పెంపకాన్ని ఒక తపస్సులా చేశాం! | Sakshi
Sakshi News home page

పెంపకాన్ని ఒక తపస్సులా చేశాం!

Published Sun, Oct 20 2013 10:50 PM

We have taken care my kids with dedication, says Shivaji and Kalyani

ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురబ్బాయిలు...
 ఆ త్రిమూర్తులే తమ ఇంట్లో వెలిశారని పొంగిపోయారు...
 ఈ తల్లిదండ్రులు.
 ఈ తండ్రికి అపారమైన దైవభక్తి.
 ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా ఉండడం...
 ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించడమే అసలైన దైవత్వం... అని నమ్ముతారు ఈ తల్లి.
 పిల్లలందరినీ ఉన్నతవిద్యావంతుల్ని చేయాలనుకున్నారు...
 దానినో తపస్సులా చేశారీ తల్లిదండ్రులు.
 ఆ తపస్సులో పొందాల్సిన వరాలన్నీ పొందారు కూడ.
 ఆ వరాలే మూడు తెల్లకోటులు... మూడు స్టెతస్కోపులు.
 పిల్లల పెంపకంలో శివాజీ... కల్యాణిల అనుభవాలే ఈ వారం లాలిపాఠం.

  తాడికొండ శివాజి స్వగ్రామం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం పైడూరిపాడు. తండ్రి రాఘవయ్యది వ్యవసాయ కుటుంబం. ఎనిమిది మంది సంతానం. నలుగురు అక్కలు, ఒక అన్న, ఓ తమ్ముడు, ఓ చెల్లెలు. చిన్నప్పుడు గేదెలు కాస్తూ, పొలం పనులకు వెళుతూ... బడికి తరచూ ఎగనామం పెడుతూ, ఎలాగో మూడోతరగతి వరకు చదివాడు. శివాజీ మేనమామలు కులవృత్తులు చేసేవారు. శివాజీ తల్లి అన్నపూర్ణమ్మ తన కుమారుణ్ని 12 ఏళ్ల వయస్సులో (1975) గుంటూరు జిల్లా నవులూరు గ్రామంలో ఉంటున్న తన రెండో అల్లుడు అప్పారావు వద్దకు పంపించింది.అతనికి మంగళగిరి పట్టణంలో క్షౌరశాల ఉండేది. జీరోతో జీవితాన్ని ప్రారంభించిన శివాజీ కులవృత్తిలో మెళకువలు నేర్చుకున్నాడు. ఆ వివరాలు శివాజి మాటల్లోనే...
 
 ‘‘మా బావ షాపులో నాలుగేళ్లపాటు పనిచేశాక... ఆయన తనకున్న రెండు క్షౌరశాలల్లో ఒక షాపు బాధ్యతను నాకప్పగించారు. ఆ తర్వాత...1982లో మా పెద్దక్కయ్య గారి అమ్మాయి కల్యాణితో నాకు వివాహమైంది. మరో నాలుగేళ్లకి 1986లో సొంతంగా మంగళగిరిలోనే ‘శివాజి హెయిర్‌స్టయిల్’ పేరుతో షాపు పెట్టుకున్నాను.
 
 ఆ వివక్ష నా పిల్లలకు ఎదురు కాకూడదనే..!

