ప్రజల కోసం, ప్రజల తరఫున... దీక్ష పూనిన నాయకుడు జగన్ | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం, ప్రజల తరఫున... దీక్ష పూనిన నాయకుడు జగన్

Published Wed, Aug 28 2013 1:15 AM

ప్రజల కోసం, ప్రజల తరఫున... దీక్ష పూనిన నాయకుడు జగన్ - Sakshi

 నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేయడమంటే భగవంతుడి పట్ల విధేయత ప్రకటించడమే. (థామస్ జెఫర్సన్)
  జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో దీక్షకు కూర్చున్నారని విన్న వెంటనే నా మదిలో మెదిలిన వాక్యం ఇది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా, అధర్మంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ చేస్తున్న ఈ నిరాహార దీక్ష నిస్సందేహంగా నిరంకుశత్వంపై తిరుగుబాటే. మానవాళిపై కరుణ, సాటి మనుషులపై ప్రేమ, సమైక్యభావం, న్యాయం కోసం పోరాడే తత్వం ఉన్నవాళ్లు ప్రజానాయకులవుతారు. ఈ గుణాలే ఇవాళ జగన్‌ను నిర్బంధంలో సైతం నిరాహారదీక్షకు ప్రేరేపించాయని నేను నమ్ముతున్నాను.
 
 ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే రాజకీయనాయకులు, సైన్యాధ్యక్షులు... నరహంతక నియంతల వంటివారు. స్వార్థ ప్రయోజనాలను సాధించుకోవడం కోసం వారు అన్ని విలువలకు పాతర వేస్తారు. అధికారాన్ని, ఆధిక్యాన్ని, అనైతికాన్ని ఆయుధాలుగా చేసుకుంటారు. ఇలాంటివాళ్లకు ‘క్రూరపాలకులు’ (టైరెంట్స్) అనే మాట చక్కగా సరిపోతుంది. ‘టైరెనిక్’ అనే విశేషణం 1530లలో వాడుకలోకి వచ్చింది. పద్నాలుగవ శతాబ్దాంతంలో చలామణిలో ఉన్న ‘టైరనీ’ అనే మాట దీనికి మూలం. టైరనీ అంటే ‘క్రౌర్యం లేదా అధికార దుర్నీతి’. గ్రీకు పదమైన ‘టైరనూస్’ నుంచి ‘టిరనీ’ వచ్చింది. టైరనూస్ అంటే ‘మాస్టర్’ అని. ప్రజాస్వామ్య పాలనకు వ్యతిరేకమైనదే టైరనికల్ రూల్. క్రూరపరిపాలన.
 అదే ప్రజాస్వామ్యంలో అయితే అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలదే నిర్ణయాధికారం. అలాంటిది, ప్రజలతో నిమిత్తం లేకుండా  కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న క్రూరమైన (విభజన) నిర్ణయం వల్ల నిన్నమొన్నటి వరకు సంతోషంగా, సుసంప్నంగా విరాజిల్లిన ఆంధ్రప్రదేశ్‌లో అస్థిరత్వం, ఆవేదన చోటుచేసుకున్నాయి.
 
 రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను కూలదోసి, నియంతృత్వాన్ని నెలకొల్పే విధానాలు ఎలా ఉంటాయో తెలిసిందే. నిరంకుశత్వంలో చర్చలు, సంప్రదింపులు ఉండవు. మిగతావాళ్లను బుద్ధిహీనులను చేసినట్లే నిరంకుశులు తమకు తాము బుద్ధిహీనులుగా ప్రవర్తించగలరు. జగన్‌లో నిలువెత్తు ప్రజానాయకుడిని చూడలేని బుద్ధిహీనత కాంగ్రెస్ కళ్లను  కమ్మేసింది. ఆంధ్రప్రదేశ్ తన ప్రియతమ నాయకుడైన డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డిని కోల్పోయిన నేపథ్యంలో, గత మూడేళ్లుగా ఆ మహానేత తనయుడు, ఆ కుటుంబ సభ్యులు - అసంఖ్యాకంగా వేధింపులను తట్టుకుంటూనే - ప్రజలకు అండగా నిలబడిన సత్యాన్ని ఈ బుద్ధిహీన నిరంకుశ కాంగ్రెస్ గ్రహించలేకపోయింది.
 
 ‘అమెరికాసంయుక్తరాష్ట్రాల స్వేచ్ఛా ప్రకటన’ రచయిత, ప్రజాస్వామ్య పితామహుడు థామస్ జెఫర్సన్ ఒకచోట... ‘‘రాబోయే తరాల అమెరికన్ల సంతోషాన్ని నేను ఊహించగలను. వారు గనుక ప్రజాసంరక్షణ పేరిట ప్రభుత్వం ప్రజల కష్టాన్ని దుబారా చేయడాన్ని  నివారించుకోగలిగితే’’ అంటారు. జగన్‌మోహన్‌రెడ్డి తన కారాగార నిరాహార  దీక్ష ద్వారా సరిగ్గా ఇదే పని చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రజల సంతోషం కోసం, వారి సంక్షేమం కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో... ప్రజలను ఉద్ధరిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తూ, అధికారాన్ని నిలుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌పార్టీని ఆయన ఎండగడుతున్నారు. దేవుడు జగన్‌తో ఉన్నాడని నా ప్రగాఢ నమ్మకం. ప్రస్తుతం జరుగుతున్న ఈ న్యాయపోరాటంలో అంతిమ విజయం జగన్‌దే అవుతుంది. జగన్ విజయం అంటే అది ప్రజల విజయం. జరుగుతున్నదేమిటో, జరగబోయేదేమిటో తెలియని అయోమయంలో ఉన్న కోట్లాదిమంది రాష్ట్ర ప్రజల హృదయాలకు అయిన గాయాలను మాన్పే విజయం అది.
 - బి.దుష్యంత్, హైదరాబాద్
 

Advertisement
Advertisement