వెలుగు నింపాలి.. కాలుష్యం కాదు

22 Oct, 2019 14:45 IST|Sakshi

పండుగలు ఏవైనా అందరం సంతోషంగా జరుపుకోవాలి. పర్యావరణాన్ని కాపాడాలి . ప్రకృతితో మమేకమైన మన జీవన సౌందర్యాన్ని సంతోషంగా ఆస్వాదించాలి. కానీ రోజు రోజుకీ మనం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాం. పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది. ఆనందం కోసం పటాసులు పేలుస్తూ.. పర్యావరణానికి హాని చేస్తున్నాం. దీపావళి పండగ అంటే వెలుగు నింపాలి కానీ కాలుష్యాన్ని కాదు.

దీపావళి పండుగ రోజున పెల్చే బాణాసంచాల వలన పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ స్థాయిలో ఉండాల్సిన కాలుష్య తీవ్రత పండుగ సమయంలో తీవ్రంగా పెరుగుతుంది. .ఒక్క టపాసు పేలితే వచ్చే పొగ అయిదువందల సిగరెట్లకు సమానం అన్నది పుణె పరిశోధకుల మాట. పటాకుల వలన వచ్చే శబ్దం వలన ధ్వని కాలుష్యం, పోగ వలన వాతవరణం కలుషితమవుతుంది. టపాసుల నుంచి వెలువడే పొగ పండగ తరవాత కూడా కొన్ని రోజుల పాటు మన పరిసర వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది చాలా మందిలో శ్వాస సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది.  ఇప్పటికే  దేశ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది.

పెద్ద శబ్దాలతో వినికిడి లోపం
బాణాసంచా కాల్చడం వలన వాతవరణ కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం కూడా ఏర్పడుతుంది. పండుగ రోజున విరజిమ్మె క్రాకర్స్ పెద్ద పెద్దగా శబ్దాలు చేయడం వలన చిన్నపిల్లలో వినికిడి లోహం ఏర్పడుతుంది. గుండె సంబంధ వ్యాధులకు లోనయ్యె అవకాశం ఉంటుంది. బాణాసంచాలోని టాక్సిక్ పదార్ధాల వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటితో పాటు పక్షులు జంతువులకు కూడా ముప్పు వాటిలే ప్రమాదముంది. 125డెసిబుల్స్ దాటకూడదని నియమం ఉన్న అంత కు మించిన శబ్దాలు రావడంతో నిద్ర సమస్యలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద శబ్ధాల వల్ల రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినడంతో తాత్కాలికంగానే కాదు పూర్తిగా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

ఊపిరితిత్తులు విషపూరితం
ఇంట్లో ఎవరికైనా ఆస్త్మా, సీఓపీడీ ఉంటే టపాసుల నుంచి వచ్చే పొగవల్ల అది మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. కొన్ని రకాల టపాసుల్లో రకరకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఉదాహరణకు కాపర్, కాడ్మియం మొదలైనవి. ఇవి గాలిలో దుమ్ము రూపంలో పేరుకుపోతాయి. ఈ దుమ్ము ఆస్త్మా ఉన్నవారికి ఎంతో ప్రమాదకారి. దీనివల్ల పైత్యం, తుమ్ములు, జలుబు, తలనొప్పి వంటి రుగ్మతలు కలుగుతాయి. ఈ పండుగ కూడా చలికాలంలో వస్తుంది కాబట్టి పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషపూరితమైన రసాయనాలు ఈ పొగలో కలిసిపోయి మరింత ఇబ్బంది పెడతాయి. ఈ హానికరమైన పొగ వల్ల ఊపిరితిత్తులు కూడా విషపూరితమవుతాయి.

కర్ణభేరికి ప్రమాదం
అధిక శబ్దంతో పేలే బాంబుల వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదముంది. సాధారణంగా యువత శబ్దం ఎక్కువగా వచ్చే టపాసులను పేల్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే వీటి ప్రభావం అప్పటికప్పుడు తెలియకపోయినప్పటికీ నెమ్మదిగా చెవి సంబంధిత రుగ్మతలతో బాధపడక తప్పదు. వీటి వల్ల పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదమైతే లేదు కానీ.. పండగ తరవాత కొన్ని రోజులపాటు వినికిడి లోపంతో ఇబ్బంది మాత్రం తప్పదు.

