సంక్రాంతికి శ్రీరంగం | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి శ్రీరంగం

Published Wed, Jan 13 2016 12:07 AM

సంక్రాంతికి శ్రీరంగం - Sakshi

శ్రీమహావిష్ణువు శేషతల్పశాయిగా కొలువైన క్షేత్రం శ్రీరంగం. 108 వైష్ణవ క్షేత్రాలలో ఇదే మొదటిది. శ్రీరంగనాథుడు, రంగనాయకి కొలువైన ఈ క్షేత్రం తమిళ నాడులోని తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉభయ కావేరీ నదుల మధ్య ఉంది. 156 ఎకరాల విస్తీర్ణం.. ఏడు ప్రాకారాలు.. ఇరవెరైండు గోపురాలు... తొమ్మిది తీర్థాలతో అలరారే ఈ ఆలయం ప్రాచీన శిల్పకళా నైపుణ్యానికి కూడా పట్టుగొమ్మ. విఖ్యాత నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా ఆస్థాన విద్వాంసుడిగా సేవలందించింది ఈ ఆలయానికే. సంక్రాంతికి వైష్ణవ క్షేత్రాల దర్శనం సకల శుభాలకు ఆరంభం.
 
శ్రీరంగనాథుడు సాక్షాత్తు శ్రీరాముడి చేత పూజలు అందుకున్న దేవుడు. శ్రీరాముడు స్వయంగా వైష్ణవ అవతారమే అయినా శ్రీరంగనాథుడిని పూజించేవాడట. లంకపై విజయం తర్వాత విభీషణుడికి తన వాత్సల్యానికి గుర్తుగా ఈ ప్రతిమను బహూకరించాడని దానిని తీసుకొని విభీషణుడు లంకకు బయలుదేరగా శ్రీరంగంలో స్వామి విరామం తీసుకో ప్రయత్నించాడట. ఆ సమయంలో అక్కడి ప్రభువైన ధర్మవర్మ స్వామిని శాశ్వతంగా అక్కడే ఉండిపొమ్మని కోరాడట. అలాగైతే నా కటాక్షం లంకపై ఉండేలా నన్ను దక్షిణాభిముఖంగా ప్రతిష్టించమని కోరాడనీ అప్పటి నుంచి రంగనాథుడు ఆలయంలో దక్షిణాభిముఖుడై పూజలందుకుం టున్నాడని కథనం. ఈ స్వామినే కస్తూరి రంగడని, కావేటి రంగడని కూడా భక్తులు పిలుస్తారు. గుడిని ‘కోవెల’ అనడం ప్రారంభమైనది ఈ ‘కోవెల’తోనే అని చరిత్రలో మొదటి కోవెల రంగనాథ కోవెలే అని భావించేవారు ఉన్నారు.

ఏడు ప్రాకారాలు...
శ్రీరంగ ఆలయం వైశాల్యంలో చాలా పెద్దది. దీనికి ఏడు ప్రాకారాలు ఉన్నాయి. వీటిలోని మూడు ప్రాకారాలలో దుకాణాలు, నివాస గృహాలు ఉన్నాయి. నాలుగో ప్రాకారంలో వేయిస్తంభాల గుడి ఉంది. నాలుగో ప్రాకారంలోనే గరుడ మండపం, దాని ఎదురుగా ముఖమండపం ఉన్నాయి. ముఖమండపం ఎదుట ఉన్న రాతి ధ్వజస్తంభానికి సమీపంలో అభయాంజనేయ స్వామి సన్నిధి ఉంది. అనంతశయనుడిగా రంగనాథుడు శ్రీరంగం గర్భాలయంలో శ్రీమహావిష్ణువు అనంతశయనుడిగా దర్శనమిస్తాడు. గర్భాలయానికి చేరువలోనే రంగ వల్లిగా పిలుచుకునే రంగనాయకి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈమె ఉన్న ఆలయాన్ని శ్రీరంగనాయకి మందిరంగా, శ్రీరంగ నాచియర్ కోవెలగా పిలుస్తారు. శ్రీరంగం ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ నరసింహస్వామి ఆలయం, శ్రీ చక్రతాళ్వార్ ఆలయాలు కూడా ప్రశస్తి పొందాయి.
 
