ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Sun, May 28 2017 11:28 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

తినడం ఈజీ.. తియ్యడం డిఫికల్ట్‌
ఈజ్‌ కిల్లర్‌ బీ హనీ డేంజరస్‌? ::: నిడివి : 13 ని. 35 సె. ::: హిట్స్‌ : 33,80,236

మీరు ఈ వీడియోను చూస్తున్నంత సేపూ డిఫికల్ట్‌ అయిన పనిని ఈజీగా చేసినట్లు అనిపిస్తుంది! జంతుప్రపంచ నిపుణుడు, దుస్సాహసీ అయిన కయోటీస్‌ పీటర్‌సన్, ఆయన సాంకేతిక బృందం కలిసి.. నిండా ముసుగులు వేసుకుని తీసిన తేనెపట్టును జుర్రుకున్న అనుభూతి మీక్కూడా కాస్త కలగాలంటే ఈ వీడియోను ఆసాంతం గ్రోలాల్సిందే. అతి భయంకరమైన రాక్షస తేనెటీగల (కిల్లర్‌ బీస్‌) స్థావరంలోకి వెళ్లి, వాటి కోటను కొల్లగొట్టి స్వచ్ఛమైన మేలు రకం మకరందాన్ని మూటగట్టుకోవడం అంటే... పద్మవ్యూహంలోకి వెళ్లి ప్రాణాలతో తిరిగిరావడమే.

కయోటీస్‌ అలా తిరిగి రావడమే కాదు, ‘బ్రేకింగ్‌ ట్రయల్‌’ పేరుతో తన సాహసాన్ని చిత్రీకరించి యూట్యూబ్‌లోకి ఎక్కించాడు. దక్షిణ అమెరికాలోని కొండప్రాంతపు అరణ్యాలలో 30,000 తేనెటీగల్ని చెట్టుకొకటిగా, పుట్టకొకటిగా తరిమేసి, తేనె పిండేశాడు. ఇంతకీ ఈ సాహసాన్ని ఆయన ఎందుకు చేసినట్లు? కిల్లర్‌ బీ తేనె ఎలా ఉంటుందో తెలుసుకోడానికి! మామూలుగా మనకు మార్కెట్‌లో దొరికే హనీకీ, ఈ కిల్లర్‌ బీ హనీకి రుచిలో, ఇంకా వేరే గుణాలలో తేడా ఏమిటో కనిపెట్టడానికి! కనిపెట్టేశాడు కూడా! ఎలా కనిపెట్టాడు? ఏం తేల్చాడు అనే విషయాలను మీరు వీడియోను చక్కగా ఏంజాయ్‌ చేస్తూ చూడొచ్చు. అవునూ.. ఈ కిల్లర్‌ బీ హిస్టరీ ఏమిటి? ఎందుకు దీనికంత ప్రాముఖ్యం? ఎందుకంటే.. ప్రకృతితో కిల్లర్‌ బీ అనేది లేనే లేదు!

బ్రెజిల్‌ పరిశోధకులు ప్రయోగశాలల్లో యూరోపియన్‌ హనీ బీని, ఆఫ్రికా బీని జతకట్టించి, ఈ కిల్లర్‌ బీ జాతిని పుట్టించారు. ఇవి చాలా రాక్షసంగా ఉంటాయి. కుట్టాయంటే ఇప్పట్లో లేవలేం. అంత అగ్రెసివ్‌ అన్నమాట. ఇవే ఇంత గత్తరగత్తరగా ఉంటే.. వీటి తేనె ఎంత మత్తుమత్తుగా ఉండాలీ అనే డౌట్‌ వచ్చిందట కయోటీస్‌కి. వెంటనే అడవుల్లోకి బయల్దేరి వెళ్లిపోయాడు. ‘ఈజ్‌ కిల్లర్‌ బీ హనీ డేంజరస్‌’ అని మనకో గేలం వేశాడు.

