ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Sun, Jul 2 2017 11:22 PM

ఈ వారం యూట్యూబ్  హిట్స్‌

అడవిలో ఆర్తనాదాలు
జుమాంజి వెల్కమ్‌ టు ది
జంగిల్‌ – ట్రైలర్‌
నిడివి: 2 ని. 45 సె.
హిట్స్‌: 69,91,647

నలుగురు స్కూల్‌ పిల్లలు.. మరీ పిల్లలు కాదు.. టీనేజర్లు.. స్కూల్‌ బేస్‌మెంట్‌లోకి వెళ్లిపోయి అక్కడివన్నీ కదిలించి చూస్తుంటారు. పాతకాలం నాటి ‘జుమాంజి’ వీడియో గేమ్‌ వారి కంట పడుతుంది. దాని దుమ్ము దులిపి జాయ్‌స్టిక్స్‌ తీసుకుని ఆడడం మొదలు పెడతారు. ఒక్కొక్కళ్లూ ఆ గేమ్‌లోని ఒక్కో క్యారెక్టర్‌ ఎంచుకుంటారు. వాళ్లలో ఒక అందమైన అమ్మాయి క్యారెక్టర్‌ కూడా ఉంటుంది. ఆట స్టార్ట్‌ అవుతుంది. అంతే! ఎవరు ఏ క్యారెక్టర్‌ని ఎంచుకున్నారో ఆ వయసున్న క్యారెక్టర్‌లా మారిపోయి జుమాంజి అనే అడవిలోకి వెళ్లి పడతారు. ఇక అక్కడి నుంచి మొదలౌతుంది అసలైట ఆట.

తిరిగి వాళ్లు మామూలు రూపంలోకి వచ్చారా? అలాగే ఉండిపోయారా? డిసెంబర్‌ 20న పిక్చర్‌ రిలీజ్‌ అయ్యాక ఈ మిస్టరీ వీడుతుంది. 1995 నాటి ‘జుమాంజి’ మూవీ సీక్వెల్‌గా వస్తున్న ఈ హాలీవుడ్‌ త్రీడీ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎంత ఎక్సైటింగ్‌గా ఉండబోతోందో ట్రైలర్‌ను చూస్తున్నప్పుడు మీకే అర్థమౌతుంది.


మీ ఆధార్‌ గల్లంతే!
మి జెంతే జె.బల్విన్, విల్లీ విలియమ్‌
నిడివి: 3 ని. 5 సె.
హిట్స్‌: 2,03,77,475

మి జెంతే అంటే స్పానిష్‌లో ‘మై పీపుల్‌’ అని అర్థం. తెలుగులో ‘నావాళ్లు’. స్పానిష్, ఇంగ్లిష్, తెలుగు.. ఇవన్నీ కాదు. ఏ భాషా తెలియని, ఏ భావమూ అర్థం కాని వారికి కూడా మతిపోగొట్టే వీడియో సాంగ్‌ ఇది. ఇందులోని రిథమ్‌ మిమ్మల్ని ఎందులోకి లాక్కెళ్లిపోతుందో చెప్పడం కష్టం. ఒకటైతే నిజం.. మీ ఆధార్‌ ఉండదు. ఐడెంటిటీ ఉండదు. మధ్యలోనే ఎక్కడో కొట్టుకుపోతుంది. వెతికినా దొరకదు. అసలు వెతుక్కోవాలనే అనిపించదు. సర్వం జగన్నాథం! లయం అవుతారు. లుప్తం అవుతారు. ‘ఇఫ్‌ రిథమ్‌ కాజస్‌ యు టు మూవ్‌ యువర్‌ హెడ్‌.. వియ్‌ స్టార్టెడ్‌ యాస్‌ ఇట్‌ ఈజ్‌. మై మ్యూజిక్‌ డజ్‌ నాట్‌ డిస్క్రిమినేట్‌ అగైన్‌స్ట్‌ ఎనీవన్‌. సో లెటజ్‌ బ్రేక్‌..’ అని వీడియో స్టార్‌ అవుతుంది. బక్కచిక్కిన ముఖంతో 32 ఏళ్ల కొలంబియన్‌ సింగర్‌ జె.బల్విన్, తెల్లగడ్డంతో 36 ఏళ్ల ఫ్రెంచి డీజే విల్లీ విలియమ్‌.. వీళ్లిద్దరు మాత్రమే ఈ మ్యూజిక్‌ వీడియోలో ఆడి, పాడి మిమ్మల్ని బోర్‌ కొట్టించరు.

