దేవుని చిత్తానికి దగ్గర దారి ఏది? | Sakshi
Sakshi News home page

దేవుని చిత్తానికి దగ్గర దారి ఏది?

Published Sat, Apr 2 2016 11:12 PM

దేవుని చిత్తానికి దగ్గర దారి ఏది? - Sakshi

సువార్త



దేవుని సంకల్పాలు తెలుసుకోవాలనుకోవడం ఆశీర్వాదకరమే. అయితే దేవుడు తన సంకల్పాలను ఒక్కసారే పూర్తిగా బయలుపర్చాలనుకోవడం, ఎలా ఎప్పుడు బయలు పర్చాలో కూడా దేవునికి చెప్పడం దుస్సాహసం. దేవుని సాయంకోరాను కాబట్టి నేనిక ఏమీ చేయనంటూ చేతులు ముడుచుకొని కూర్చోవడం పరమ అవివేకం. జాతిరీత్యా యూదురాలైన బబులోను మహరాణి ఎస్తేరు హామాను అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రి తన పెంపుడు తండ్రి అయిన మొర్దెకైని యూదులనందరినీ ఊచకోత కోసే కుట్ర చేశాడని తెలిసి చలించిపోయింది. యూదులంతా తనతో కలిసి మూడురోజులపాటు ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని సాయం కోరాలని ప్రకటించింది. అంతేకాని ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో దేవునికి వారు చెప్పలే దు. అంతటితో ఊరుకోకుండా ప్రాణానికి ముప్పు ఉందని తెలిసే, తెగించి రాజదర్శనానికి వెళ్లి ఆయన అనుగ్రహాన్ని పొందింది. ఆమె రాజుగారికి ఏమీ చెప్పనవసరం లేకుండానే, మొర్దెకైను కుట్రదారుడైన హామానునే రాజుగారు ఉరి తీసే విధంగా దేవుడు పరిస్థితులని మార్చి వారికి గొప్ప విజయాన్నిచ్చాడు. (ఎస్తేరు 4,56,7 అధ్యాయాలు).

 
దేవుని సాయాన్ని కోరి, ఆయన సంకల్పాన్ని తెలుసుకోవాలనుకున్న వారు ముందుగా దేవుని సమయాన్ని, విధానాలను విశ్వసించాలి. ‘దేవుని చిత్తం’అనే మాట అందరికీ ఊతపదమైంది. అంతా అనుకున్నట్టే జరిగితే అది దేవుని సంకల్పం, వికటిస్తే దేవుని చిత్తానికి విరుద్ధం అని చాలామంది భావిస్తారు. ‘దేవుని సంకల్పం’ అనే స్కూలులో వాళ్లది నర్సరీ త రగతి. సమస్యలు అపవాది సృష్టిస్తాడని, ఆశీర్వాదాలకు ఆపవాది అడ్డుపడ్తాడని వాళ్ల అపోహ. వాళ్లది ఎంతసేపూ, ఆశీర్వాదాలు పొందే ఉబలాటమే తప్ప, దేవుని జ్ఞానంలో ఎదగడంలో ఆశ ఉండదు. అంతా ఒక ఏడాదిపాటు నర్సరీ చదవాల్సిందే! కాని ఇలాంటివాళ్లు జీవితమంతా నర్సరీలోనే ఉంటారు, దేవునిలో అంగుళం కూడా ఎదగరు. దేవుని సంకల్పాలు తెలుసుకోవాలనుకునేవారు ముందుగా కొన్ని మౌలికాంశాలు తెలుసుకోవాలి. 1. దేవుని కృప మనకు తోడుగా ఉండని ఏ గమ్యస్థానానికీ దేవుని చిత్తం మనల్ని తీసుకెళ్లదు. 2. దేవుడు తన సంకల్పాలను మన ఎదుగుదల, అవకాశాలను బట్టి దశలవారీగా మాత్రమే వెల్లడిస్తాడు. 3. దైనందిన జీవితంలో జ్ఞానయుక్తంగా మెలిగే శక్తి దైవచిత్తానుసారమే మనకు లభ్యమవుతుంది. 4. అనైతికత, అపరిశుద్ధత కలిగినవారు దేవుని సంకల్పాలను అర్థం చేసుకోలేరు. 5. దేవుని చిత్తం అనే ఖజానా మన వద్దే ఉంది. కాకపోతే దాని ‘తాళం చెవి’ ప్రార్థన, కృతజ్ఞత, సంతృప్తి, ఆనందం వెల్లివిరిసే మన జీవన శైలిలో ఉంటుంది. దేవుడు మన ఇంటి తలుపులకు బయటినుండి తాళం వేస్తే, అతి తెలివితేటలతో మనం కిటికీనుండి బయటపడితే, అనర్థాలు, ఆపదలు, అవరోధాలు రాకుండా ఎలా ఉంటాయి?

 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

Advertisement

తప్పక చదవండి

Advertisement