నోటి వాపు ఉందంటే ఎమ్మారై చేయించాలి.. | Sakshi
Sakshi News home page

నోటి వాపు ఉందంటే ఎమ్మారై చేయించాలి..

Published Tue, Jan 26 2016 11:04 PM

welling of the mouth should be sought if there is a big ..

హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 67. కొంతకాలంగా మూత్రం సరిగ్గా రావడం లేదు. కొంచెం కొంచెంగా  పడుతోంది. రాత్రివేళల్లో తరచు మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. నా సమస్య ఆపరేషన్ అవసరం లేకుండా హోమియో ద్వారా నయమవుతుందా?
 - పి.ఎస్.ఆర్.శర్మ, హైదరాబాద్

 మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు బినైన్ ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా వయసు పైబడిన వాళ్లలో ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. కొందరిలో 45 ఏళ్ల నుంచే ప్రోస్టేట్ గ్రంథి పెరగడం ప్రారంభం కావచ్చు. దీనికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. కాకపోతే ఇలా జరగడం మాత్రం సాధారణమే. ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల యూరిన్ పూర్తిగా బయటకు రాకుండా మూత్రాశయంలోనే నిల్వ ఉండటం, రాత్రి మళ్లీ మళ్లీ సడన్‌గా మూత్రానికి వెళ్లాల్సిరావడం, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట, మూత్రవిసర్జన కోసం  ముక్కుతూ ఒత్తిడి కలిగించాల్సి రావడం, మూత్రం చుక్కలు చుక్కలుగా పడటం, విసర్జన సమయంలో మంట, మూత్రం చుక్కలతో పాటు ఒక్కోసారి రక్తం కూడా రావడం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ వచ్చిన గ్రంథి క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ పరిస్థితి కాస్త అరుదు. మీకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోడానికి ‘ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్’ (పీఎస్‌ఏ) పరీక్ష చేయించుకోవాలి. అలాగే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా లేక కేవలం ఎన్‌లార్జిమెంటేనా అని తెలుసుకోడానికి కొన్ని మూత్రపరీక్షలు, యూరోఫ్లోమెట్రీ వంటి పరీక్షలు అవసరం.
 స్టార్ హోమియోపతి చికిత్స: ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ కోసం హోమియోలో ఆర్నికా, లైకోపోడియం, అర్జెంటమ్ నైట్రికమ్, బెరైటా కార్బ్, కిమేఫిల్లా, హైడ్రాంజియా, ఆయోడమ్, సబల్ సెరులేటా, సల్ఫర్, తూజా వంటి చాలా మంచి మందులున్నాయి.  వ్యాధి లక్షణాలను బట్టి ఈ మందులను అక్యూట్ దశలో ఇవ్వవచ్చు. అదేవిధంగా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బెల్లడోనా, కాంథారిస్, నైట్రిక్ యాసిడ్, పల్సటిల్లా, సైలీషియా, స్టెఫిసాగ్రియా, తూజా వంటి మందులు వాడవచ్చు. మీరు మొదట పీఎస్‌ఏ పరీక్ష చేయించుకుని, ఈ సమస్యకు చికిత్స చేయగల నిపుణులైన హోమియో వైద్యుడిని సంప్రదించండి. చాలా సందర్భాల్లో ఆపరేషన్ అవసరం లేకుండానే కేవలం హోమియో మందుల ద్వారానే నయం చేయడానికి ఆస్కారం ఉంది.
డాక్టర్ మురళి అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
 
క్యాన్సర్ కౌన్సెలింగ్
 
నా వయసు 45 ఏళ్లు. గుట్కా తింటుంటాను. ఆర్నెల్లుగా నా నోటిలో వాపు, నొప్పి వస్తున్నాయి. ఒక నెలరోజులుగా ఈ బాధ మరీ ఎక్కువగా ఉంది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా చెప్పండి.
 - జి.ఆర్.ఆర్., హైదరాబాద్

 గుట్కాలు/పొగాకు నమిలేవారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత అంతగా పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి.  అంటే చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలోని ఏ భాగంలో మీకు క్యాన్సర్ వచ్చిందో రాయలేదు. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే అది క్యాన్సర్ కాస్త ముదిరిన దశను సూచిస్తోంది. మొదట మీకు సమస్య ఉన్నచోట, మెడ భాగంలోనూ సీటీ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరుతెరవడం కష్టమవుతుంది. దాంతో క్యాన్సర్ కూడా కొంచెం ముదిరినట్లు అర్థం. వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించడం మొదట చేయాలి. ఆ తర్వాత తొలగించిన భాగాన్ని ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ-కన్‌స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయాలు మానాక, రేడియోథెరపీ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. మీరు మొదట గుట్కా నమలడం మానేయండి. అది నోటితోబాటు మిగిలిన అవయవాలకు కూడా చాలా చెరుపు చేస్తుంది.  
 
