 76 డాలర్లే చెల్లిస్తున్నారు.

 

ఎందుకీ వివక్ష?
మనదేశంలో ఈ వివక్షకు ఈ వివక్షకు కారణాలేమిటన్నది కూడా మాన్‌స్టర్ అధ్యయనంలో కొంత పరిశీలించారు. ఉద్యోగాల్లో, సూపర్‌వైజర్ స్థాయి ప్రమోషన్లలో ఆడవాళ్ళ కన్నా మగాళ్ళ వైపే ఎక్కువ మొగ్గు చూపడమన్నది ఇప్పటికీ జరుగుతోందని తేల్చారు. అది కూడా ఈ వేతనాల తేడాకు కారణం కావచ్చని పేర్కొన్నారు. బిడ్డలకు జన్మనివ్వడం మొదలు అనేక ఇతర సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల స్త్రీలు తమ ఉద్యోగాల్లో తరచూ విరామం తీసుకోవడం కూడా ఈ తేడాకు కారణమవుతోందట!

 
ఉద్యోగాల్లో ప్రారంభ స్థాయిలో ఈ వేతన వివక్ష తక్కువగానే ఉంటోంది. కానీ, సీనియర్ స్థాయికి వెళుతున్న కొద్దీ ఆడా, మగా జీతాల్లో తేడా దాదాపు 40 శాతం దాకా కనిపిస్తున్నట్లు నిపుణులు లెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, భారతీయ టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఒక అధ్యయనం మరో సంగతి వెల్లడించింది. దాదాపుగా 12 ఏళ్ళ పాటు స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగం చేశారనుకుంటే, మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకు దాదాపు రూ. 3.8 లక్షల మేర తక్కువ జీతమే దక్కుతోందని ఆ అధ్యయనం పేర్కొంది.

 
కేవలం ‘సమాన వేతన దినోత్సవా’లు జరుపుకోవడంతో తృప్తి పడకుండా, వేతనాల్లో ఉన్న తేడాను వీలైనంత తగ్గించడానికి కృషి చేయాల్సి ఉందని నిపుణులు అంగీకరిస్తున్నారు. అందు కోసం భారతీయ ఉద్యోగ విపణిలో కీలక భాగస్వాములైన మహిళలకు - పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అభ్యుదయ దృక్పథంతో పనిచేస్తున్న కొన్ని సంస్థలు మాత్రం తమ దగ్గర ఇలాంటి వేతన వివక్షలు ఏవైనా ఉంటే వాటిని తొలగించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ‘జెండర్ పే ఆడిట్’లను కూడా నిర్వహిస్తున్నాయి. కూలీనాలీ చేసుకుంటున్న వారి దగ్గర నుంచి కమ్యూనికేషన్ రంగం దాకా అన్నిచోట్లా ఉన్న ఈ స్త్రీ పురుష వివక్షకు చరమగీతం పాడేందుకు ఇంతకు మించి సరైన తరుణం వేరొకటి ఉందంటారా?

Advertisement
Advertisement