గాలికే గుబులు... | Sakshi
Sakshi News home page

గాలికే గుబులు...

Published Mon, Sep 29 2014 1:10 AM

గాలికే గుబులు...

వాళ్లు బైక్స్ మీద దూసుకెళ్తుంటే.. ధూమ్ సినిమా ఫ్రీ రివ్యూ చూసినట్టనిపిస్తుంది. హైవేల్లో రయ్‌మంటూ.. గాలికే గుబులు రేపుతారు. హార్లీ డేవిడ్‌సన్ మోటార్ సైకిళ్లు.. వాటి మీద కండలు తిరిగిన మొనగాళ్లు.. వీరి మధ్యన మరో బైక్ మీద ఓ మెరుపుతీగ. ఆమె పేరు అనుశ్రీయ గులాటి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే హిమాలియన్ చాప్టర్ గ్రూప్‌లో ఈమె కూడా ఓ రైడర్. స్వేచ్ఛను ఆస్వాదిస్తూ సాగిపోయే లాంగ్ జర్నీలో అమ్మాయి ఎందుకుంది..? అసలు వీరి ప్రయాణం వెనుక ఉన్న కోణమేంటి..? ఈ వివరాలన్నీ ఇటీవల సదరన్ ఫేజ్ 3 ర్యాలీ కోసం హైదరాబాద్ వచ్చిన హిమాలియన్ చాప్టర్ గ్రూప్ ‘సిటీప్లస్’కు వివరించింది.
 
వేల కిలోమీటర్లు సాగే హిమాలియన్ చాప్టర్ ప్రధాన లక్ష్యం ఒకటే. అదే సేవ్ ద గాళ్. కాస్త డిఫరెంట్ లుకప్‌తో కనిపించినా.. ఇంకాస్త డిఫరెంట్ రూట్ ఎంచుకున్నా వీరి ఉద్దేశం మాత్రం అందరికీ నచ్చేదే. భారతావని ఆ కొస నుంచి ఈ కొస వరకూ వందలాది గ్రామాలు, పట్టణాల మీదుగా వీరి యాత్ర సాగిపోతుంది. వీరు ఆడపిల్లల రక్షణపై అవేర్‌నెస్ కల్పించే పనిని భుజానికెత్తుకుని ఎందరిలోనో మార్పు తీసుకొస్తున్నారు. అందుకే ఈ గ్రూప్‌లో చేరి తనవంతు కృషి చేస్తోంది అనుశ్రీయ. అమ్మాయిలు ఏదైనా చేయగలరని తనను తాను ఉదాహరణగా చూపిస్తూ ముందుకెళ్తోంది ఈ జర్నలిజం విద్యార్థిని.
 
ఇద్దరూ సమానమే..
మన దేశంలో ఆడపిల్లల పట్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మా గ్రూప్‌లో అమ్మాయి వుంది, ఆమెను ఒక మస్కట్‌లా ప్రమోట్ చేస్తూ మంచి విషయాన్ని ప్రమోట్ చేయాలనుకున్నాం. ఆడామగా ఇద్దరూ ముఖ్యమే, ఇద్దరూ సమానమే. ఆడపిల్లలు తక్కువనే ఓల్డ్ మైండ్ సెట్ మారి.. అమ్మాయిలంటే గౌరవం పెరగాలి. అందుకే ఈ కాజ్ ఎంచుకున్నాం.
-కరణ్ చెహెల్
 
గర్వంగా ఉంది..

బైక్ రైడర్స్ అంటే దృఢమైన దేహంతో, స్వేచ్ఛగా తిరుగుతూ ఎంజాయ్ చేసే వాళ్లు మాత్రమే అనే అభిప్రాయం వుంది. వారికి సమాజంలోని సమస్యల గురించి ఆలోచించే సున్నితత్వం లేదని కూడా అనుకుంటారు. అది నిజం కాదని నిరూపించేందుకు గతంలో కూడా ఇలాంటి రైడ్స్ నిర్వహించాం. రైడ్ ఫర్ చారిటీ,  మర్ద్-మెన్ అగెనైస్ట్ రేప్స్ అండ్ డిస్క్రిమినేషన్ రైడ్లు నిర్వహించాం. ఈసారి ఈ 19 ఏళ్ల అమ్మాయితో సేవ్ ద గర్ల్ చైల్డ్ రైడ్ నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా వుంది.

- సంప్రీత్ సింగ్, చండీగఢ్
 
అవేర్‌నెస్ కోసం..

‘మాది డెహ్రాడూన్. 15 ఏళ్ల వయసు నుంచి బైక్ రైడ్ చేయడం మొదలు పెట్టాను. అప్పట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేసేదాన్ని. 2014లో నా పుట్టిన రోజుకు మా మామయ్య హార్లీ డేవిడ్‌సన్ బైక్ ప్రజెంట్ చేశారు. మా అంకుల్ ప్రోత్సాహంతో ఈ గ్రూప్‌లో చేరాను. మేమంతా ఈ పెద్దబండ్ల మీదే వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటాం. ఎన్నో ఊళ్ల మీదుగా వెళ్తుంటాం. అలాంటప్పుడు మా ప్రయాణం పదిమందికి ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. సిటీల్లో సేవ్ ద గాళ్ చైల్డ్ గురించి అవేర్‌నెస్ బాగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆడబిడ్డల విషయంలో మరింత అవగాహన రావాల్సి ఉంది. ఆడపిల్ల పుట్టిందని చిన్నతనంలోనే చిన్నారుల ప్రాణాలు తీసిన సంఘటనలు మమ్మల్ని కదిలించాయి. భ్రూణహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి మా రైడింగ్‌ను వేదికగా మలచుకున్నాం’ అని తెలిపింది అనుశ్రీయ.
 
ఇద్దరూ సమానం..
ఆడశిశువు రక్షణ కోసం మొదలైన ఈ రైడ్ ఇప్పటికే ఎన్నో గ్రామాలు చుట్టేసింది. ‘గ్రామాల్లో పెద్ద బండ్లను చూడగానే చాలా మంది మా దగ్గరికి వారంతట వారే వచ్చేస్తారు. మొదట మొహమాటపడ్డా.. తర్వాత మాతో కలసిపోతారు. చిన్నపిల్లలైతే మాతో ఫొటోలు కూడా దిగుతారు. వాళ్లతో ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత వారితో ఓ ఐదు నిమిషాలు మాట్లాడుతాం. ఆడపిల్లలను సేవ్ చేయమని చెబుతాం. అమ్మాయిలను కాపాడుకోవడం ఎంత అవసరమో, అమ్మాయిలకు అవకాశం ఇస్తే ఎన్ని అద్భుతాలు చేయగలరో ఉదాహరణలతో వివరిస్తాం. వారి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఒక ఊళ్లో మా మాటలు విన్న తర్వాత ఓ తల్లి తన పాపని ముద్దాడి కంటతడి పెట్టుకుంది’ అని అవేర్‌నెస్ రైడ్ విశేషాలు తెలిపింది అనుశ్రీయ.

Advertisement
Advertisement