డాక్టర్ కె.శ్రీకాంత్
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ,
హైదరాబాద్
 
ఫిజియో అండ్ రీహాబ్ కౌన్సెలింగ్
 
నా వయసు 45 ఏళ్లు. రోజూ 8-10 గంటలు కూర్చొనే పనిచేస్తాను. అప్పుడప్పుడూ నడుము నొప్పి వస్తుండేది. ఇప్పుడు ఆ నొప్పి క్రమంగా కాళ్లకూ పాకుతోంది. కాళ్ల తిమ్మిర్లు వస్తున్నాయి. సరిగా నిలబడలేకపోతున్నాను. పరిష్కారం చెప్పండి.
 - రామ్మోహన్, హైదరాబాద్

 నడుము నొప్పి అనేక కారణాలతో వస్తుంటుంది. కంప్యూటర్ ముందు చాలా సేపు కూర్చొని పనిచేసే చాలామందిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. కొందరిలో అపసవ్య భంగిమలో కూర్చోవడం వల్ల నడుము నొప్పి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీకి సంబంధించిన జబ్బులు, పేగులకు సంబంధిత వ్యాధులు ఉన్నా ఇలా నడుమునొప్పి రావచ్చు. మహిళల్లో గైనిక్ సమస్యలు ఉండటం కూడా నడుము నొప్పికి ఒక కారణం కావచ్చు. పోషకాహార లోపం వల్ల ముఖ్యంగా విటమిన్-డి తగ్గడం వల్ల కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చి ఈ తరహా నొప్పులు వచ్చేందుకు అవకాశం ఉందని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి. మీరు ముందుగా డాక్టర్‌కు చూపించి, అసలు ఏ సమస్య కారణంగా నడుమునొప్పి వస్తోందో తెలుసుకోవాలి. ఒకవేళ ఎముకలు లేదా నరాలకు సంబంధించిన అంశాల కారణంగా నడుము నొప్పి వస్తుంటే, దాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. నొప్పి కాళ్లవైపునకు పాకుతోందనీ, కాళ్లు తిమ్మిర్లుగా ఉంటున్నాయని చెప్పిన లక్షణాలను బట్టి, ఇది చాలావరకు నరాలకు సంబంధించిన సమస్య కావచ్చు. దీనికోసం రేడియాలజీ, ఎమ్మారై పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఇలా వచ్చే నడుము నొప్పి తగ్గడానికి కొన్ని రకాల వ్యాయామాలు ఉన్నాయి.

అయితే నిర్దిష్టంగా అది ఫలానా కారణంతో అని తేలేవరకూ ఇలాంటి వ్యాయామాలు చేయడం సరికాదు. ఎందుకంటే కారణాలను బట్టి, నొప్పి తగ్గడానికి చేయాల్సిన వ్యాయామాలు మారుతుంటాయి. తగిన వ్యాయామాలు చేయకపోయినా వ్యాధి తీవ్రత పెరగవచ్చు. తగిన వ్యాయామాలు సూచించేందుకు మీరు రీహ్యాబ్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం మంచిది. మీరు ముందుగా డాక్టర్‌ను కలిసి తగిన వైద్యపరీక్షలు చేయించుకోండి.

ఇక అప్పటివరకూ మీ కూర్చొనే భంగిమలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. మీరు కుర్చీలో వెన్నును నిటారుగా ఉంచి కూర్చునేలా మీ సీట్‌ను అడ్జెస్ట్ చేసుకోవాలి. దీనిని వర్క్ స్టేషన్ మాడిఫికేషన్ టెక్నిక్ అంటారు. ఇందులో భాగంగా ప్రతి గంటకోసారి లేచి నాలుగు అడుగులు వేయాలి. అప్పుడు మీ వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది చేశాక కూడా మీకు నడుమునొప్పి వస్తూ ఉంటే, వెంటనే డాక్టర్ కలిసి, తగిన వైద్య పరీక్షలు చేయించుకోండి.
 
డాక్టర్ మిద్దె అజయ్‌కుమార్
లెసైన్స్‌డ్ పీటీ (యూఎస్‌ఏ),
డిపార్ట్‌మెంట్ ఆఫ్
న్యూరో రీహాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement