మీ ఇల్లు శుభ్రమేనా..! | Sakshi
Sakshi News home page

మీ ఇల్లు శుభ్రమేనా..!

Published Wed, Apr 1 2015 10:17 PM

మీ ఇల్లు  శుభ్రమేనా..!

‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ అనే సామెత గాలి కాలుష్యం విషయంలో కూడా నిజమైంది. అవును.. పిల్లలు ఎక్కువగా బయట తిరగడం వల్ల కలుషితమైన గాలి పీల్చి అనారోగ్యం పాలవుతారనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఇంట్లో, స్కూల్లో ఉండే దుమ్ము ధూళి కూడా వారి వ్యాధులకు కారణభూతాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సర్వేలో తేలింది.

ఢిల్లీలోని 5 ప్రముఖ పాఠశాలల్లో ‘గ్రీన్‌పీస్’ సంస్థ చేపట్టిన సర్వేలో తరగతి గదుల్లో, కారిడార్లలో ఉన్న గాలి, బయటి పరిసరాల్లో గాలి కంటే ఎక్కువ ప్రమాదకరంగా ఉందని తెలిసింది. దీన్ని పీల్చడం వల్ల పిల్లలు బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని స్పష్టమైంది. ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ (అంతర్గత గాలి కాలుష్యం)ను మొగ్గలోనే తుంచి వేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు చవిచూడాల్సి వస్తుందని సర్వే హెచ్చరిస్తోంది.

ప్రభావం చూపిస్తుందిలా..

ఈ కాలుష్యం స్థాయి తక్కువగానే ఉన్నా, ఎక్కువ మోతాదులో పీల్చడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో శ్వాసక్రియా రేటు ఎక్కువ. దీంతో కలుషిత వాయువులను ఎక్కువ మోతాదులో లోనికి ప్రవేశిస్తాయి. అలాగే వాయునాళాలు కూడా అభివృద్ధి చెందే దశలో ఉండటంతో వాటికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువ.   కలుషిత వాయువులను పీల్చడం వల్ల కలిగే పరిణామాలు ప్రస్తుతం కనిపించకపోయినా, వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లినపుడు విరుచుకుపడే ప్రమాదం ఉంది.
 
జాగ్రత్తలివిగో...


ఇంటికి వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోకి పొగ, దుమ్ము రాకుండా చూడాలి. వేసవిలో ఎయిర్ కండిషనర్లు ఎక్కువసేపు వాడకూడదు. ఓ గదిలో ఉన్న గాలినే కండిషనర్ తిప్పి తిప్పి పంపిస్తుంది. ఈ గాలిలో కార్బన్‌డయాక్సైడ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మంచి నాణ్యత ఉన్న ఫ్యూరిఫయర్‌ను అమర్చడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.  పొగ ఎక్కువగా వెలువడే ప్రాంతాల్లో, ఎక్కువ తేమ ఉన్న చోట్లలో చిన్నారులకు శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది కలుగుతోందా అనే విషయాన్ని కనుక్కోండి.

వీలైనన్నీ ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వండి. (ముఖ్యంగా వేసవిలో) ఎప్పటికప్పుడు ఇంటిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి.
 ఇవి పాటించడం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారినుంచి పిల్లలను రక్షించవచ్చు. సో.. ఇప్పటికైనా బయటి వాతావరణాన్ని నిందించే ముందు ఒక్కసారి మీ ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోండి.
 
- డాక్టర్ ఇందు ఖోస్లా, పిల్లల వైద్యనిపుణురాలు, ముంబై

Advertisement

తప్పక చదవండి

Advertisement