ఏది రాయను? ఏది మానను? | Sakshi
Sakshi News home page

ఏది రాయను? ఏది మానను?

Published Fri, Sep 2 2016 2:35 PM

ఏది రాయను? ఏది మానను? - Sakshi

రాయడం మొదలెట్టాను. అంతే... వై.యస్.గారి సుగుణాలన్నీ ఠక్కున లేచి గట్టిగా ‘గుడ్‌మార్నింగ్!’ అని విష్ చేశాయి. క్లాస్‌రూమ్‌లో గుడ్ పిల్లల్లా... చక్కగా తల దువ్వుకుని, బూట్లు, ఫ్రాకులు, రిబ్బన్లు, నిక్కర్లు, ఇస్త్రీ చేసిన తెల్లటి చొక్కాలతో...
 ముందు నేనంటే నేను అని చేతులెత్తి అడుగుతున్నాయి...
 నా గురించంటే నా గురించి రాయమని!
 ఎవర్ని కాదనాలి? ఎవర్ని ఎంచుకోవాలి?
 ముందు ‘ప్రేమ’ చెయ్యెత్తి అడిగింది... ‘నన్ను రాయి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన దాన్ని నేనే కదా’ అని.
 ‘సహనం’ చెయ్యి ఇంకా సాగదీసి... ‘కాదు కాదు... నా గురించి రాయి. పరీక్షించే వాళ్లనూ ప్రేమించే గుణాన్ని కనుక ముందు నా గురించే రాయాలి’ అని మారాం చేసింది.
 ‘అభిమానం’ గెంతులేస్తూ వచ్చింది... ‘నన్ను ప్రేమించినా, ద్వేషించినా పర్వాలేదు. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నా అన్న వై.ఎస్.ఆర్. గుణం నేను. నా గురించి రాయవయ్యా’ అని కుడిచేతిపై ఎడమ చేత్తో తాళం వేస్తూ అడిగింది అభిమానం.
 అందర్నీ నెట్టుకుంటూ ఈ సకలగుణ సమ్మేళనాన్ని... సముద్రాన్ని చీల్చినట్లు చీల్చుకుంటూ ముందుకొచ్చి ‘అవసరమైతే నా ప్రాణాన్నైనా అడ్డు వేసి నీ కోరిక తీరుస్తాను అన్న గుణం నేను. నా పేరు ‘అభయం’. నా గురించి రాయకపోతే వై.ఎస్.ఆర్. సార్ గురించి రాయనట్టే కదా’ అని సవాల్ విసిరింది.
 ‘చల్... నేను లేకపోతే ఎండా వాన, నొప్పీబాధ... ప్రతి అడుగులో ఎలా భరించారు మన సారు! నా గురించి రాయకపోతే రాసేవాణ్ణందరూ పిరికోడు అంటారు’ అని నన్ను భయపెట్టింది ‘ధైర్యం’.
 ‘భలే చెప్పొచ్చావ్‌లే. ప్రేమ, అభిమానం, సహనం, అభయం, ధైర్యం.. అన్నిటికీ మూలం కరుణ. నేను చేస్తున్నది నా కోసం కాదు. పరుల కోసం అనుకునే గుణం నేను. అందుకే కరుణతో పని చేసే వై.ఎస్.ఆర్.కి దేవుని ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉన్నాయి. నా గురించి రాయకపోయినా పర్వాలేదు. అందరికీ అవకాశం ఇవ్వండి’ అని విన్నవించింది ‘కరుణ’.
 ‘కులం, మతం, రంగు, రూపు, వర్గం చూడని స్వచ్ఛమైన గుణం నేను. నేను సార్‌కి అతి ప్రేమపాత్రురాలిని కాబట్టి అందరూ గుండెల్లో సార్‌కి గుడి కట్టారు’ అంది ఉప్పొంగే హృదయంతో ‘స్నేహం’.
 ‘మరి నేను?’ అని నవ్వింది ‘నవ్వు’.
 ‘మనసులో ఉన్నది అందరికీ అర్థం కాదు. అన్ని గొప్ప గొప్ప గుణాలు దాగి ఉండిపోతే వ్యర్థం కాదూ? మీ అందరికీ ప్రతిరూపాన్ని నేనేగా!’ అని తల ఎగరేసింది నవ్వు.
 ఇలా ఒకటినొకటి సవాల్ చేస్తూ నా కలంకేసి చూశాయి.. వై.ఎస్.ఆర్.లోని ఈ గుడ్ గుణాలన్నీ.
 ఇన్ని గొప్ప గుణాలు! అన్నిటినీ ఎలా చెప్పాలి?
 ఎంచుకోవడం ఎంత కష్టమో... గుణాన్ని పంచుకోవడం కూడా అంతే కష్టమనిపించింది. రాసిన గుణానికి ఎలాగూ న్యాయం చేయలేను. రాయని గుణానికి అన్యాయం చేసినవాణ్ణి కూడా అవుతాను.
 నిస్సహాయంగా కలం కింద పెట్టేశాను.
 కళ్లు మూసుకుని, ఒక్కసారి... వై.ఎస్.ఆర్. దివ్యమోహన రూపాన్ని తలచుకున్నాను.
 ప్రత్యక్షమయ్యారు!
 ‘ఏది రాయను? ఏది మానను?’ అని వినమ్రంగా అడిగాను.
 ఎప్పట్లాగే భుజంపై మెత్తగా తట్టి, చేతి గడియారం చూసుకుంటూ...  ‘పద పద... ఇంకా చాలా పని ఉంది’ అన్నారు!
- రామ్
ఎడిటర్, ఫీచర్స్

Advertisement

తప్పక చదవండి

Advertisement