పేదల పక్షపాతి | Sakshi
Sakshi News home page

పేదల పక్షపాతి

Published Sat, Jul 8 2017 12:57 AM

పేదల పక్షపాతి - Sakshi

విజ్ఞానం డబ్బు సంపాదనకు కాదు, ప్రజల సేవ కోసమే అని నమ్మేవారాయన. డాక్టర్లకు ఏ ముఖ్యమంత్రీ చేయనంత సాయం వైఎస్‌ఆర్‌ చేశారనడానికి డాక్టర్‌ హనుమంత రాయుడు గారి ఉదంతమే గొప్ప ఉదాహరణ. సర్వీసులో ఉండగా పై చదువులు చదవాలంటే ఆ సమయంలో కూడా జీతం వచ్చే ఏర్పాటు చేశారు. సూపర్‌ స్పెషలిస్ట్‌ అయిన తర్వాత సౌదీకి వెళ్ళాలని, ఎన్‌ఓసి ఇప్పించమని వైయస్‌ గారిని అడిగారాయన.

అప్పుడు వైఎస్‌... ‘ఆ రోజు మీరు పై చదువులు చదవడానికి ప్రభుత్వంతో పోట్లాడి మీకు జీతం వచ్చేట్లు చేశాను. సూపర్‌ స్పెషలిస్ట్‌లైన తర్వాత డబ్బుకోసం విదేశాలకు వెళితే ఇక్కడ ప్రజలు ఏం కావాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ రికమెండ్‌ చెయ్యను’ అని నిర్మొహమాటంగా చెప్పారు... అని హనుమంత రాయుడు ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.


కష్టంలో ఉన్న వారికి కొండంత అండ
వైఎస్‌కు ముందున్న పాలకులెవ్వరూ సఫాయి, చర్మకారుల, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం పట్టించుకున్న పాపాన పోలేదు. వారి సేవలు ప్రతిరోజూ కావాలి, కానీ... జీతాలు మాత్రం నాలుగునెలలకొకసారి ఇచ్చేవాళ్లు. తరతరాలుగా వివక్షకు లోనవుతూన్న పారిశుద్ధ్య కార్మికుల బాధలను ఆయన క్షణాల్లో అర్థం చేసుకున్నారు. వారు వైఎస్‌ను కలిసి విషయం చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే వారికీ ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ఆదేశాలిచ్చారు. అప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ చేయని పని ఆయన చేశారు.

నమ్మిన వారికి వెన్నుదన్ను
ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యకర్త ఇల్లు ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిపోయింది. అప్పటి టిడిపి ప్రభుత్వం సహాయం చేయలేదు. ఆ కార్యకర్త వైఎస్‌ఆర్‌ని కలవడానికి కూడా శక్తిలేని నిస్సహాయ స్థితిలో హైదరాబాద్‌లో ఉన్న కొడుక్కు ఫోన్‌చేసి ‘ఓసారి ఆయన్ను కలిస్తే ఏదో ఒక దారి చూపిస్తాడు’ అని చెప్పి పంపాడు. ఆ కుర్రాడు భయభయంగా ‘మా నాన్న...’ అంటూ పేరు చెప్పగానే ‘‘ఏం కావాలి? ఉద్యోగం కోసం వచ్చావా? నాన్న బాగున్నాడా’’ అని ఆ కుర్రాడిని దగ్గరకు తీసుకున్నారు. ఇల్లు కాలిన సంగతి తెలిసి వెంటనే కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు లెటర్‌లు రాయించి ‘‘నేనున్నానని నాన్నకు చెప్పు. నువ్వు బాగా చదువుకో’’ అని పంపించారు. రెండు వారాల్లో ఆ కుటుంబానికి బెనిఫిట్‌ అందింది. అప్పుడాయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఒక నిస్సహాయుడికి అండగా నిలిచారు.

వైఎస్‌ అంటే ఆర్ద్రత
ఎదుటి వాళ్ల కష్టాలకు వైఎస్‌ఆర్‌ కదిలిపోయేవారు. అది 2004, రైతులకు ఉచిత కరెంటు ఇస్తానని ప్రకటించిన నేపథ్యం. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనాన్ని రైతుల కోసం విరాళంగా ఇవ్వడానికి వైఎస్‌ను ఆయన పేషీలో కలిశారు. అప్పటికి ఎవరో తల్లీకూతుళ్లు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. బిడ్డను అల్లుడు కష్టపెడుతున్న వైనాన్ని ఆ తల్లి చెబుతుంటే వైఎస్‌ కళ్లు చెమర్చాయి. రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి అంటే ఎంత కరకుగా ఉంటారో అనుకోవడం సహజం. ఆయన కన్నీళ్లు చూసి ఆశ్చర్యపోవడం ఉద్యోగుల వంతైంది. ఆ సంఘటన ఉద్యోగుల మధ్య తరచూ చర్చకు వచ్చేది కూడా.

కార్మికులకు రక్షణ
భవన నిర్మాణ రంగ కార్మికులు 2006, అక్టోబర్‌లో వైఎస్‌గారిని కలిసి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. ‘‘చట్టంలో ఏమున్నదో పరిశీలించి తప్పక సహాయం చేస్తాను’’ అని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే భవననిర్మాణ కార్మికుల చట్టాన్ని కొద్దిరోజుల్లోనే అమలు చేసి చూపించారు. ఆ తర్వాత ఏడాది విశాఖలో మేడే ఉత్సవాల్లో ప్రసంగిస్తూ, ‘బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ బోర్డు’ను ఏర్పాటు చేసి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయం లక్షలాది కార్మికులకు మేలు చేసింది. అసంఘటితంగా ఉన్న కార్మికులను చట్టం అనే గొడుగు కిందకు చేర్చి రక్షణ కల్పించారాయన. అందరికీ గుర్తింపు కార్డులివ్వాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఇళ్లు కట్టి అందరికీ రక్షణ కల్పించే వారి అభద్రతను తొలగించి చట్టం అనే రక్షణ గొడుగు పట్టారాయన.

Advertisement
Advertisement