భవ్యశ్రీ ఎక్కడికి వెళ్లింది? | Sakshi
Sakshi News home page

భవ్యశ్రీ ఎక్కడికి వెళ్లింది?

Published Mon, Oct 13 2014 11:23 AM

భవ్యశ్రీ - Sakshi

హైదరాబాద్కు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ  అదృశ్యమైందని ఆందోళన చెందారు. కిడ్నాప్ చేశారమో అని భయపడ్డారు. మూడు రోజుల పాటు ఒకటే గందరగోళం. ఆమె కోసం పోలీసు బృందాలు వేట. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో మీడియా కూడా తగిన స్థాయిలో స్పందించింది.  చివరికి అంతా ఉత్తిదే అని తేలి పోయింది. మీస్సూ కాదు, కిడ్నాప్ అంతకంటే కాదు. భవ్యశ్రీ తనంతట తనే వెళ్లిపోయినట్లు చెప్పారు. అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు, మరో వైపు మీడియా, ఒకో వైపు ప్రజలు ఉత్కంఠగా భవ్యశ్రీకి ఏమైందోనని ఆందోళన చెందుతున్న  సమయంలో  ఒత్తిడి భరించలేక, కాస్త రిలీఫ్ కోసం విశాఖ వెళ్లినట్లు ఆమె చల్లగా చెప్పారు.   

 ఆఫీసుకంటూ బయల్దేరి కనిపించకుండాపోయిన భవ్యశ్రీని పోలీసులు క్షేమంగా తీసుకువచ్చారు. ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు భవ్యశ్రీ క్షేమంగా తిరిగిరావడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.సంతోషం. ఇంతకూ భవ్యశ్రీ ఎక్కడికి వెళ్లింది? పోలీసులు ఆమెను ఎక్కడ పట్టుకున్నారు? ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన భవ్యశ్రీ  వైజాగ్‌ ఎందుకు వెళ్లారు?
మూడు రోజుల పాటు మీడియా కోడై కూస్తుంటే ఆమె స్పందించకపోవడానికి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు.

విజయవాడకు చెందిన మధు, హరిచందనల కుమార్తె భవ్యశ్రీ చరిత  హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు.  రెండేళ్ల క్రితం మరో సాప్ట్వేర్ ఇంజినీర్ కార్తికేయ చైతన్యను ప్రేమవివాహం చేసుకుంది. చైతన్య- భవ్యశ్రీ దంపతులు కేపీహెచ్‌బీ కాలనీలోనివాసం ఉంటున్నారు. ఈ నెల 9 గురువారం ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళ్తున్నానంటూ భవ్యశ్రీ ఇంట్లో చెప్పి బయల్దేరింది. కంపెనీ క్యాబ్ రాలేదని,  ప్రైవేట్ క్యాబ్‌లో వెళ్తున్నానని భర్త చైతన్యకు మెసేజ్ పంపింది. గంట తరువాత ఆఫీసుకు చేరుకున్నావా? అని చైతన్య భవ్యశ్రీకి మెసేజ్ చేస్తే ఆమె నుంచి రిప్లై రాలేదు.

గురువారం రాత్రి 7 గంటలకు డ్యూటీ ముగించుకొని చైతన్య ఇంటికి వచ్చాడు. అప్పటికీ భవ్యశ్రీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురై ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విఛాఫ్ అని రావడంతో భవ్యశ్రీ పనిచేస్తున్న కంపెనీ వద్దకు వెళ్లి వాకబు చేశాడు. ఆమె అసలు ఆఫీసుకే రాలేదని కంపెనీ ఉద్యోగులు తెలిపారు. ఆ సమాధానం విని చైతన్య నివ్వెర పోయాడు.  బంధువులు, స్నేహితులను ఆరా తీసినా లాభం లేకపోవడంతో అదే రోజు రాత్రి కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


చైతన్య ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు రంగంలోకి దిగారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి భవ్యశ్రీ కోసం గాలింపు చేపట్టారు.  హైదరాబాద్‌లో భవ్యశ్రీ ప్రయాణించిన మార్గంలో సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా ఎక్కడుందో గుర్తించే ప్రయత్నం చేశారు. భవ్యశ్రీ చివరిసారిగా క్యాబ్‌లో ఉన్నాను అంటూ భర్తకు మెసేజ్ చేసింది. ఆ తరువాత 30 నిమిషాలకే ఆమె ఫోన్ స్విఛాఫ్ అయింది. శుక్రవారం సాయంత్రం ఆమె ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్‌టవర్ పరిధిని సూచించడంతో  పోలీసులు అన్నవరంలో అన్ని లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాల్లో తనిఖీ చేశారు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు. ఇక్కడ భవ్యశ్రీ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు కేసును గందరగోళంగా మార్చేశాయి. ప్రైవేటు క్యాబ్‌లో వెళ్తున్నానని భవ్యశ్రీ భర్త చైతన్యకు మెసేజ్ చేసింది. ఐతే భవ్యశ్రీ క్యాబ్‌లో వెళ్లలేదని, షేరింగ్ ఆటోలో వెళ్లిందని భవ్యశ్రీ తల్లిదండ్రులు పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

మూడు రోజుల గాలింపు తర్వాత పోలీసుల ప్రయత్నం ఫలించింది. హైదరాబాద్‌లో మాయమైన భవ్యశ్రీ వైజాగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భవ్యశ్రీ విశాఖ జిల్లా పాడేరు గెస్ట్‌హౌస్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఐతే అక్కడ పోలీసులకు భవ్యశ్రీ చిక్కినట్లే చిక్కి మాయమైంది. గదిలో టీవీ పనిచేస్తూనే ఉన్నా భవ్యశ్రీ మాత్రం కనిపించలేదు. మీడియాలో వస్తున్న కథనాలతో అప్రమత్తమై భవ్యశ్రీ అక్కడ నుంచి మరో చోటుకు వెళ్లినట్లు పసి గట్టిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చివరకు ఆమెను పట్టుకొని హైదరాబాద్ తీసుకొచ్చి ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. వ్యక్తిగత సమస్యల నుంచి రిలీఫ్ పొందేందుకే తాను విశాఖకు వెళ్లానని, అంతేతప్ప భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవని భవ్యశ్రీ  చెప్పారు.  వ్యక్తిగత, కుటుంబ వివరాలను  అనవసరంగా రచ్చకెక్కించారని మీడియాపైనే ఆమె  ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, భవ్యశ్రీకి మధ్య ఎలాంటి వివాదాలు లేవని భర్త కార్తీకేయ చైతన్య చెప్పారు. తన భార్య క్షేమంగా ఇంటికి చేరుకున్నందున ఇంతటితో ఈ కేసును  వదిలేయాలని విజ్ఞప్తి చేశారు.

భవ్యశ్రీ విశాఖ ఎందుకు వెళ్లిందనే ప్రశ్నకు  పోలీసులు సమాధానం దాటవేశారు. భవ్యశ్రీ ఎందుకు వెళ్లిపోయిందో తనకు కూడా తెలీదని భర్త చెప్పారు. మీడియాలో ఒక రోజంతా తన గురించి గందరగోళం చోటుచేసుకున్నా, తన ఆచూకీని భవ్యశ్రీ చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లే భవ్యశ్రీ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు.
**

Advertisement
Advertisement