స్త్రీలోక సంచారం | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Tue, Jun 19 2018 12:16 AM

Women empowerment :Anti-apskarting - Sakshi

:::  కారులో వెళుతూ విండోలోంచి ప్లాస్టిక్‌ చెత్తను రోడ్డు మీద పారేస్తున్న వ్యక్తిని, తమ కారులోంచి తన భార్య తిడుతూ ఉండగా విరాట్‌ కోహ్లీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడం వైరల్‌ అయింది. అందుకు ప్రతీకారంగా ఆ వ్యక్తి, ‘నేను రోడ్డు మీద పారేసిన చెత్తకన్నా, నా మీద పారేసుకున్న నీ నోటి చెత్తే ఎక్కువగా ఉందని’ ఫేస్‌బుక్‌లో అనుష్కపై విరుచుకు పడ్డాడు ::: ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కడం కన్నా, పొలంలో పనిచేయడమే కష్టమైన పని అనిపించిందని మహారాష్ట్రలోని దెవాడా ప్రాంతానికి చెందిన మనీషా దుర్వే అనే 17 ఏళ్ల విద్యార్థిని అనడం గ్రామాల్లో బాలికల పరిస్థితికి అద్దం పడుతోంది. మనీషాతో కలిపి మొత్తం 50 మంది ఆదివాసీ విద్యార్థులు కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గత నెల 21న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు ::: అవకరాలతో ఉన్న శిశువులను గర్భంలోనే గుర్తించి, విచ్ఛిన్నం చేయడం తగదని హితవు చెబుతూ, దేవుడు ప్రసాదించిన శిశువులను యధాతథంగా స్వీకరించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రపంచ పౌరులను కోరారు. ‘వైట్‌ గ్లోవ్స్‌’ వేసుకుని చేసే భ్రూణ హత్యలకు, నాజీలు అనుసరించిన జాతి ప్రక్షాళన ‘యూజెనిక్స్‌’ (మేలు రకం శిశువులకు మాత్రమే జన్మనివ్వడం) దురాచారానికి తేడా ఏమీ లేదని ఫ్రాన్సిస్‌ అన్నారు ::: స్త్రీల మోకాళ్లు కనిపించేలా ఫొటోలు తియ్యడాన్ని నిషేధించే ‘యాంటీ–అప్‌స్కర్టింగ్‌’ బిల్లును బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు క్రిస్టఫర్‌ చోప్‌ అడ్డుకున్నారు. 

బిల్లుకు తను వ్యతిరేకం కానప్పటికీ, సభలో బ్యాక్‌బెంచర్లు ప్రతిపాదించే ఏ బిల్లునైనా తను అడ్డుకుంటాననే విషయం అందరికీ తెలిసిందే కదా అని ఆయన తనను తను సమర్థించుకున్నారు :::  ఐరిష్‌ టాక్‌ షో వ్యాఖ్యాత గ్రాహం నోర్టాన్‌ తన లేట్‌ నైట్‌ షోకి అతిథిగా వచ్చిన బార్బడో గాయని రిహాన్నాకు ఉన్న చెడ్డ అలవాటును బహిర్గతం చేశారు. నైట్‌క్లబ్బులకు వెళ్లినప్పుడు రిహానా అక్కడి ఖరీదైన, అందమైన గ్లాసులను దొంగిలించుకొచ్చేస్తుంటారని ఫోటోలు, వీడియోలతో సహా చూపించడంతో ప్రేక్షకులతో పాటు రిహాన్నా కూడా నవ్వు ఆపుకోలేకపోయారు ::: అమెరికన్‌ రియాలిటీ టెలివిజన్‌ కార్యక్రమాలలో ప్రముఖంగా కనిపించే కిమ్‌ కర్దషియాన్‌ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సి.ఎన్‌.ఎన్‌.లో వచ్చే ‘వాన్‌ జోన్స్‌ షో’లో మాట్లాడుతూ, ‘అది నా మనసులో లేనప్పటికీ, పోటీ చేయనని మాత్రం చెప్పలేను’ అని ఆమె అనడంపై ఆ దేశం రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది ::: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఐరోపా టూర్‌లో ఉన్నారు. జూన్‌ 17 నుంచి 23 వరకు జరుగుతున్న ఈ వారం రోజుల పర్యటనలో ఆమె ఇటలీ, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్, బెల్జియంలతో భారతదేశ అభివృద్ధికి అవసరమైన పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుని వస్తారు ::: జీటీవీ రియాల్టీ షో ‘డాన్స్‌ ఇండియా డాన్స్‌’ లిటిల్‌ మాస్టర్స్‌ సీజన్‌ 4 విజేతగా హైదరాబాద్‌కి చెందిన తొమ్మిదేళ్ల జియా ఠాకూర్‌ ఎంపికైంది. టాప్‌ 5 కంటెస్టెంట్‌ల నుంచి జడ్జీలు ఫరాఖాన్, సిద్ధార్థ్‌ ఆనంద, మిర్జా పెస్తోంజీ.. జియాను విజేతగా ప్రకటించి ట్రోఫీని, ఐదు లక్షల నగదును అందజేశారు. 

Advertisement
Advertisement