మంటగలిసిన సభా గౌరవం | Sakshi
Sakshi News home page

మంటగలిసిన సభా గౌరవం

Published Mon, Dec 16 2013 11:35 AM

మంటగలిసిన సభా గౌరవం - Sakshi

అసెంబ్లీ మరోసారి తన గౌరవాన్ని కోల్పోయింది. గౌరవ సభ్యులు అంటూ సంబోధించుకునేవాళ్లలో పలువురు దారుణంగా ప్రవర్తించారు. ఇంకా రాష్ట్రం సమైక్యంగా ఉండగానే.. తోటి సభ్యుల స్వేచ్ఛను అడ్డుకోడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. తెలంగాణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్లో మాట్లాడే సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు వారిని అడ్డుకోడానికి మీదమీదకు దూసుకొచ్చారు.

చివరకు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడికి ప్రయత్నించారు. కనీసం మీడియా పాయింట్లో కూడా మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వకుండా అత్యంత హీనంగా ప్రవర్తించారు. గండ్రను నలుగురైదుగురు పోలీసులు కలిసి వెనక్కి లాగేందుకు ప్రయత్నించినా ఆయన ఏమాత్రం ఆగకుండా ముందుముందుకు వెళ్లారు. చివరకు అక్కడ ఎవరు సభ్యులో, ఎవరు కాదో కూడా తెలియని పరిస్థితుల్లో దాడులు జరిగాయి.

గతంలో కూడా లోక్సత్తా పార్టీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్పై పలువురు దాడిచేసి ఆయన చొక్కా చించే ప్రయత్నం కూడా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని ఆయన మీడియా పాయింట్లో ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు హరీష్ రావు కారు డ్రైవర్ జేపీపై దాడి చేశారు. దాని మీద కొన్నాళ్లు హడావుడి చేసి, చివరకు తూతూమంత్రంగా వదిలేశారు. సాక్షాత్తు సభ్యులే తోటి సభ్యులపై దాడులు చేసే పరిస్థితి ఉన్నా కూడా దాన్ని అదుపు చేయలేకపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు.

Advertisement
Advertisement