అటు చూస్తూ ఇటు గుద్దుకున్నాడు
యాంగ్రీ పెడిస్ట్రియన్‌ గెట్స్‌ ఇన్‌స్టంట్‌ కర్మ ::: నిడివి : 0 ని. 19 సె. ::: హిట్స్‌ : 27,70,962

తన కోపమే తన శత్రువు అని మనకో నీతి. అయితే ఆ శత్రువు ఒక్కోసారి అక్కడికక్కడ తన ప్రతాపం చూపించేస్తాడు. ఈ వీడియోలో ఆ ప్రతాపాన్ని చక్కగా చూడొచ్చు. క్రిస్‌ స్మిత్‌ వన్‌ అనే బ్లాగర్‌ దీనిని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. ఈ నెల 23న ఆయన ఎక్కడికో కారులో వెళుతున్నాడు. ఇంటర్‌సెక్షన్‌ను దాటుకుని ముందుకు వెళ్లబోయే లోపు సడెన్‌గా రెడ్‌ లైట్‌ పడడంతో కారుని స్లో చేసి ఆపాడు. కారు పూర్తిగా ఆగేలోపు ఓ పెద్దాయన తన కుక్కతో పాటు రోడ్డుకు ఈ వైపు నుంచి ఆ వైపుకు నడుచుకుంటూ వచ్చేశాడు. వస్తూ వస్తూ కారులో ఉన్న క్రిస్‌ స్మిత్‌ను చూసి తిట్లకు లంఘించుకున్నాడు.

‘నీ మొహం మండా.. రెడ్‌ లైట్‌ చూసుకోవద్దా. లైన్స్‌ని దాటి కారు ఆపుతావా?’ అని ముఖం చిట్లిస్తూ, కళ్లెర్ర చేస్తూ డ్రైవింగ్‌ సీట్లో ఉన్న క్రిస్‌ వైపే చూస్తూ  కోపంగా రోడ్డు దాటేశాడు. డ్రైవర్‌ని చూస్తున్నాడే కానీ రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని చూడకపోవడంతో దానికి గుద్దుకున్నాడు. పెద్దాయన ఎందుకు తిడుతున్నాడో తెలియక అవాక్కయిపోయిన క్రిస్‌.. ఆ దృశ్యం చూసి పెద్దగా నవ్వాడు. దీన్నంతా కారు ఆటోమేటిక్‌గా షూట్‌ చేసింది. దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్‌లో పడేశాడు. వీడియోలో కనిపిస్తున్న స్పాట్‌ ఆస్ట్రేలియాలోని అడిలాయిడ్‌ ప్రాంతానిది. ఫన్నీగా ఉన్న ఈ క్లిప్‌లో ఒక జీవితానికి సరిపడా సందేశం ఉంది. ఒళ్లు మరిచిపోయేంత కోపం కీడు చేస్తుందన్న సంకేతమూ ఉంది.

నువ్వు ఎవరికన్నా తక్కువ కెప్టెన్‌?
ట్యూబ్‌లైట్‌ : ట్రైలర్‌ ::: నిడివి : 2 ని. 23 సె. ::: హిట్స్‌ : 86,11,811

భారత్‌–పాక్‌ బోర్డర్‌లో టెన్షన్‌ టెన్షన్‌. జగత్‌పూర్‌లోని ప్రతి ఒక్కరు ఈ కష్టకాలంలో భారత మాతను కాపాడుకునేందుకు సిద్ధం కండి అని ఆర్మీ.. మైకులో చెబుతోంది. సల్మాన్‌ఖాన్‌ వింటాడు. ఇన్‌స్పైర్‌ అవుతాడు. సైనికుల ట్రక్కు వెళుతుంటే ఆ ట్రక్కు చూస్తూ సైకిల్‌ తొక్కుకుంటూ వెళుతూ ఒక రాయికి తట్టుకుని పడిపోతాడు. దూరం నుంచి ‘ఏయ్‌.. ట్యూబ్‌లైట్‌’ అని వినిపిస్తుంది. పిలించింది ఊళ్లోవాళ్లే. ‘నేను ట్యూబ్‌లైట్‌’ కాదు అని పెద్దగా అరిచి చెప్తాడు సల్మాన్‌ఖాన్‌. సల్మాన్‌ అమాయకుడు. ‘నువ్వు ఎవరికన్నా తక్కువ కాదు’ అని ఎప్పటికప్పుడు సల్మాన్‌లోని కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పడిపోకుండా చూస్తుంటాడు సల్మాన్‌ తమ్ముడు. ‘కెప్టెన్‌.. కెప్టెన్‌’ అని సల్మాన్‌ని సరదాగా అతడు పిలుస్తుంటాడు. ఈత కొట్టడం నేర్పిస్తాడు.

