ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది! | Sakshi
Sakshi News home page

ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది!

Published Mon, Feb 16 2015 12:13 AM

ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది! - Sakshi

అది మంచయినా చెడయినా!!
ఆయన మనకు నటుడిగా సుపరిచితులు. కామెర్ల వ్యాధికి మందిచ్చే వైద్యుడని కొందరికే తెలుసు. మంత్రిగా ఎందరికో తెలుసు. దేశరక్షణ, దౌత్యవ్యవహారాలను నిర్వహించిన తీరు కొందరికే తెలుసు. ఆ రెబెల్‌స్టార్ కృష్ణంరాజు దైనందిన ప్రణాళిక అప్పట్లో ఎలా ఉండేది? ఇప్పట్లో ఎలా ఉంటోంది? ఆయన మాటల్లోనే...

అవిశ్రాంతం
అరవై తర్వాత

 

- వాకా మంజులారెడ్డి
నా జీవితం ఎప్పుడూ నా చేతిలోనే ఉంది. అయితే నా ఇరవై నాలుగ్గంటల సమయానికి ప్రణాళిక వేసుకోవడం మాత్రం నా చేతిలో ఉండదు. అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటుంది. అలా మార్చుకుంటూ వచ్చాను. సినీ పరిశ్రమలో పనివేళలు ఓ రకంగా ఉంటాయి. రాజకీయరంగంలో పని వేళలు మరో రకంగా ఉంటాయి.
 
మంత్రిగా ఉన్నప్పుడు ఐదింటికి నిద్ర లేచి ఆరు గంటలకంతా తయారయ్యే వాడిని. అప్పటి నుంచి నా కోసం వచ్చిన వారిని కలిసే వాడిని. వారడిగిన సమస్యలను పరిష్కరించడం మనచేతిలో ఉందా లేదా అని సెక్రటరీ ద్వారా సంబంధిత అధికారులను కనుక్కుంటూ వచ్చిన వారిని సమాధాన పరిచేవాడిని. అలా ఒకటిన్నర వరకు సాగేది. భోజనం తర్వాత కొంత విశ్రాంతి, మళ్లీ మధ్యాహ్నం మూడింటి నుంచి నన్ను కలవడానికి వచ్చే వారికి అందుబాటులో ఉండేవాడిని.
 
నటుడిగా సినీరంగంలో ఇందుకు భిన్నంగా గడిపేవాడిని. ఒక సినిమాకు పనిచేస్తున్నప్పుడు షూటింగ్ మొదలు కాకముందే అందులో నా పాత్ర స్వభావాన్ని క్షుణ్ణంగా ఒంటబట్టించు కునేవాడిని. నవల ఆధారంగా తీస్తున్న సినిమా అయితే ముందు ఆ నవలను చదివేవాడిని. రాత్రంతా ‘ఎలా నటిస్తే ఆ పాత్రను పండించగలను’ అని ఆలోచిస్తూ ఉండగానే కోడి కూసేది. అప్పుడు లేచి స్నానం చేసి పడుకుని హాయిగా నిద్ర పోయేవాడిని. పాత్ర గురించి ఒక స్పష్టత వచ్చేవరకు నిద్రావస్థలో ఉండే వాడిని తప్ప అది నిద్ర కాదు.
 
డిస్టర్బ్ కాలేదు!
ఇక పాత్ర కోసం మేకప్ వేసుకున్న తర్వాత ‘నేను కృష్ణంరాజుని కాదు’ ఆ పాత్రనే. నా కళ్ల ముందు భార్య, పిల్లలు తిరుగుతున్నా కూడా నేను నా ప్రపంచంలోనే ఉంటాను. అంతటి ఏకాగ్రత ఉండడంతో నేను ఎంత మంది మధ్య ఉన్నా, నా చుట్టూ ఎంత మంది గోల చేస్తున్నా డిస్టర్బ్ అవ్వను. నా జీవితంలో ఎప్పుడూ ‘నన్ను డిస్టర్బ్ చేయకండి’ అనే మాట అనలేదు. ఇన్నేళ్లలో నేను ఎన్ని గంటలు పని చేసినా ఆయాసం, అలుపు, చేయలేనేమోననే ఆందోళన కలగలేదు. అందుకు మెడిటేషనే కారణం.
 
