కదలికే కళారూపం

9 Jul, 2014 01:14 IST|Sakshi
కదలికే కళారూపం

కదలికే కళారూపం... ఔను! ఆమె మదిలోని ప్రతి     కదలికా కళారూపమే. ప్రజల కన్నీళ్లు, కేరింతలు,   ఆవేదనలు, హర్షాతిరేకాలు ఆమెను కదిలిస్తాయి. అలాంటప్పుడే ఆమె కుంచె చేతపట్టుకుంటారు. అంతే! ఒక కళాఖండం రూపుదిద్దుకుంటుంది. అలా     రూపుదిద్దుకున్న కళాఖండమే ‘గివింగ్ బర్త్ టు మీ’. ఈ  చిత్తరువుతోనే రమాదేవికి పేరు వచ్చింది.             చిత్తరువంటే, ఇది చిత్తరువు మాత్రమే కాదు,       కళాకారిణిగా నిలదొక్కుకోవడానికి ఏళ్ల తరబడి ఆమె పడిన శ్రమ ఫలితం. కడుపులోని బిడ్డ అడ్డం తిరిగి, కాళ్లు బయటకు వచ్చి, బాహ్య ప్రపంచంలోకి రావడానికి పడే జీవన్మరణ పోరాట రూపమే ఈ కళాఖండం. ఈ చిత్రంలోని చెట్టు తల్లి గర్భానికి సంకేతం. కనిపిస్తున్న పాదాలు కడుపులో అడ్డం తిరిగిన బిడ్డవి.
 
 నిజాం నాటి వారసత్వం...

 బతుకు తెరువు కోసం టీచర్‌గా పనిచేస్తున్న రమాదేవి వృత్తిపరంగా కళాకారిణి. పాతబస్తీ దూద్‌బౌలికి చెందిన ఆమె, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటోంది. కళ ఆమెకు తాతముత్తాతల నుంచి అబ్బిన వారసత్వం. రమాదేవి తాతముత్తాతలంతా నిజాం ప్రభువుల వద్ద పనిచేసిన వారు. వారిది ‘నఖాషి’ (బొమ్మలు చెక్కడం) కులం. నిర్మల్ పెయింటింగ్స్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చింది వారే. స్వతహాగా కళాప్రియులైన నిజాం ప్రభువులు వివిధ దేశాల్లో తాము చూసిన డిజైన్లను రాజమహల్‌కు, వస్తువులకు వేయించేందుకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని కళాకారుల కుటుంబాలను హైదరాబాద్ రప్పించారు. అప్పటి నుంచి ఆ కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డాయి.
 
 ఒకప్పుడు గోడలపైనే...
నిర్మల్ పెయింటింగ్స్ ఒకప్పుడు గోడలపైనే వేసేవారు. స్వాతంత్య్రం తర్వాత నిజాం ప్రభువుల అధికారం పోయాక ఈ పెయింటింగ్స్ చీరలపైకి పాకాయి. రమాదేవి తండ్రి ఇప్పటికీ తాను పెయింటింగ్ చేసిన చీరలను ‘లేపాక్షి’ సంస్థకు ఇస్తుంటారు. చీరలపై పెయింటింగ్స్ వేయడంలో చిన్నప్పటి నుంచి తండ్రికి చేదోడుగా ఉన్న రమాదేవి క్రమంగా కళపై ఆసక్తి పెంచుకుంది. పాతబస్తీలో చిత్రలేఖనం నేర్పే ప్రముఖ ఆర్టిస్ట్ డోంగ్రే వద్ద ల్యాండ్‌స్కేప్, స్టిల్‌లైఫ్ చిత్రాలు గీయడంలో మెలకువలు నేర్చుకుంది. తర్వాత జేఎన్‌టీయూలో బీఎఫ్‌ఏ పూర్తి చేసింది. అదయ్యాక ఎంఎఫ్‌ఏలో చేరడానికి ఇంట్లో వాళ్లు వ్యతిరేకించారు. వాళ్లకు తెలియకుండా ఎంఎఫ్‌ఏ సీటు సంపాదించి, ఇంట్లో చెప్పింది. ఇక చేరమనక వారికి తప్పలేదు. అలా ఎంఎఫ్‌ఏ పూర్తి చేసింది. పర్యావరణ రక్షణపై పలు ఫొటోలు తీసింది. మహిళల సమస్యలపై లెక్కలేనన్ని బొమ్మలు గీసింది.
- తాయమ్మ కరుణ

మరిన్ని వార్తలు