స్త్రీ ధనం స్త్రీ గౌరవం | Sakshi
Sakshi News home page

స్త్రీ ధనం స్త్రీ గౌరవం

Published Sun, Feb 11 2018 12:42 AM

woman about in khuran - Sakshi

అన్నిటికన్నా ముందు, ఇస్లాం ధర్మం ‘స్త్రీ’ ఉనికిని, వ్యక్తిత్వాన్ని గుర్తిస్తుంది, అంగీకరిస్తుంది. పురుషుని వ్యక్తిత్వంతో స్త్రీని ముడిపెట్టదు. పురుషుని ఉనికిలో స్త్రీని నొప్పించి ఆమె ఉనికిని నిరాధారం చేయడాన్ని ఇస్లాం ఎంతమాత్రం సమ్మతించదు. పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది.

సమానత్వం
‘స్త్రీ అయినా, పురుషుడైనా – సత్కార్యం చేసే వారైతే, మేము వారికి పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాం, ఇంకా పరలోకంలో వారికి వారి సదాచరణలకు అనుగుణంగా ప్రతిఫలం ప్రసాదిస్తాము. (పవిత్ర ఖురాన్‌. 16–97) స్త్రీ తన ముక్తి మోక్షాలకు పురుషుడిపై ఆధారపడవలసిన అవసరం లేదు. మగవారికి మహిళలపై ఎలాంటి హక్కులు ఉన్నాయో, అలాంటి హక్కులే, ధర్మం ప్రకారం మహిళలకూ మగవారిపై ఉన్నాయి. (ఖురాన్‌. 2–228)

వరుణ్ని ఎంచుకునే విషయంలో స్వేచ్ఛ
వివాహ సమయంలో, వరుణ్ని ఎంపిక చేసుకొనే విషయంలో స్త్రీలకి సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయి. స్త్రీ ఇష్టపడడం అన్నది ఇస్లాం ధర్మంలో నికాహ్‌ జరగడానికి తప్పనిసరి నియమం.
‘వివాహం విషయంలో, చేసుకునే యువతి అనుమతి, అభీష్టం తప్పనిసరి’ (సహీహ్‌ ముస్లిం)

వారసత్వపు హక్కు
‘తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు వదిలి వెళ్లిన ఆస్తిలో పురుషులకు భాగం ఉన్నట్లుగానే, స్త్రీలకూ భాగం ఉంది. అది కొద్దిగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా, ఈ భాగం దైవం తరపున నిర్ణయించబడింది’ (పవిత్ర ఖురాన్‌)

మహర్‌ హక్కు
‘మహర్‌’ ధనానికి హక్కుదారు స్త్రీ. మహర్‌ ధనంపై ఆమెకు తప్ప మరెవరికీ అధికారం లేదు. దాన్ని ఆమె తన ఇష్టానుసారం ఖర్చు పెట్టుకునే అధికారం కలిగి ఉంటుంది.
(హిదాయతుల్‌ ముజ్తహిద్‌ రెండవ భాగం 16వ పేజి.)

స్త్రీ గౌరవానికి రక్షణ
గౌరవ మర్యాదలన్నది మానవుల అమూల్యనిధులు. అందుకని ఈ విషయంలోనూ ఇస్లాం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. స్త్రీలను అగౌరవపరచడం, వారి సౌశీల్యంపై అనుమానాలు రేకెత్తించడం లాంటి దుర్మార్గాన్ని తీవ్రంగా పరిగణించి, దానికి తగిన శిక్షను నిర్ణయించింది.

విడాకుల స్వేచ్ఛ
అన్ని ప్రయత్నాలూ విఫలమై, దాంపత్య బంధం ఇకముందుకు సాగే పరిస్థితి లేనపుడు పురుషులకు విడాకులిచ్చే అధికారం ఎలా ఉంటుందో, అలాగే మహిళలకూ ‘ఖులా’ ద్వారా భర్త నుంచి విడాకులు పొందే హక్కు ఉంటుంది. అవసరమైతే ఇస్లామీయ న్యాయస్థానం ద్వారా విడాకులు పొందే హక్కు, అధికారాలు మహిళలకు ప్రసాదించబడ్డాయి.

విద్యాహక్కు
ఇస్లాం ధర్మం స్త్రీ పురుషులిద్దరినీ విద్యను అర్జించమని ఆదేశించింది. కొన్ని సందర్భాల్లో స్త్రీ విద్య అత్యవసరమని నొక్కి చెప్పింది. ఇస్లాం ప్రసాదించిన విద్యా హక్కు కారణంగా ఎంతో మంది ముస్లిం మహిళలు గొప్ప గొప్ప పండితులుగా ప్రసిద్ధిగాంచారు. హజ్రత్‌ ఆయిషా సిద్ధిఖీ (ర.అన్‌హా) దీనికి నిదర్శనం.ముఖ్యంగా చూస్తే అదీ ఇదీ అని కాకుండా ఇస్లాం స్త్రీ జాతికి అన్ని రంగాల్లో సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించింది. ‘అమ్మ’ గా ఆమె స్థానాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. చెల్లిగా, ఇల్లాలిగా, అత్తగా, కోడలిగా, కూతురిగా వివిధ రంగాల్లో ఆమెకు గౌరవాన్ని, ఆ రంగాల్లో వారిపట్ల ప్రేమను ప్రసాదించింది. తల్లి పాదాల చెంత స్వర్గమున్నదని ప్రకటించి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పతాక స్థాయికి చేర్చిన ఘనత ఇస్లాం ధర్మానికి దక్కుతుందనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.

– ఎండీ ఉస్మాన్‌ఖాన్‌

Advertisement
Advertisement