Sakshi News home page

ఎవరి స్టైల్ వారిదే!

Published Sat, Feb 22 2014 4:08 PM

ఎవరి స్టైల్ వారిదే! - Sakshi

ఎక్కడలేని సెంటిమెంట్లన్నీ సినిమా రంగంలో ఉంటాయి. హీరో,హీరోయిన్ కాంబినేషన్- హీరో, దర్శకుడు కాంబినేషన్ - హీరో, నిర్మాత కాంబినేషన్- దర్శకుడు, సంగీత దర్శకుడు కాంబినేషన్ - సినిమా విడుదల నెల, తేదీ, వారం, పండుగలు.. ఇలా అనేక రకాల సెంటిమెంట్లు ఉంటాయి. మూవీ మొఘల్  రామానాయుడు గతంలో సురేష్ మూవీస్ వారి ప్రతి చిత్రంలో ఏదోఒక పాత్రలో తప్పనిసరిగా కనిపించేవారు. ఇక డైరెక్టర్స్ విషయానికి వస్తే  ఒక్కో డైరెక్టర్ది ఒక్కో స్టైల్. చిత్ర నిర్మాణంలోనే కాకుండా వేషధారణ, భాహ్యారూపంలోనూ ఎవరి ప్రత్యేక వారికి ఉంది. కొంతమంది డైరెక్టర్లు తలకో, చేతులకో కర్చీఫ్లు కట్టుకుంటారు. కొంతమంది తలకు పెట్టిన క్యాప్ తీయరు. కొంతమందికి గడ్డం పెంచడం అలవాటు. దర్శకుడు విశ్వనాధ్కు ఖాకీ డ్రెస్ వేసుకోవడం అలవాటు.

‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా షూటింగ్‌ దగ్గర నుంచి ప్రముఖ దర్శకుడు  కోడి రామకృష్ణకు తలకు చేతి రుమాలో, టర్కీటవలో కట్టుకోవడం అలవాటైపోయింది. వాస్తవానికి మొదట ఆయన ఎండవేడిమి నుంచి రక్షణ కోసం కట్టుకున్నారు. ఆ తరువాత  అది ఆయనకు  అలవాటైపోయింది. సెంటిమెంట్గా  మారిపోయింది.

ఇక గడ్డాలు పెంచే దర్శకుల జాబితా చాలా పెద్దదే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, సుకుమార్, తేజ ... ఇలా అనేక మందికి గడ్డం పెంచడం అలవాటైపోయింది. ఆ తరువాత అదే సెంటిమెంట్గా మారిపోయింది.  ‘స్వయంవరం’ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ) మాటల రచయితగా సినీరంగంలోకి ప్రవేశించి, ఆ తరువా మాటల మాత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు.  దర్శకుడిగా తన ప్రయాణం నువ్వే-నువ్వే సినిమాతో మొదలుపెట్టి  అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది?  వంటి చిత్రాలతో విశ్వరూపం చూపారు. ఆయన పేరు చెబితే  ముందు ఆయన గెటప్ గుర్తుకువస్తుంది. ఎప్పుడూ ఆయన గడ్డంతోనే కనిపిస్తుంటారు.  షూటింగ్ టైంలో మరీ ఎక్కువగా గడ్డం పెంచేస్తుంటారు. సినిమా పూర్తి అయిన తరువాత మాత్రం ఆయన తన గడ్డం మొత్తం తీసివేస్తారు. ఆ రకంగా ఆయనకు హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకోవడం అలవాటనుకుంటా.  

మగధీరుడు, ఈగ వంటి చిత్రాల ద్వారా అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరిపోయిన  రాజమౌళి కూడా ఎప్పుడూ గడ్డం పెంచుకునే కనిపిస్తుంటారు. ఇప్పుడు ఆయన  బాహుబలి సినిమా షూటింగ్ పనిలో ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న  బాహుబలి చిత్రం నిర్మాణంలో ఆయన  ఇప్పుడు ఫుల్గా గడ్డం పెంచేశారు. ఇక మరో డైరెక్టర్ సుకుమార్ కూడా ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తూ ఉంటారు. ఆయన కూడా షూటింగ్ పూర్తి అయితే గానీ గడ్డాన్ని తీయరు.  ఈ గడ్డం కథాకమామిషలో వీరు గడ్డం తీసివేయటానికి సమయం లేక అలా పెంచేస్తుంటారా? లేక సెంటిమెంటా? చాలా మంది దానిని సెంటిమెంటనే చెబుతుంటారు.

Advertisement
Advertisement