ఆ తమ్ముడు సైనికుడు. బోర్డర్‌లోకి వెళ్లవలసిన సమయం వచ్చేస్తుంది. కన్నీళ్లతో తమ్ముడికి వీడ్కోలు చెబుతాడు సల్మాన్‌. బోర్డర్‌ చల్లబడ్డాక ఇంటికి వచ్చేస్తాను కదా అని ఊరడిస్తాడు తమ్ముడు. తర్వాతే ఏమౌతుంది? రంజాన్‌కి ‘ట్యూబ్‌లైట్‌’ విడుదల అవుతోంది. అయితే అంతవరకు ఆగక్కర్లేదు. యూట్యూబ్‌ చూస్తే చాలు.. తర్వాత ఏమౌతుందో తెలుస్తుంది. ట్రైలర్‌ లిటరల్‌గా మనల్ని ఏడిపిస్తుంది. ఉత్తర భారతదేశంలోని కొండప్రాంత కుటుంబలోని ఈ కథ త్వరలోనే యావత్‌భారతాన్నీ ఎమోషన్‌లో ముంచెత్తబోతోంది. డైరెక్టర్‌ ఎవరనుకున్నారు? కబీర్‌ ఖాన్‌. బజ్‌రంగి భాయ్‌జాన్‌ చిత్రాన్ని తీసిన కబీర్‌ ఖాన్‌.

అప్పుడు మనం ప్రేమించుకున్నాం
కైగో అండ్‌ ఏల్లీ గోల్డిండ్‌ : ఫస్ట్‌ టైమ్‌ ::: నిడివి : 3 ని. 14 సె. ::: హిట్స్‌ : 45,26,873

పాతికేళ్ల నార్వే డీజే కుర్రాడు కైగో, ముప్పై ఏళ్ల బ్రిటన్‌ ఫిమేల్‌ సింగర్‌ ఎల్లీ గోల్డింగ్‌ ఇద్దరూ కలిసి చేసిన ‘ఫస్ట్‌ టైమ్‌’ అనే మ్యూజిక్‌ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌ ట్రెండ్స్‌లో ఫ్రంట్‌ లైన్‌లో ఉంది. ‘అప్పుడు మనం ఫస్ట్‌ టైమ్‌ లవర్స్‌. అన్నీ మితిమీరే వాళ్లం. అప్పట్లో మధ్య వేలు మన శాంతి చిహ్నం. యా! ఎమోషన్స్‌ని చప్పరించేవాళ్లం. ప్రతి క్షణాన్నీ తాగి, పీల్చేసేవాళ్లం. ఎంత నిర్లక్ష్యంగా ఉండేవాళ్లం..’ అని పాట మొదలౌతుంది. ఇదంతా బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్‌. పాస్ట్‌ లైఫ్‌ రిగ్రెషన్‌ లాంటిది.

జ్వలించే జ్ఞాపకాలతో వర్తమానాన్ని వెలిగించుకుంటూ ఉంటుంది ఈ వీడియోలోని గాయనిస్వరం. రైల్వే ట్రాక్‌పై తూలుతూ నడవడం, మొదటిసారి సిగరెట్‌ను ట్రై చెయ్యడం.. ఇవన్నీ మళ్లీ చేస్తాను అని కూడా అంటుంది! కైగో సాంగ్‌ రైటర్, రికార్డ్‌ ప్రొడ్యూజర్‌. మ్యుజీషియన్‌. ఇక ఎల్లీ గోల్డింగ్‌ సింగర్, సాంగ్‌ రైటర్‌. 2010లో డెబ్యూ ఆల్బమ్‌ ‘లైట్స్‌’తో ఎల్లీ సీన్‌లోకి వస్తే, కైగో గత ఏడాదే ‘క్లౌడ్‌’ నైన్‌తో పాప్‌ ప్రపంచాన్ని షేక్‌ చేశాడు.

Advertisement
Advertisement