 
 నా వృత్తిద్వారా వచ్చే డబ్బును ఇంట్లో ఒక రేకు డబ్బాలో వేసేవాడ్ని. నా భార్య కల్యాణి వాటిని 15 రోజులకో.. నెలకో ఓ మారు లెక్కించి ఇంట్లో అవసరాలకు పోనూ మిగతా డబ్బుని బ్యాంక్ అకౌంట్‌లో జమచేయమని ఇచ్చేది. నాకు చదువులేకపోవడం వల్ల బ్యాంకు లావాదేవీలకు ఇతరులపై ఆధారపడాల్సివచ్చేది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆయా వ్యక్తులు నా పట్ల గౌరవప్రదంగా వ్యవహరించేవారు, కానీ నేను క్షౌరవృత్తి చేస్తానని తెలియగానే వారి ముఖకవళికలు మారిపోయేవి. నా వృత్తిలో నేను గొప్పగా రాణిస్తున్నాను. ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా, ఎవరి మీదా ఆధారపడకుండా జీవిస్తున్నాను. కానీ సమాజపరంగా ఈ వృత్తిని విలువైనదిగా గుర్తించకపోవడం ఇబ్బందికరంగా ఉండేది. నా పిల్లలను గౌరవప్రదమైన వృత్తిలో చూసుకోవాలనే కోరిక కలగడానికి కారణం కూడా నాకు ఎదురైన వివక్షే. పిల్లల్ని ఉన్నత విద్య చదివించాలనుకున్నాను.
 
 దైవశక్తిపై నమ్మకం!
 
 నాకు, కల్యాణికి మొదటి నుంచి దైవశక్తిపై నమ్మకం ఎక్కువే. పిల్లలను దైవఫలంగా అనుకునేవాళ్లం. సత్యవిష్ణుదేవుని వరపుత్రునిగా భావించి మొదటిబాబుకు సవీష్‌వర్మ అని నామకరణం చేశాం. రెండోబాబుకు వీరాంజనేయ వరపుత్రుడిగా భావించి విజేష్‌వర్మ అనీ, మూడో బాబుకు శ్రీమహాలక్ష్మి వరప్రసాదంగా భావించి శిరీష్‌వర్మ అని పేర్లు పెట్టాం. పిల్లలకు బడి ఈడుకు వచ్చేనాటికి (1987) నవులూరులోనే ఫణీంద్ర విద్యానికేతన్ అనే ఇంగ్లిష్ మీడియం స్కూల్ పెట్టారు. అందులో టీచర్లు అందరూ మహిళలే. మగవాళ్లు అయితే సిగరెట్లు తాగడం, దురుసుగా వ్యవహరిస్తారని, అటువంటి దృశ్యాల ప్రభావం పిల్లల మీద ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకే మహిళా టీచర్లు మాత్రమే ఉండే స్కూల్లో చేర్పించాను’’ అన్నారు శివాజీ.
 
 ముగ్గురు పిల్లల్నీ ఒకేలా చూశాను!
 
 ఇంటిని ఒద్దికగా దిద్దుకోవడానికి కారణం తండ్రి నేర్పిన బాధ్యతలేనంటారు కల్యాణి. ‘‘మాది కొండపల్లి. మా నాన్న జమలాపురపు కనకరాజు, ఆయన నాస్తికుడు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా, మన పనిని ఎదుటివారి నెత్తిన రుద్దకుండా బాధ్యతగా ఉండాలని చెప్పేవారు. నేను ఇంటికి పెద్దదాన్ని. ఏడో తరగతి వరకు చదివిన తర్వాత స్కూలు మానిపించి నాకు ఇంటి పనులు అలవాటు చేశారు. దాంతో పెళ్లయిన తర్వాత ఇంటిని దిద్దుకోవడం పెద్ద కష్టం కాలేదు. మా పిల్లలు స్కూల్‌కు వెళ్లే వయస్సు వచ్చేసరికి నాకు పుట్టింటికి వెళ్లడం కూడా కుదిరేది కాదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు పిల్లలను స్కూల్‌కు పంపి నేను కొండపల్లి వెళ్లేదాన్ని.

