మూడేళ్లకే మోడల్...ఐదేళ్లకే ఫ్యాషన్ డిజైనర్! | Sakshi
Sakshi News home page

మూడేళ్లకే మోడల్...ఐదేళ్లకే ఫ్యాషన్ డిజైనర్!

Published Sun, Apr 6 2014 10:58 PM

మూడేళ్లకే మోడల్...ఐదేళ్లకే ఫ్యాషన్ డిజైనర్!

స్ఫూర్తి
 
పిల్లల్ని పెద్దయ్యాక ఏం చేస్తావ్ అని అడగడం సహజం. డ్యూడా బున్‌షెన్‌ని ఆ ప్రశ్న అడగాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే... అడిగే చాన్స్ ఆ చిన్నారి ఇవ్వలేదు. పెద్దయ్యాక చేసేదేంటి, ఇప్పుడే చేసేస్తా అంటూ ఐదేళ్ల వయసులోనే తన ప్రతిభను చాటింది. బుజ్జి ఫ్యాషన్ డిజైనర్‌గా సంచలనం సృష్టిస్తోంది.
 
బ్రెజిల్‌కి చెందిన సూపర్ మోడల్ జిసెల్ బున్‌షెన్ మేనకోడలు డ్యూడా. చిన్నప్పట్నుంచీ అత్త ఎక్కడికెళ్లినా నేనూ వస్తానని మారాం చేసేది డ్యూడా. జిసెల్ కూడా వద్దనేది కాదు. డ్యూడా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తులు వేసి మరీ తీసుకెళ్లేది. దాంతో  ఫొటోగ్రాఫర్లు పోటీపడి ఫొటోలు తీసేవారు. అవి కాస్తా ఓ దుస్తుల కంపెనీ కంట్లో పడ్డాయి. తాము తయారుచేసే చిన్నపిల్లల దుస్తులకు డ్యూడాని మోడల్‌గా తీసుకుంటామని వాళ్లు జిసెల్‌ని అడిగారు. ఆమె ఆనందంగా అంగీకరించింది. దాంతో మూడేళ్లకే మోడల్ అయిపోయింది డ్యూడా.
 
రాను రాను ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఏవి వేసుకుంటే బాగుంటుందో డ్యూడాకి అర్థమైపోసాగింది. తనకిలాంటి డ్రెస్ కావాలని వచ్చీరాని మాటలతో వివరించేది. ఆమె చెప్పేది విని... ఇంత చిన్న వయసులో ఇంత ఫ్యాషన్ సెన్స్ ఎలా వచ్చిందా అని టైలర్లు విస్తుపోయేవారు. బ్రెజిల్‌కి చెందిన ‘బ్రాండిలి ముండీ’ అనే టెక్స్‌టైల్ కంపెనీ అయితే... తమ కంపెనీకి చిన్నపిల్లల దుస్తులు డిజైన్ చేసేందుకు డ్యూడాని నియమించుకుంది. దాంతో అతి చిన్న ఫ్యాషన్ డిజైనర్‌గా డ్యూడా రికార్డులకెక్కింది!
 

Advertisement
Advertisement