అడగండి చెబుతాం... | Sakshi
Sakshi News home page

అడగండి చెబుతాం...

Published Fri, Apr 25 2014 11:18 PM

అడగండి చెబుతాం...

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సూపర్ సిరీస్, గ్రాండ్ ప్రి గోల్డ్, గ్రాండ్ ప్రి తదితర పేర్లతో టోర్నీలు జరుగుతుంటాయి. వీటిని ఎలా వర్గీకరించారు. ప్రధాన తేడా ఏమిటి?
ప్రశ్న అడిగిన వారు: జి. వినయ్ కుమార్, ఒంగోలు
 
బ్యాడ్మింటన్‌లో నిర్వహించే ఈ టోర్నీల మధ్య ప్రధాన తేడా ప్రైజ్‌మనీ, ర్యాంకింగ్ పాయింట్ల ఆధారంగా ఉంటుంది. ఇందులో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయి ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఉంటుంది. వీటిలో  విజేతగా నిలిస్తే 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయి. ఈ రెండు ఈవెంట్లలోనూ ప్రైజ్‌మనీ ఉండదు.
 
పై రెండింటిని మినహాయిస్తే...సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీకి అగ్రస్థానం దక్కుతుంది. ఇవి ఏడాదిలో 5 జరుగుతాయి. ప్రస్తుతం ఇండోనేసియా, ఆల్‌ఇంగ్లండ్, డెన్మార్క్, మలేసియా, చైనాలను సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలుగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్‌తో వీటిని పోల్చవచ్చు. ఇందులో 9,400 ర్యాంకింగ్ పాయింట్లు దక్కే అవకాశం ఉంటుంది. ప్రైజ్‌మనీ 3 లక్షల 50 వేల డాలర్లు ఆపైన ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం వీటిలో టాప్-10 ఆటగాళ్లంతా తప్పనిసరిగా పాల్గొనాలి. ప్రీమియర్ కాకుండా మరో 7 సూపర్ సిరీస్ టోర్నీలది తర్వాతి స్థానం.

ఇండియా ఓపెన్ ఇందులోనే ఉంది. వీటిలో గెలిస్తే  8,500 ర్యాంకింగ్ పాయింట్లు దక్కుతాయి. ప్రైజ్‌మనీ 2 లక్షల 50 వేలకు పైగా ఉంటుంది. పైన చెప్పిన 12 టోర్నీల్లో ప్రదర్శనను బట్టి టాప్-8లో నిలిచిన ఆటగాళ్లు  ఏడాది చివర్లో సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తలపడతారు.
 
ఆ తర్వాత ప్రాధాన్యతా క్రమంలో వరుసగా గ్రాండ్ ప్రి గోల్డ్ (1 లక్షా 50 వేల డాలర్ల వరకు ప్రైజ్‌మనీ), గ్రాండ్ ప్రి (50 వేల నుంచి 1 లక్ష డాలర్ల వరకు) ఉంటాయి. వీటి స్థాయిని బట్టి పాయింట్లలో తేడా ఉంటుంది.  ఇక వర్ధమాన ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికలపై తమ సత్తాను నిరూపించుకునేందుకు వరుసగా ఇంటర్నేషనల్ చాలెంజర్, ఇంటర్నేషనల్ సిరీస్, ఫ్యూచర్ సిరీస్ టోర్నీలు జరుగుతాయి.
 

Advertisement
Advertisement