 

మళ్లీ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేసేదాన్ని. పెంపకంలో నేను పాటించిన పెద్దపెద్ద నియమాలేవీ లేవు కానీ, ఒక విషయాన్ని మాత్రం నా పిల్లల దగ్గర జరక్కుండా జాగ్రత్తపడ్డాను. కొన్ని కుటుంబాల్లో ఒక బిడ్డపై ఎక్కువ ప్రేమ చూపడం, ఒక బిడ్డను తక్కువగా చూడడం గమనించాను. అలా నిరాదరణకు గురవుతున్న పిల్లలను చూస్తే చాలా బాధనిపించేది. నాకు మాత్రం ముగ్గురు పిల్లలపై సమభావం ఉండేది. ముగ్గురిలో మూడోవాడు చదువులో వెనకబడి ఉండేవాడు. అయితే, ఆటల్లో ప్రైైజులు తెచ్చేవాడు. ముగ్గురూ సమంగా ఉండాలని, అన్నయ్యల్లా నువ్వు కూడా బాగా చదవాలని చెప్పేదాన్ని. నేను చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించేవాడు కాదు, కానీ రాను రాను చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు’’ అన్నారు కల్యాణి.
 
 ఎందులో సీటు తెచ్చుకుంటే అదే చదివించాలనుకున్నా!

 
 పెదబాబును డాక్టర్ చేయాలనే తలంపుతో విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్ బైపీసీలో చేర్పించాం. ఎంసెట్ రాస్తే... ఆయుర్వేదం కోర్సులో సీటొచ్చింది. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో చదివాడు. ఇక్కడో విషయం చెప్పాలి. పెదబాబుకు ఇంటర్ రెండేళ్ల చదువుకుగాను 65 వేల రూపాయలైంది. చాలామంది తెలిసినవాళ్లు ‘మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎకరం ధర ముప్పైవేలు ఉంది. అంత ఖర్చు పెట్టి ఇంటర్ చదివించాలా? పొలం కొనుక్కోవచ్చు కదా’ అనేవారు. ఆ మాటలేవీ పట్టించుకోలేదు. పెదబాబుకు డాక్టర్ సీటు రావడంతో మిగతా ఇద్దరికీ అదే చదువు చెప్పించాలనుకున్నా. ఇద్దరికీ లక్షా 40 వేలయింది. రెండోబాబుకు ఎంసెట్‌లో 176వ ర్యాంక్ వచ్చింది. మావాడికి ఓపెన్ కేటగిరిలో గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఎలాట్ అయిందని తెలియగానే ఎంతో గర్వంగా ఫీలయ్యా. ఇక మూడోబాబుకు గుడివాడలో బీహెచ్‌ఎంఎస్ సీటు వచ్చింది’’ అని గుర్తుచేసుకున్నారు శివాజీ.


 ముగ్గురు పిల్లల్ని ఆయుర్వేదం, అల్లోపతి, హోమియా వైద్య కోర్సుల్లో ఎందుకు చేర్పించారని అడగ్గా... ‘‘ఎంసెట్ మొదటి ప్రయత్నంలో ఏ సీటు వస్తే అదే చదివించాలనుకున్నాం. అలాగే వచ్చిన సీట్లలో జాయిన్ చేశాం.
 
 మా పిల్లలకు కట్నం తీసుకోదల్చుకోలేదు...

 
 ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు కదా అని ప్రస్తావించగా.. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంగా మూడు వేల రూపాయలు ఇచ్చారు. కట్నం తీసుకున్నందుకు ఇప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా. అందుకే మా పిల్లలకు నేను కట్నం తీసుకోదల్చుకోలేదు. మా అబ్బాయిలకు భారీ కట్నకానుకలు ఇస్తామని సంబంధాలు వచ్చాయి. కానీ కట్నం తీసుకోకూడదనే నా అభిప్రాయంతో ఇంట్లో అందరూ ఏకీభవించారు. పెదబాబు సవీష్‌వర్మ ఎండీ (రసశాస్త్ర) చేసి తన జూనియర్ దీప్తిని గత ఏడాది డిసెంబర్ 9న వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ బీఏఎంఎస్‌లో స్టేట్ గోల్డ్‌మెడలిస్టులు. రెండోబాబు విజేష్‌వర్మకు మా బంధువుల అమ్మాయి రాణిశిరీషతో ఈ ఏడాది మే 30న వివాహమైంది. బీడీఎస్ చేసిన రాణిశిరీష గుంటూరు సిబార్ దంతవైద్యకళాశాలలో ఎండీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడోబాబు శిరీష్‌వర్మ బీహెచ్‌ఎంఎస్, ప్రాక్టీస్ యోచనలో ఉన్నాడు’’ అన్నారు శివాజీ.
 