హలోలోలోలోలో.. ఎవ్రీబడీ
మై లాంగెస్ట్‌ హలో ఎవ్రీబడీ ఎవర్‌
నిడివి: 1 ని 27 సె.
హిట్స్‌: 23,25,983

ఫన్నీయెస్ట్‌ క్లిప్స్‌ కేటగిరీలో ఈవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయిన ఈ వీడియో సరదాగా ఉంది. కానీ సరదాగా కూడా ఈ పని చేయకూడదు అనిపిస్తుంది! జూన్‌ 28న మార్క్‌ ఎడ్వర్డ్‌ ఫిష్‌బ్యాక్‌ అనే అమెరికన్‌ కుర్రాడి బర్త్‌డే. నిక్‌నేమ్‌ మర్కిప్లయర్‌. ఇదే పేరుతో ఒక యూట్యూబ్‌ బ్లాగ్‌ నడుపుతున్నాడు మర్కీ. (మనం ముద్దుగా మర్కీ అందాం). సరే, మర్కీ బర్త్‌డే కదా! ఏదో ఒకటి డిఫరెంట్‌గా చెయ్యాలనుకున్నాడు. ఏం చెయ్యాలీ అని ఆలోచించాడు. అందరికీ ‘హలో’ చెబుదాం అనుకున్నాడు. ఊరికే హలో చెప్పడంలో గొప్పేముంటుంది? అందుకే లాంగెస్ట్‌ హలో చెప్పేశాడు.

ఊపిరి తీసుకోకుండా ‘హలోలోలోలోలోలోలోలో...’ అంటూ దమ్ము దిగే టైమ్‌లో ‘ఎవ్రీబడీ’ అని కంక్లూడ్‌ చేశాడు. గ్రేట్‌ అండ్‌ ఫన్నీ! బట్‌ డేంజరస్‌. లంగ్స్‌ ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటే తప్ప ఈ ఫీట్‌ చెయ్యకూడదు. మర్కీకి ఎలా ఉందో కానీ చూస్తున్న మనకు టెన్షన్‌ పట్టుకుంటుంది... ఎక్కడ స్ట్రక్‌ అయిపోతాడోనని. ఓకే మర్కీ... యు ఆర్‌ సోసోసోసోసోసోసోసో గ్రేట్‌. అండ్‌ బిలేటెడ్‌గా జన్మదిన శుభాకాంక్షలు.

ది గ్రేట్‌ ఎస్కేప్‌!
కార్ప్‌ ఎస్కేప్స్‌ ఫ్రమ్‌ ఫిషర్‌మాన్‌
నిడివి: 23 సె.
హిట్స్‌: 6,46,290
చేపను కూరొండుకుని తినేస్తాం కనుక చేప కంటే మనిషే బలవంతుడు అనుకోడానికి లేదు. ఎందుకు అనుకోడానికి లేదో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. చెకోస్లొవేకియాలో ఒక ఆసామి చేపలు కొంటానికి వెళ్లాడు. మార్కెట్‌కి వెళితే ‘లైవ్‌’ చేప దొరకదని, నేరుగా చేపల చెరువుకే వెళ్లాడు. అక్కడ ‘కార్ప్‌’ ను చూశాక.. (కార్ప్‌ ఇంచుమించు మన బొచ్చె చేపలా ఉంటుంది) నోరూరి, ‘నా కదే కావాలి.. చుట్టివ్వు, చంకన పెట్టుకు వెళతా’ అన్నాడు. ఆ కార్ప్‌ బలంగా ఉంది. కదులుతూ ఉంది. చేపలాయన, చేప కోసం వచ్చినాయనకు చేపను ఇచ్చాడు, చేపను చుట్టి తీసుకెళ్లేందుకు గుడ్డను కూడా ఇచ్చాడు. చేపను కొనుక్కున్నాయన చేపను ప్యాక్‌ చేస్తుండగా చేప కదిలింది చూడండీ... కదిలి దబదబా ఒడ్డు మీది నుంచి జారుకుంటూ నీళ్లలోకి వెళ్లిపోయింది. చేపను అమ్మినాయన దాన్ని పట్టుకోడానికి తంటాలు పడ్డాడు కానీ.. చేప బతికిపోయింది. ఈ చేపను కొన్నాయన, అమ్మినాయన బిక్క చచ్చిపోయారు.

Advertisement
Advertisement