ధ్యానంతో స్వీయ విశ్లేషణ!
రోజూ రెండు గంటల సేపు ధ్యానం చేస్తాను. ధ్యానం వల్ల మనిషిలో స్వీయ విశ్లేషణ శక్తి వస్తుంది. దేహానికి స్వీయ స్వస్థత శక్తి కలుగుతుంది. ఎక్కడైనా గాయం అయితే, దాని మీదనే మనసు లగ్నం చేసి ధ్యానంలో మునిగిపోతే ఆ గాయం, నొప్పి మాయమవుతాయి. గ్రంథాల్లో ఉన్న ఈ విషయాన్ని నా మీద నేను ప్రయోగం చేసుకుని మరీ నిర్ధారించున్నాను. ధ్యానం వల్ల నాకు ఎప్పుడూ నెగెటివ్ థాట్స్ రావు. ఆలోచనలెప్పుడూ సానుకూలంగానే సాగుతాయి. మన ఆలోచనలు చెడుగా సాగుతుంటే అలాగే జరుగుతుంది. మంచివైపు సాగితే అదే జరుగుతుందన్నది నేను బలంగా నమ్ముతాను.

రష్యన్ నటుడు కాన్‌స్టాంటిన్ స్టానిస్లావ్‌స్కీ ‘మై లైఫ్ ఇన్ ఆర్ట్’ లో స్టానిస్లావ్‌స్కీ ఒక గొప్ప వాక్యం రాశారు. సక్సెస్ బాటలో మంచి ఊపులో ఉన్నప్పుడు మనిషికి ఆత్మవిశ్వాసం పెరిగి అది అహంకారానికి దారి తీస్తుంది. అప్పుడు ‘నేనేం చేసినా, ఏ పాత్రను ఎలా నటించినా ఆడుతుంది’ అనే ధోరణి తలకెక్కించుకుంటే ఘోరంగా విఫలమవుతారని రాశారాయన. అది నాపై ఎంతో ప్రభావం చూపింది.
 
భయం అంటే ఏమిటో..?
నాకు భయం అంటే ఎలా ఉంటుందో తెలియదు. భయపడడం అనే స్థితి నా జీవితంలో రాలేదు. నా మొదటి సినిమా ‘చిలకాగోరింక’లో నా నటన బాగుందనుకున్నా.  చిత్రం ఆశించినట్లు ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన రెండు అవకాశాలను తిరస్కరిస్తూ ‘నేను నటన నేర్చుకున్న తర్వాత మీకు సినిమాలు చేస్తాను’ అని చెప్పాను. నిజానికి ఆ దశలో ఆ మాట అనగలగడానికి చాలా ధైర్యం ఉండాలి. భవిష్యత్తు గురించి ఏ మాత్రం భయపడినా నా నోటి నుంచి ఆ మాట వచ్చేది కాదు.
 
పుస్తకాలను విపరీతంగా చదవడం, నేను చేయాల్సిన పని గురించి లోతుగా అధ్యయనం చేయడం వల్లనే నేను ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవడం, కష్టసాధ్యమైన పనులు చేయడం సాధ్యమైందన్నది నా నమ్మకమే కాదు, అనుభవం కూడా! ఎందుకంటే నేను విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేసినప్పుడు ఏది చేస్తే పదిమందికీ మంచి జరుగుతుందని నమ్మానో, వాటిని ధైర్యంగా, ఎటువంటి సంకోచం లేకుండా చేయగలిగాను.
 
ఇప్పుడు పార్టీ వ్యవహారాలు చూసుకోవడం, కామెర్లకు మందివ్వడం, నటించడం... ఈ మూడింటిలో సమయం గడిచిపోతోంది. ఏ మాత్రం విరామం వచ్చినా అలా ఖాళీగా ఒక సోఫాలో కూర్చుని ఇంట్లో పిల్లలు, శ్యామల వాళ్ల పనుల్లో హడావుడిగా తిరుగుతూ ఉంటే అలా తృప్తిగా చూస్తూ ఉంటాను. అదే నాకు పెద్ద రిలాక్సేషన్. (నవ్వు)

Advertisement
Advertisement