ఎవరు పేదవాడు? | Sakshi
Sakshi News home page

ఎవరు పేదవాడు?

Published Thu, Oct 9 2014 11:15 PM

ఎవరు పేదవాడు? - Sakshi

జెన్ పథం
 
 ‘‘దేవుడు నా దగ్గర నుంచి అన్నీ తీసేసుకున్నాడు. ప్రస్తుతం ఒక్క మరణం మినహా నా దగ్గర మరేదీ లేదు’’ అని ఓ యువకుడు ఒక చెట్టు కింద కూర్చుని తనలో తను అనుకుంటున్నాడు. ఆ మాటలు పక్కనే ఉన్న ఒక బిచ్చగాడి చెవిన పడ్డాయి. అతను వెంటనే యువకుడితో ‘‘నీ దగ్గర అమూల్యమైనవి ఉన్నాయి. నేను వాటిని చూస్తున్నాను. వాటిని నువ్వు అమ్ముతావా? వాటిని అమ్మడం వల్ల నువ్వు పొందలేకపోతున్నాననుకున్నవన్నీ పొందుతావు. కనుక దేవుడ్ని నిందించకు’’ అన్నాడు.
 యువకుడు ఆశ్చర్యపడ్డాడు.
 ‘‘ఏమిటీ? నా దగ్గర నాకు తెలియకుండానే అంత విలువైనవేమున్నాయబ్బా? ఒక్క పైసా కూడా లేదు ’’ అన్నాడు యువకుడు. అప్పుడు బిచ్చగాడు నవ్వి ‘‘నాతో రా. మనం రాజు దగ్గరకు వెళ్దాం. రాజు చాలా గట్టివాడు. సమర్థుడు. ఏదైనా అజ్ఞాతంగా ఉందంటే చాలు... దాన్ని ఎలాగైనా సొంతం చేసుకుంటాడు. ఆయన నీ దగ్గరున్న వాటిని తప్పక మంచి ధరకే కొనుగోలు చేస్తాడు. నేను గతంలోనూ ఇలా పలువురిని రాజు వద్దకు తీసుకుపోయాను. రాజు వారందరికీ బాగానే డబ్బులిచ్చి వాటిని కొనుక్కున్నాడు’’ అన్నాడు.
 యువకుడికి బిచ్చగాడి మాటలకు ఆశ్చర్యమేసింది.
 సరేనని బిచ్చగాడితో కలసి రాజువద్దకు బయల్దేరాడు.
 దారిలో బిచ్చగాడు ఇలా అన్నాడు -
 ‘‘మనం ముందుగా కొన్ని విషయాల్లో ఓ నిర్ణయానికి రావాలి. ఎందుకంటే రాజు సమక్షంలో మనం గొడవపడకూడదు. రాజు తాను సొంతం చేసుకోవాలనుకున్న వాటిని ఎంత ధరకైనా కొంటాడు. నువ్వు వాటిని అమ్మడానికి సిద్ధమా? కాదా? ఇప్పుడే ఒక నిర్ణయానికి రావాలి. లేకుంటే నిన్ను నేను అంత దూరం తీసుకువెళ్లడం వృథా’’ అని.
 ‘‘ఏమిటీ నా దగ్గర అంత విలువైనవున్నాయా?’’ అని యువకుడు మళ్లీ ఆలోచనలో పడ్డాడు.  
 బిచ్చగాడు అంతటితో ఆగలేదు.  
 ‘‘మాటవరసకి చెప్తున్నా. నీ కళ్లు తీసుకో. వాటినెంతకిస్తావు? నేను రాజు దగ్గర నుంచి యాభై వేల వరహాలు ఇప్పిస్తాను. ఈ డబ్బు నీకు చాలదంటావా? పోనీ నీ గుండె లేదా నీ మెదడు. వాటికైతే లక్ష వరహాల వరకు బేరం మాట్లాడి నీకు ఇప్పిస్తాను’’ అని.
 యువకుడికి ఏమీ అర్థం కాలేదు.
 బిచ్చగాడు ఓ పిచ్చివాడనే నిర్ణయానికి వచ్చాడు యువకుడు.
 ‘‘ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టిందా? కళ్లు, గుండె, మెదడు...వీటిని రాజుకే కాదు, ఎవ్వరడిగినా ఇవ్వను గాక ఇవ్వను. బుర్ర ఉన్నవాడెవడైనా వాటిని అమ్ముకుంటాడా?’’ అని యువకుడు బిచ్చగాడి వంక ఎగాదిగా చూశాడు.
 యువకుడి మాటలకు బిచ్చగాడు పెద్దగా నవ్వి-
 ‘‘పిచ్చివాడైంది నువ్వా నేనా? లక్షల రూపాయల విలువైన వాటిని అమ్మడానికి నిరాకరిస్తున్న నువ్వెందుకు పేదవాడిలా నిరాశతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు? నా దగ్గర ఏముంది? దేవుడు ఒక్క మర ణం తప్ప మిగిలినవన్నీ తీసేసుకున్నాడని ఇంతక్రితం నువ్వేగా గొణిగావు’’ అని చివాట్లు పెట్టడంతో యువకుడు సిగ్గుతో తలదించుకున్నాడు. తన ఆలోచనా ధోరణిని మార్చుకున్నాడు. జీవితంపై ఆశలు చిగురింపజేసుకున్నాడు.
 
- యామిజాల జగదీశ్
 

Advertisement
Advertisement