ఏటా నాలుగుసార్లు బ్రహ్మోత్సవాలు
ఇక్కడ ఏటా నాలుగుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సౌరమానం ప్రకారం మకర, కుంభ, మీన, మేష మాసాలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో మకరమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాధాన్యం ఉంది. బ్రహ్మోత్సవాలతో పాటు గజేంద్రమోక్ష ఉత్సవం, వసంతోత్సవం, తైల సమర్పణోత్సవం, పవిత్రోత్సవం, విజయదశమి ఉత్సవం, ఊంజల్ ఉత్సవం, కర్పూర పడియత్ సేవోత్సవం, తెప్పోత్సవం కూడా ఈ ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం నెలపొడవునా ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి రోజున వైకుంఠద్వార దర్శనం, ఉగాది వేడుకల్లో కూడా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు.
 
తిరువనైకవల్‌లో జంబుకేశ్వరాలయం...
శ్రీరంగం ఆలయానికి చుట్టుపక్కల పలు సుప్రసిద్ధ పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో కావేరీ నదికి ఉత్తర తీరాన ఉన్న జంబుకేశ్వరాలయం ప్రసిద్ధం. దీనినే తిరువానైకోయిల్ అని కూడా అంటారు. శివుని తపస్సు భంగపరచిన పార్వతీదేవి శివుని శాపానికి గురై, ఇక్కడి జంబు అరణ్యంలో తపస్సు చేసిందని, శివలింగాన్ని ప్రతిష్ఠించి కావేరీ జలాలతో అభిషేకించిందని, అందువల్లే ఈ ఆలయంలో శివలింగం కింద ఎల్లప్పుడూ నీరు ఉంటుందని చెబుతారు. పార్వతీదేవి తపస్సు చేసిన చోటే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణం. ఈ ఆలయ ఆవరణలో పంచభూత స్థలంగా పేరుపొందిన నీటికొలను ఉంది. ఇందులో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
 
శక్తి క్షేత్రం సమయపురం...
 శ్రీరంగపట్టణానికి సమీపంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం శక్తి క్షేత్రమైన సమయపురం మరియమ్మన్ ఆలయం. ఈ ఆలయం తిరుచిరాపల్లికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తులతో రద్దీగా ఉంటుంది. అమ్మవారికి బియ్యపు పిండి, నెయ్యి, పప్పు, బెల్లంతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మవిళక్కు మావు అని పిలిచే ఈ ప్రసాదం అమ్మవారికి ఇష్టమని భక్తుల నమ్మకం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే పుష్పోత్సవం ఇక్కడ మరో ప్రధానమైన పండుగ. దీనిని ‘పూరోరితల్’ అంటారు.
 - దాసరి దుర్గా ప్రసాద్
 
ఇలా చేరుకోవాలి
క్షేత్రానికి ఏ ప్రాంతం నుంచైనా సులువుగా చేరుకోవచ్చు. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచిరాపల్లిలో అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లు ఉన్నాయి. చెన్నైలోని జీటీ రైల్వేస్టేషన్ నుంచి శ్రీరంగం పట్టణానికి 330 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి రైలులో వచ్చేవారు జి.టి.స్టేషన్ నుంచి తిరుచిరాపల్లికి రైలులో చేరుకోవచ్చు. తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగానికి విరివిగా సిటీబస్సులు అందుబాటులో ఉంటాయి.
 
వసతి సదుపాయం

బస చేయడానికి అనేక హోటళ్లు , సత్రాలు అందుబాటులో ఉన్నాయి. శ్రీరంగంలో బస చేయని వారు తిరుచిరాపల్లిలో కూడా బస చేయవచ్చు.
 
ఆసియాలోనే అతిపెద్ద గోపురం
ఆలయానికి ముందున్న గోపురాన్ని మహాగోపురం అంటారు. ఈ మహాగోపుర నిర్మాణాన్ని అచ్యుత దేవరాయలు ప్రారంభించారు. అందువల్ల దీనిని అచ్యుత గోపురం అని కూడా అంటారు. అయితే మధ్యలోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. తర్వాతి కాలంలో 44వ అహోబిల మఠాధిపతి దీనిని పూర్తి చేశారు. పదమూడు అంతస్తుల ఈ గోపురం ఎత్తు 236 అడుగులు, వెడల్పు 192 అడుగులు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం.
 

Advertisement
Advertisement