సర్వేలు చూసి కాంగ్రెస్కు గుండె దడ!! | Sakshi
Sakshi News home page

సర్వేలు చూసి కాంగ్రెస్కు గుండె దడ!!

Published Thu, Feb 27 2014 10:45 AM

సర్వేలు చూసి కాంగ్రెస్కు గుండె దడ!! - Sakshi

రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి వివిధ వార్తా సంస్థలు, సర్వే సంస్థలు వెల్లడిస్తున్న అంకెలు చూస్తుంటే కాంగ్రెస్ నాయకులకు గుండెల్లో గుబులు పుడుతోంది. ఇటీవలే ఏబీపీ- నీల్సన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ఇంతకుముందెన్నడూ లేనంత దారుణంగా 73 సీట్లు మాత్రమే వస్తాయని తేలిపోయింది. రెండంకెలకు కాంగ్రెస్ పరిమితం అయితే.. ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత నీచమైన పరిస్థితి అవుతుంది. దీంతో కాంగ్రెస్ పెద్దలకు భయం పట్టుకుంది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని.. ఆ పార్టీకి 217 సీట్లు వస్తాయని.. మొత్తం ఎన్డీఏకు 236 ఎంపీ సీట్లు దక్కుతాయని సర్వే తేల్చిచెప్పింది. జనవరిలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వే నాటి కంటే ఇప్పుడు ఎన్డీఏకు పది సీట్లు పెరిగాయి. తొలిసారి లోక్సభ బరిలో దిగబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పది సీట్లు దక్కించుకోబోతోంది. కాంగ్రెస్కు దక్కే కొద్దిపాటి సీట్లు కూడా దక్షిణ భారతంలో తప్ప ఉత్తరాదిన ఏమాత్రం అవకాశం లేదని సర్వే నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రధాని మంత్రి అభ్యర్థిగా మోడీకి 57 శాతం మంది మద్దతు పలకగా, కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీకి కేవలం 18 శాతం మంది మాత్రమే దన్నుగా ఉన్నారు.

ఈ వివరాలన్నీ చూసి, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కొత్త పల్లవి అందుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలను వివిధ వార్తా చానళ్లు, సర్వే సంస్థలు మార్చేస్తున్నాయంటూ ఈమధ్య ఓ అనామక చానల్ తాను స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు చెప్పడంతో.. దాన్ని పట్టుకుని, సర్వేలను నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. సదరు చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ నిజంగానే నిజమైతే.. సర్వేల ఫలితాలు కొనేసేవే అయితే ప్రజాస్వామ్యానికి అవి శరాఘాతం లాంటివని, అందువల్ల ఎన్నికల కమిషన్ ఈ విషయంలో కఠినచర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో, ముందునుంచి ఇలా చెబుతుంటే ప్రజల ఆలోచనా విధానం కూడా మారుతుందని, అందుకే సర్వేల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

దీన్ని బట్టి చూస్తే.. సర్వే ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కళ్లు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం సర్వే ఫలితాల మీద సంతోషంగానే కనపడుతోంది. వీటిమీద నిషేధం విధిస్తే మాట్లాడే హక్కు, భావప్రకటన హక్కు అనే ప్రాథమిక హక్కులను హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.

Advertisement
Advertisement