 నా కూతురైతే అన్ని పనులు చేయిస్తానా!
 
 పెద్దకోడలు విజయవాడలో భర్తతోపాటే ప్రాక్టీసు చేస్తున్నారు. మరి రెండోకోడలు మీ ఇంటి వద్ద నుంచే ఎండీఎస్ చదివేందుకు గుంటూరు వెళుతున్నారు కదా. ఇప్పటికీ మీకు ఇంటి పనిలో విశ్రాంతి వచ్చినట్టు లేదు అన్నప్పుడు కల్యాణి చాలా ఉన్నతంగా స్పందించారు. ‘‘శిరీష ఎండీఎస్ చదవాలని పీజీ ఎంట్రన్స్ రాసింది. ఇంతలో పెళ్లి చేశాం. గుంటూరులోని సిబార్ దంత వైద్యకళాశాలలో ఎండీఎస్ సీటు వచ్చింది. ఆ అమ్మాయిది పని చేసే మనస్తత్వమే కానీ నాకే మనసు ఒప్పుకోలేదు. పొద్దున్న కాలేజికెళ్లి సాయంత్రానికి వస్తుంది. అలసట, ప్రయాణ బడలిక ఉంటాయి. ఆ పరిస్థితిలో నా కూతురు ఉంటే ఇంటి పనులు చెప్పను కదా. అదే ఉద్దేశంతో నేను శిరీషకు ఇంటి పనులు చెప్పడం లేదు.
 
 డాక్టర్ల అమ్మ!
 
 మా ముగ్గురు పిల్లలూ డాక్టర్లు అయినా నాకు ప్రత్యేకంగా ఎలాంటి ఫీలింగ్ ఉండేది కాదు. అయితే, ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు బంధువులు, తెలిసినవాళ్లు.. ‘ముగ్గురు డాక్టర్ల అమ్మ’ అని మెచ్చుకోలుగా అంటుంటారు. ఆ సందర్భాల్లో మాత్రం నాకెంతో గర్వంగా ఉంటుంది’’ అన్నారు కల్యాణి. ఇక మూడోబాబుకు కూడా పెళ్లి చేస్తే మీ బాధ్యతలు తీరిపోతాయి. ఇంతకీ మీరు పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారన్నప్పుడు... ‘‘సమాజంలో పిల్లలు గౌరవప్రదమైన స్థానాల్లో, సుఖసంతోషాలతో జీవితం గడపాలని ఆశిస్తున్నాం’’ అన్నారు శివాజీ దంపతులు. ఈ తల్లిదండ్రుల ఆశ నెరవేరాలని ఆశిద్దాం.
 
 - అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు
 ఫొటోలు: పల్లి ప్రకాష్‌బాబు, సీహెచ్ సుధాకర్

 
 అడిగి మరీ ష్యూరిటీ ఇచ్చారు!


 రెండోబాబుకు ఎండీ పీడియాట్రిక్స్‌లో సీటు వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలకు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్లు ఇద్దరు బాండ్ ఇవ్వాలన్నారు. ‘నా కొడుక్కి ష్యూరిటీ ఉండండి’ అని ఎవర్ని అడగాలో తెలియక మధన పడ్డాను. నా రెగ్యులర్ కష్టమర్ అయిన వేమూరి నాగేశ్వరరావుగారికి ఈ విషయం తెలిసి ‘నేను గెజిటెడ్ ఆఫీసర్ని, సంతకం పెడతాను’ అన్నారు. ఆ దేవుడే వచ్చాడని సంతోషించాను. మా మరో కష్టమర్ డాక్టర్ రాంబాబుగారు రెండో సంతకం పెట్టారు.    

- శివాజీ
 

Advertisement
Advertisement