పటాసుల ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు
దీపావళికి, ఇతర సందర్భాల్లో కాల్చే క్రాకర్స్‌ తయారీలో అనేక రకాల విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని కాల్చిన తర్వాత రసాయనాలన్నీ పీల్చే గాలిలో కలిసి, మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.  మెగ్నీషియం అనే రసాయనం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. జ్వరం, తలనొప్పి, జలుబు, వాంతులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జింక్‌ వల్ల తలనొప్పి, వాంతులు వస్తాయి.- గాలిలో కలసిన సోడియం వల్ల శరీరంపై దద్దుర్లు, చర్మ వ్యాధులు వస్తాయి. ఇది తీవ్రంగా ఉంటే చర్మక్యాన్సర్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాడ్మియం అనే రసాయనాన్ని పీల్చడం అనీమియాకు దారితీస్తుంది. ఎక్కువగా పీలిస్తే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. రక్తహీనత తలెత్తుతుంది. లెడ్‌ శరీరంలోకి ప్రవేశిస్తే నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గాలిలో కలిసిన కాపర్‌ను పీల్చడం వల్ల విపరీతమైన తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. శ్వాస ఆడకపోవడం, విపరీతమైన దగ్గు వస్తుంది. నైట్రేట్‌ అనే రసాయనం మోతాదు మించితే చాలా ప్రమాదం. ఇది మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. చిన్నారులపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. 

కావాల్సింది గ్రీన్ దీపావళి..
అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ వేడుకలైనా పటాకులు లేకుండా జరుగదు. అయినా అక్కడ కాలుష్యం పెరుగకపోవటానికి కారణం జీరో పొల్యూషన్ పటాకుల వినియోగించడమే. అన్నింటికీ మించి సామూహికంగా క్రాకర్ షో ఏర్పాటు చేసుకుని, అందులో సమిష్టిగా పాలుపంచుకొంటారు. మనదగ్గర సాధారణంగా కర్బన పదార్థాలతో పటాకులు తయారుచేస్తారు. విదేశాల్లో మాత్రం నైట్రోజన్ సంబంధిత పదార్థాలతో తయారుచేస్తారు. అమెరికాకు చెందిన కొన్ని కెమికల్, ఇంజినీరింగ్ కంపెనీలు జీరో పొల్యూషన్ క్రాకర్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటివల్ల తక్కువ పొగ రావడంతోపాటు పర్యావరణహితంగా పటాకులు కాల్చుకొనే అవకాశం కలుగుతున్నది. ఇక క్రాకర్ షో వంటి కార్యక్రమాల వల్ల కాలుష్యం ఒక్క చోటికే పరిమితం అవుతుంది. మనదేశంలో కూడా ఎకోఫ్రెండ్లీ పటాసులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో ఈ దీపావళి వేడుకలు జరుపుకుంటే కాలుష్యాన్ని కొంతమేర తగ్గించినవాళ్లం అవుతాం.

ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్‌ కొంత మేలు
దీపావళికి క్రాకర్స్‌ కాల్చడం తప్పనిసరి అని భావిస్తున్న వారంతా ఈ ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్‌ని వినియోగించుకోవడం మంచింది. పటాసులు పేలిస్తేనే పండుగా అని భావించేవారి కోసమే ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. కాన్‌ఫెట్టి, ఫ్లవర్‌ పవర్‌, ఫేక్‌నోట్‌, బర్ట్స్‌, స్నేక్‌మిక్స్‌లాంటి పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మామూలు బాణాసంచాలా కాకుండా, వాతావరణానికి అతి తక్కువ హాని కలిగించే అవకాశం ఉంది. వీటి ధ్వని పరిమిత దూరం వరకే వినిపించడంతోపాటు కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను వెదజల్లుతాయి. కేవలం గన్‌పౌడర్‌, ఫాస్పేట్‌ను మాత్రమే ఉపయోగించి ఆధునిక టెక్నాలజీతో ఈ వెరైటీ బాణాసంచాను తయారు చేస్తున్నారు. అయితే వీటి లభ్యత చాలా స్వల్పంగానే ఉంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
అధిక శబ్దం, విపరీతమైన పొగ వెలువడే టపాసులు కాకుండా చిన్న చిన్న టపాసులను కాల్చండి.
టపాసులను ఆరుబయట మాత్రమే కాల్చండి. వీటిని పేల్చేటప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయండి.
ఎవరైతే ఆస్త్మాతో బాధపడుతున్నారో వారు ఈ సమయంలో తప్పకుండా మందులు వేసుకోవాలి. 
శ్వాసకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్న వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. వీరు టపాసులకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.
టపాసులు కాల్చడం వల్ల వెలువడే రసాయనాల కారణంగా కళ్లు ఎర్రబడకుండా, కంటి నుంచి నీరు కారకుండా ఉండటానికి ట్రాన్స్‌పరెంట్ గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది.
అలాగే చేతులతో పట్టుకుని కాల్చే టపాసులతో కొంచెం జాగ్రత్త వహించాలి. వీటి వల్ల చేతులు కాలే ప్రమాదముంటుంది కాబట్టి ముందుగానే మాస్కులు లేదా గ్లౌజులు వేసుకోవడం మంచిది.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా