దులిపేశారు.. వదిలించారు | Sakshi
Sakshi News home page

దులిపేశారు.. వదిలించారు

Published Thu, Sep 5 2013 11:22 PM

దులిపేశారు.. వదిలించారు

 సెటిల్మెంట్. పెద్దమాట! వీళ్లు చేస్తున్నదీ సెటిల్మెంటే అయినా ఇక్కడ ఆ మాట వాడేందుకు వీల్లేదు. వీళ్లేమీ తుపాకీ చేతబట్టిన వాళ్లు కాదు.
 బెదిరించి, నాలుగు పీకే వీర నారీమణులూ కారు. అధికారం ఉన్నవారు అసలే కాదు. మరెవరు? మామూలు మహిళలు. సాటి మహిళ  కష్టానికి
 స్పందించే మనసున్నవాళ్లు. ఆ కష్టానికి కారణమైన మగవాళ్ల వ్యసనాలను ప్రశ్నించినవారు.
 మొదట పేకల్ని దులిపేశారు. తర్వాత మద్యం మత్తును వదిలించారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. సాధారణ మహిళల్లోని
 ఈ అసాధారణ ఉద్యమశక్తే ఈవారం
 మన ‘ప్రజాంశం’.

 
 పల్లెటూళ్లలో భర్తని పోగొట్టుకుని లేదా భర్త నుంచి విడిపోయి ఆర్థికంగా నష్టపోయిన మహిళల గురించి ఆలోచించేవారు ఎవరూ ఉండరు. అదే పట్టణాల్లో అయితే కేసులు, కోర్టులు అంటూ ఎంతో కొంత పోరాటం చేసే అవకాశం ఉంటుంది. పైగా పల్లెల్లో భర్తలేని మహిళ ఏం మాట్లాడినా, ఏం అడిగినా తప్పు. అలాంటివారికి ఆసరాగా నిలిచి తమ ప్రత్యేకతను చాటుకున్నారు వెల్టూరు గ్రామం మహిళలు. పెద్దగా చదువులేక పోయినా...అన్యాయానికి ఎదురునిలబడి పోరాడే శక్తిని సంపాదించుకున్న ఆ మహిళల వెనక ఉద్యమశక్తి దాగి ఉంది.

 ఏడాదికిత్రం వరకూ వెల్టూరు అన్ని గ్రామాలలాంటిదే. అన్యాయం, ఆస్తి...గురించి కాదు కదా సాయంత్రం అయితే మగవాళ్లతో మాట్లాడే ధైర్యమే ఉండేది కాదు. మద్యం, పేకాట కలిసి వెల్టూరుకి వెలుగుని దూరం చేశాయి. ఆరే ఆరు నెలల్లో అన్ని సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు మహిళావికాసం కోసం ముందు నిలబడ్డారు ఆ ఊరి మహిళలు. ‘‘మా ఊళ్లో ఒకతను భార్యని వదిలేసి, రెండోపెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య బాగోగులు, కష్టాసుఖాలు పట్టించుకోవడం లేదు. ఆ కేసుని మేం తీసుకుని అతనికున్న రెండెకరాల పొలాన్ని ఇద్దరు భార్యలకూ చెరో ఎకరం రాయించాం. ఎవరి పంట వారు తీసుకునేలా ఒప్పందం కుదిర్చాం. అలాగే మరో అమ్మాయి గర్భిణిగా ఉండి అత్తింటినుంచి పుట్టింటికి వచ్చేసింది.

ఏళ్లు గడిచిపోతున్నా ఆమెను తీసుకెళ్లడానికి భర్త రావడంలేదు. మేం అతని దగ్గరికి వెళ్లి భార్యని తీసుకెళ్లనందుకు ఆస్తిలో సగం వాటా రాయమని చెప్పి న్యాయపరంగా ఆ అమ్మాయికి రావాల్సిన వాటా ఆమెకు రాయించాం. ఇలా...చాలా కేసులు పరిష్కరించి మా ఊరి ఆడపిల్లలకు న్యాయం జరిగేలా పోరాడాం’’ అని కమలమ్మ అనే మహిళ చెప్పింది. అంతే కాదు...ముగ్గురు బిడ్డల తల్లిని వదిలేసి ఊరొదిలి పారిపోయిన వ్యక్తిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి అతని ఆస్తిలో భార్యకు, పిల్లలకు సగభాగం రాయించారు. భార్యని వదిలేసి పారిపోయిన భర్త నుంచి పెళ్లినాడు భార్యకు పెట్టిన బంగారంతో సహా ఇప్పించారు. ఇరువర్గాలకు న్యాయం చేయడం ఈ గ్రామ మహిళల సెటిల్‌మెంట్ ప్రత్యేకం.

 సెటిల్‌మెంట్ సిస్టమ్...

 ఈ మహిళల్లో ఎవరు పెద్దగా చదువుకున్నవారు లేరు. చాలావరకూ వేలిముద్రలే. ఆస్తులు, వాటాలు అంటున్నారంటే పట్టణజ్ఞానం ఏమైనా ఉందా అంటే ఏనాడు పల్లెదాటి ఎరగరు. మరి వీరికింత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే? బాధల నుంచేనంటూ టక్కున సమాధానం చెబుతారు. కావాలంటే కాసింత సాయం చేస్తామనేవారుంటారు కాని కుటుంబవ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇంటిమనుషుల్లా న్యాయం చేసే మహిళల్ని చూడాలంటే  మెదక్ జిల్లా కలెక్టరేట్‌కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్టూరు గ్రామానికి వెళ్లాల్సిందే. పత్తిని నమ్ముకుని బతుకుతున్న కుటుంబాల్లో పత్తాలు(పేకలు) చిచ్చుపెట్టాయి, కిరాణాదుకాణాల్లో కూల్‌డ్రింక్ బాటిల్స్‌తో పాటు దొరికే క్వార్టర్ బాటిల్స్ పేదల జీవితాల్ని పేకమేడల్లా కూల్చేశాయి.

అలాంటి సమయంలో మహిళా సంఘాలన్నీ కలిసి కలిసి ఉద్యమం చేసి తమ ఊరిని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఏ ఉద్యమం విజయం సాధించాలన్నా... ప్రభుత్వ అధికారుల సాయం ఉండాలి. వారి దగ్గరికెళ్లి గోడు చెప్పుకుంటే అన్ని ఊళ్లలో ఉన్న బాధలే కదా అంటారు. ఆ సమయంలో వారికి తోచిన అద్భుతమైన ఆలోచన... బ్యాంకు రుణాల చెల్లింపు నిలిపి వేయడం. ‘‘మా ఊళ్లో చాలామంది మగాళ్లకు పత్తాలంటే ప్రాణం. బతుకులు కూలిపోతున్నా... వాటిని ముట్టడం మానరు. ఇక లాభం లేదని మహిళా సంఘాల మీటింగుల్లో ఈ విషయం గురించి బాగా చర్చించుకున్నాక... బ్యాంకు రుణం కట్టకుండా, గ్రామసంఘం మీటింగు రద్దు చేసి పంచాయితీ కార్యాలయం ముందు ధర్నా చేద్దామనుకున్నాం.

మా ఊళ్లో 450 మంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉన్నారు. వీరితో పాటు మిగతా మహిళలు కూడా ధర్నాకు దిగారు. మా ఊళ్లో ఉన్న ఆరు కిరాణాదుకాణాల్లో మద్యం అమ్మడం ఆపేయాలనేది మా మొదటి డిమాండ్. అలాగే ఎవరు పత్తాలు ఆడినా తమ పర భేదాల్లేకుండా వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.  గంట రెండు గంటలు కాదు, ఏకంగా మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేశాం. ఆ మూడు దినాల్లో...ఒక్క మహిళ కూడా ఇంట్లో పొయ్యి వెలిగించలేదు. పిల్లల కోసమన్నా...వంట వండమని మగోళ్లు బతిమిలాడితే హోటళ్లలో తినిపించుకోమని చెప్పాం. మా ధర్నా సంగతి తెలిసి అధికారులు వచ్చి మా బాధలు విని మాకు సాయం చేస్తామన్నారు.’’ అని ఆర్నెల్లకిత్రం జరిగిన తమ పోరాటం మొదటిరోజుని గుర్తుచేసుకుంది వెల్టూరు గ్రామ సంఘం అధ్యక్షురాలు మల్లమ్మ.

 జరిమానా...బహుమతి

 నిరాహార దీక్ష, ధర్నా, ర్యాలీలు, షాపుల్లోకి చొరబడి సీసాలు పలకొట్టడంతో సరిపెట్టకుండా మద్యం తాగినవారికి 5000, అమ్మినవారికి 500 రూపాయల జరిమానా. తాగుతున్నప్పుడు, అమ్ముతున్నప్పుడు చూసి, ఫిర్యాదు చేసిన వారికి 500 రూపాయల బహుమతి ఇస్తామని మహిళా సంఘాల తరపున ప్రకటించారు. వివరాలు చెప్పినవారి విషయాలు గోప్యంగా ఉంచుతామన్నారు. దాంతో బహుమతుల కోసం చాలామంది అమ్మినవారి, కొన్నవారి వివరాలు వీరికి చేరవేయడంతో నేరుగా దాడులు చేసి మహిళలందరూ కూడి ఆందోళన చేయడం మొదలెట్టారు.

ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను ఇంట్లోవారు కాని, బయటివారు కాని ఏ చిన్నమాట అన్నా... వారు ఊరి మహిళలందరికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు.‘‘మేం కిరాణాషాపులపై దాడిచేసినపుడు ఆ షాపు ఓనర్లు మాతో ఒక మాట అన్నారు. ‘ముందు మీ మొగోళ్లతో పత్తాలు ఆడుడు మాన్పించండి. ఆ తర్వాత మందు...’ అన్నారు. మా మాట వినాలంటే ముందు మందు మానాలి. చాయ్‌కి బదులు మందు తాగేవాడి దగ్గర మా మాట ఏం వినిపిస్తుంది అని వాదించాం. మందు బాధ తగ్గిన తర్వాత పత్తాలపై దాడికి దిగాం’’ అని వివరించింది సంఘం ఉపాధ్యక్షురాలు లక్ష్మి.

 పత్తాల పని పట్టాం...

 వెల్టూరు గ్రామం పత్తి పంటలు పండించడంలో ప్రసిద్ధి. నేలసారమో, రైతుల కష్టమో పత్తి విపరీతంగా పండుతుంది.పత్తి ఎండబెట్టి మార్కెట్‌కి పంపే సమయానికి పొలాల్లోని పొదలన్నీ పత్తాలకు పరదాలుగా మారిపోతాయి. పంట అమ్మిన సొమ్ములేవని అడిగితే తాగొచ్చి తల్లీ, పెళ్లాం తేడా లేకుండా కొట్టడం...‘‘మాలోని చాలామంది మహిళలకు సెల్‌ఫోన్లు ఉన్నాయి. ధర్నా సమయంలో మా ఊరొచ్చిన ఎస్‌ఐ సారుతో పత్తాల విషయం చెప్పి ఆయన ఫోన్ నెంబరు తీసుకున్నాం.

మా వివరాలు చెప్పకుండా ఆడేవారిని అరెస్టు చేయాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాం. పత్తాలు ఆడుతున్నట్టు ఎవరికి సమాచారం అందినా వెంటనే ఎస్‌ఐకి ఫోన్ చెయ్యడం మొదలుపెట్టాం. పోలీసులు వెంటనే వచ్చి వారిని జీపు ఎక్కించుకుని వెళ్లిపోయేవారు. ఇలా రెండు మూడు సంఘటనలు జరగడంతో పత్తాల ప్యాకెట్ల అమ్మకం ఆగిపోయింది. సమాచారం అందించిన మహిళలను ఆమె భర్త కొట్టబోతుంటే మా సంఘం మహిళలంతా వెళ్లి అడ్డుకుని అతనికి బుద్ధి చెప్పాం. ఈ ఊళ్లో ఏ మహిళా ఒంటరి కాదని ఆ సందర్భంగా గట్టిగా చెప్పాం’’ అంటూ మరో మహిళ వివరించింది.

 ‘‘ఆ రోజు వీరిలో ఎంత పట్టుదల ఉందో ఈ రోజూ అంతే ఉంది. ప్రతి గ్రామంలో మహిళ ధైర్యంగా నిలబడితే పల్లె పచ్చగా ఉంటుంది. దేశ అభివృద్ధి పల్లెల మీదే ఆధారపడి ఉంది’’ అని ఎంతో సంతోషంగా చెప్పారు సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు స్వరూప, అనూష. ఇబ్బందులకు ఎదురు నిలబడి, గెలిచిన వారి విజయాన్ని మిగతా పల్లెటూళ్లు కూడా ఆహ్వానించాలని కోరుకుందాం.

  - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 మరుగుదొడ్లు కట్టించకుంటే రేషన్ కట్..!
 మద్యం, పత్తాలు సమస్యలు తీరడంతో కాస్త తేరుకున్న మహిళలంతా ఊరి బాగుకోసం ఆలోచించడం మొదలెట్టారు. అందులో భాగంగా ముందుగా ఇంటింటికీ మరుగుదొడ్లు ఉంటే బాగుండుననుకున్నారు. అందుకోసం ప్రభుత్వసాయం తీసుకుని కొంత డబ్బుని పొదుపు సంఘాల నుంచి అప్పు ఇప్పించి 412 మరుగుదొడ్లు కట్టించారు.  దీనికి సహకరించనివారికి రేషన్, ఫించన్ సౌకర్యాలు ఆపేస్తామని చెప్పారు. దాంతో ఊళ్లో పారిశుద్ధ్యం కూడా మెరుగయ్యేలా చేయగలిగారు. వీరికి ప్రభుత్వం తరపు నుంచి ఇందిరాక్రాంతి పథకం అధికారులు అండగా నిలిచారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement