అదరగొట్టారు | Sakshi
Sakshi News home page

అదరగొట్టారు

Published Tue, Apr 7 2015 11:23 PM

అదరగొట్టారు

స్కూలు ఫంక్షన్స్‌లో పిల్లలు ప్రదర్శనలు ఇవ్వటం మాములే.

అలా ఓ స్కూల్లో వేసిన నాటకంలో వాళ్ల ఇన్వాల్వ్‌మెంట్, టాలెంట్ చూసి ముచ్చట పడిన యాజమాన్యం.. మరోసారి పెద్దల కోసమంటూ లామకాన్‌లో వీళ్లతో ఓ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసింది. 20 మందికి పైగా పిల్లలు ఎలాంటి తడబాటు లేకుండా డైలాగులు, చక్కటి
 హావభావాలతో మురిపించారు. కామెడీ, సెటైర్, చక్కటి భాష కలిసిన ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకం ఆహూతులను ఆకట్టుకుంది.
 
 షేక్‌స్పియర్ రాసిన నాటకాలు అర్థం చేసుకోవటమే కష్టం. అలాంటిది ఆ నాటకాన్ని అలవోకగా ప్రదర్శించడం మహామహా నటులకే సాధ్యమయ్యే పని. అంతటి క్లిష్టమైన నాటకాన్ని సులభంగా అర్థం చేసుకోవడమే కాదు... అనుభవమున్న నటుల్లా ఆయా పాత్రల్లో జీవించారు చిన్నారులు. నగరంలోని శ్లోక పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు షేక్‌స్పియర్ ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకాన్ని నవరస రంజితంగా ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ఒరిజినల్‌లో వున్న క్యారెక్టర్‌లు, కథనం అలాగే ఉన్నాయి. సంభాషణలు మోడరన్ డేస్‌కి అనువుగా మార్చి, కాంటెపరరీగా మలిచిన ఈ నాటకం  అబ్బురపరిచింది.

ఊహించని మలుపులు..

షేక్‌స్పియర్ నాటకం విషయానికి వస్తే.. ‘ఫ్రెడరిక్ తన అన్న డ్యూక్ ఆస్తిని ఆక్రమించుకుని అతన్ని తరిమేస్తాడు. కానీ అతని కూతురు రోజాలిండ్‌ని మాత్రం తన కూతురు సిలియా కోసం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చూసీ చూడగానే రోజాలిండ్ ప్రేమలో పడతాడు పరదేశ యువరాజు ఆర్నాల్డో. అతని అన్న ఆలివర్. రోజాలిండ్ ప్రేమ విషయం తెలిసి ఫ్రెడరిక్ కోపగించుకొని దండించబోతాడు. తట్టుకోలేక రోజాలిండ్ అబ్బాయిగా, సిలియా ఎలీనాగా వేషం వేసుకుని ఇంటి నుంచి పారిపోతారు. మారువేషాల్లో వున్న ఎలీనాతో అలివర్ ప్రేమలో పడతాడు. మగవేషంలో ఉన్న రోజాలిండ్ ఆర్నాల్డోని కలుస్తుంది. ప్రేమకోసం తపిస్తూ అతను రాస్తున్న కవితలు చదివి, ఆ ప్రేమను మరిచిపొమ్మని చెబుతుంది. మరోవైపు రోజాలిండ్‌ని అబ్బాయి అనుకుని ఫేబ్ అనే అమ్మాయి ఆమెను ప్రేమిస్తుంది. ఇలా ఒక ప్రేమ జంటతో మొదలైన కథలోకి నాలుగు జంటలు వస్తాయి. చివరికి సుఖాంతమవుతుంది. అయితే మధ్యలో వచ్చే అనేక పాత్రలు, ఊహించని మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రపంచం నేటికి చెప్పుకునే ‘జీవితం ఒక రంగస్థలం లాంటిది, అందులో మనమందరం పాత్రధారులం’  డైలాగ్స్ ఈ నాటకంలోనివే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement